కొండగట్టు అంజనేయస్వామి ప్రత్యేకత....

 

అది 2009 సంవత్సరం. తన అన్న చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం తరఫున ప్రచారం చేయడంలో పవన్‌కళ్యాణ్ తలమునకలై ఉన్నారు. ఆ ప్రచారంలో భాగంగానే ఆయన కరీంనగర్‌లో తిరుగుతున్నారు. ఆ సమయంలో పవన్‌ కళ్యాణ్ తలకి ఓ హైటెన్షన్‌ విద్యుత్ వైరు తగిలింది. పదకొండు కిలోవాట్ల కరెంటు ఉన్న ఆ వైరు తగిలితే ఎవరైనా అక్కడికక్కడే చనిపోవాల్సిందే. కానీ అదృష్టవశాత్తూ పవన్‌ కళ్యాణ్‌ ఒక్క గంటలోనే కోలుకున్నారు. ఇదంతా కూడా కరీంనగర్‌లో తన ఇష్టదైవం అయిన కొండగట్టు ఆంజనేయస్వామి దయే అని పవన్‌ నమ్ముతారు. అందుకే ఈసారి జనసేన తరఫున రాజకీయ యాత్రను ఇక్కడి నుంచే ప్రారంభించారు. ఇంతకీ ఈ కొండగట్టు స్వామి నిజంగా అంత మహిమ కల దేవుడేనా అంటే ఆ స్వామి గురించి తెలుసుకోవాల్సిందే!

 

కరీంనగర్‌లోని జగిత్యాలకు ఓ 15 కిలోమీటర్ల దూరంలో ముత్యంపేట అనే ఊరు ఉంది. ఆంజనేయస్వామి సంజీవని పర్వతాన్ని తీసుకువెళ్లేటప్పుడు, అందులో కొంతభాగం ఇక్కడ పడిందట. అదే కొండగట్టు అనే పర్వతంగా మారింది. అక్కడే స్వామివారు స్వయంభువుగా వెలిశారు. మొదట్లో ఆ స్వామి గురించి ఎవరికీ తెలియదు. ఓ అయిదు వందల ఏళ్ల క్రితం సంజీవుడు అనే పశువుల కాపరికి ఆయన కలలో కనిపించి... తన విగ్రహం ఫలానా చోట ఉందనీ, దానికి ఓ గుడి కట్టించమనీ చెప్పారట. అప్పటి నుంచీ ఇక్కడి స్వామి గురించి ప్రపంచానికి తెలుస్తోంది.

 

కొంగడట్టు ఆంజనేయస్వామి విగ్రహానికి రెండు ముఖాలు ఉండటం ఓ విచిత్రం. అందులో ఒకటి హనుమంతునిది కాగా, మరొకటి నరసింహస్వామిది. అలాగే ఈ స్వామి భుజాల మీద శంఖుచక్రాలు, ఛాతీ మీద సీతారాముని రూపాలు కూడా కనిపిస్తాయి. స్వామివారి ఆలయంలోనే ఆండాళ్ తల్లి విగ్రహం, శివలింగాలు కూడా ఉండటం విశేషం. స్వామి గుడి వెనకాల బేతాళస్వామి గుడి ఉంటుంది. అక్కడి బేతాళస్వామికి జంతుబలులు, కల్లు నైవేద్యం అర్పించడం మరో ప్రత్యేకత. స్వామి గుడి ముందు సీతమ్మవారి కన్నీట చారలు కనిపిస్తాయి. అరణ్యవాసంలో రాముడి కష్టాలు చూసి బాధపడిన సీతమ్మ ఇక్కడే కన్నీరు విడిచిందని చెబుతారు.

 

కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకుంటే ఎలాంటి అనారోగ్యమైనా దూరమవుతుందని నమ్ముతారు. గాలిసోకిన వాళ్లని ఈ ఆలయం ముందున్న రావిచెట్టుకి  కట్టేస్తే, వాళ్ల ఒంట్లో ఉన్న దుష్టశక్తులు పారిపోతాయని అంటారు. ఇక సంతానం లేనివారు ఈ స్వామిని 40 రోజుల పాటు పూజిస్తే... తప్పకుండా సంతానం కలుగుతుందట!

 

ఇంత మహిమ కలవాడు కాబట్టే... తెలంగాణలో ప్రజలు కొండగట్టు ఆంజనేయస్వామిని తమ ఇలవేల్పుగా భావిస్తారు. అయ్యప్పమాల లాగా ‘కొండగట్టు అంజన్న’ మాల ధరిస్తారు. చిరంజీవి కుటుంబసభ్యులకి కూడా కొండగట్టు ఆంజనేయస్వామి అంటే చాలా నమ్మకం. దానికి వవన్‌ కళ్యాణ్ ఎపిసోడ్ కూడా తోడవడంతో... ఇప్పుడు ఆ నమ్మకం ఓ సెంటిమెంటుగా మారిపోయింది.  https://www.youtube.com/watch?v=qCaT3FIC7Mk

 


More Hanuman