సంపూర్ణ కార్తీక మహాపురాణము

ముప్పదియవ రోజు పారాయణము

 

 

Sampoorna Karthika Maha Purananam 30th Day Parayanam

 

ఏకోన త్రిశంతితమాధ్యాయము
   
సూత ప్రోక్తమైన విషయాలను వినిన ఋషులు - "ఓ మునిరాజా రావిచెట్టు యెందువలన అంటరానిదయ్యింది. అయినప్పటికీ శనివారంనాడు మాత్రం ఎందుకు పూజనీయతను పొందింది? అని ప్రశ్నించగా సూతర్షి వారిని సమాధాన పరచసాగాడు.
   
రావిచెట్టు - దరిద్రదేవత: పూర్వం క్షీరసాగర మధనంలో లభించిన అనేక వస్తువులలో లక్ష్మినీ కౌస్తుభాన్నీ శ్రీహరికి సమర్పించి - తక్కిన సంపదనంతా దేవతలు తీసుకున్నారు. శ్రీహరి శ్రీదేవిని పెండ్లి చేసుకోదలచాడు. కాని శ్రీదేవి 'ఓ నారాయణా! నాకన్నా పెద్దది నా అక్కయ్య ఉన్నది. ఆ జ్యేష్ఠకు పెండ్లి గాకుండా కనిష్ఠనయిన నేను కళ్యాణమాడటం పాడిగాదు గనుక - ముందామె మవునుకై సంకల్పించ'మని కోరింది. ధర్మబద్దమైన 'రమ' మాటలనంగీకరించి, విష్ణువు - ఉద్దాలకుడనే మునికి జ్యేష్ఠాదేవిని సమర్పించాడు.

స్థూలవదన, అశుభ్రరదన, అరుణనేత్రి, కఠినగాత్రి, బిరుసు శిరోజాలు గలిగిన జ్యేష్ఠాదేవిని, ఉద్దాలకుడు తన ఆశ్రమానికి తెచ్చుకున్నాడు.
   
దరిద్ర దేవతకు ఇష్టమైన స్థలములు: నిరంతర హొమధూమ సుగంధాలతోనూ, వేదనాదాలతోనూ నిండిన ఆ ఆశ్రమాన్ని చూసి, పెద్దమ్మ దుఃఖిస్తూ - 'ఓ ఉద్దాలకా! నాకీ చోటు సరిపడదు. వేదాలు ధ్వనించేదీ, అతిథిపూజా సత్కారాలు జరిగేవీ, యజ్ఞయాగాదులు నిర్వహించబడేవీ అయిన స్థలాలలో నేను నివసించను. అన్యోన్యానురాగం గల భార్యభర్తలు వున్న చోటగాని, పితృదేవతలు పూజింపబడే చోట గాని, ఉద్యోగస్తుడు -నీతివేత్త- ధర్మిష్టుడు- ప్రేమగా మాటలాడే వాడు - గురుపూజా దురంధరుడూ వుండే స్థలాలలోగాని, నేను ఉండను.

 ఏ ఇంటిలో అయితే రాత్రింబవళ్ళు ఆలుమగలు దెబ్బలాడుకుంటూ వుంటారో, ఏ యింట్లో అతిధులు నిరాశతో ఉసూరుమంటారో ఎక్కడయితే వృద్దులకు, మిత్రులకు, సజ్జనులకు అవమానాలు జరుగుతుంటాయో, ఎక్కడయితే దురాచారాలూ, పరద్రవ్య, పరభార్యాపహరణశీలురైన వారుంటారో - అలాంటి చోటులోనయితేనే నేను వుంటాను. కల్లు తాగేవాళ్ళు, గోహత్యలు చేసేవాళ్ళు, బ్రహ్మహత్యాది పాతక పురుషులూ యెక్కడ వుంటారో నేనక్కడ వుండటానికే ఇష్టపడతాను' అంది.

 

 

Sampoorna Karthika Maha Purananam 30th Day Parayanam  
 

రావి మొదట్లో జ్యేష్ఠావాసం: ఆమె మాటలకు వేదవిదుడైన ఆ ఉద్దాలకుడు కించిత్తు నొచ్చుకున్నవాడై -'ఓ జ్యేష్ఠా! నీవు కోరినట్లుగా నీకు తగిన నివాసస్థానాన్ని అన్వేషించి వస్తాను. అంతవరకూ నువ్వీ రావిచెట్టు మొదట్లోనే కదలకుండా కూర్చో'మని చెప్పి బయలు దేరి వెళ్ళాడు. భర్తాజ్ఞ ప్రకారం జ్యేష్ఠాదేవి రావిచెట్టు మొదలులోనే అలాగే వుండిపోయింది. ఎన్నాళ్ళకీ ఉద్దాలకుడు రాకపోవడంతో పతి విరహాన్ని భరించలేని పెద్దమ్మ - పెద్దపెట్టున దుఃఖించసాగింది. ఆమె రోదనలు వైకుంఠంలో వున్న లక్ష్మీనారాయణుల చెవులలో పడ్డాయి. వెంటనే లక్ష్మి - తన అప్పగారిని నూరడించవలసిందిగా విష్ణువును కోరింది. విష్ణువు కమలా సమేతుడై జ్యేష్ఠాదేవి యెదుట ప్రత్యక్షమయి, ఆమెని ఊరడించుతూ - 'ఓ జ్యేష్ఠాదేవి! ఈ రావిచెట్టు నా అంశతో కూడి వుంటుంది. కనుక, నువ్వు దీని మూలంలోనే స్థిరనివాసం ఏర్పరచుకుని వుండిపో. ప్రతి ఏటా నిన్ను పూజించే గృహస్థులయందు లక్ష్మి నివసిస్తూ వుంటుంది' అని చెప్పాడు. ఆ నియమాలలోనే ప్రతి శనివారం రావిచెట్టు పూజనీయగానూ, అక్కడ జ్యేష్ఠాదేవిని షోడశోపచార విధిని అర్పించే స్త్రీలపట్ల శ్రీదేవి అమిత కరుణాకలితయై అనుగ్రహించేటట్లున్నూ యేర్పరచాడు శ్రీహరి.
   
'ఓ ఋషులారా! సత్యభామకు శ్రీకృష్ణుడు చెప్పినట్లుగా - నారదుని చేత పృథు చక్రవర్తికి చెప్పబడిన విధానంగా, నేను మీకీ పద్మపురాణాంతర్గత కార్తీక పురాణాన్ని వినిపించాను. ఎవరయితే ఈ కార్తీక మహాత్మ్యాన్ని చదువుతున్నారో, వింటున్నారో, వినిపిస్తున్నారో వారు సమస్త పాపాల నుండీ విడివడి విష్ణు సాయుజ్యాన్ని పొందుతున్నారు.

అని సూతుడు చెప్పగా విని సంతసించిన ఋషులు - అక్కడి నుంచీ బదరీవన దర్శనాకాంక్షులై పయనమయ్యారు.
   
        ఇరువది తొమ్మిదీ, ముప్పది - అధ్యాయములు ముప్పదియవ (బహుళ అమావాస్య) రోజు పారాయణము సమాప్తము
       
        పోలి స్వర్గమునకు (వైకుంఠమునకు) పోవుట.

 

 

 

Sampoorna Karthika Maha Purananam 30th Day Parayanam

 

   
ఆంద్రదేశమున పవిత్ర కృష్ణానదీ తీరమున బాదర' అను గ్రామముండెను. ఆ గ్రామములో నివసించుచున్న అన్ని వర్ణముల వారును అన్నిటను సంపన్నులైయుండిరి. పాడి పంటలు, భోగభాగ్యములు, సుఖశాంతులు మున్నగువానితో ఆ గ్రామము సంతోషపూర్ణమై యుండెను.
   
ఆ గ్రామములో 'పోతడు' అను పేరుగల చాకలివాడొకడు కలడు. అతని భార్య 'మాలి' క్రూర స్వభావురాలు. దయాదాక్షిణ్యములు లేనిదై గయ్యాళియని పేరు పడెను. వారికి నల్గురు కుమారులు కలరు. ఆ దంపతులు - తమ కుమారులు నలుగురికిని తగిన సమయములయందు వివాహము చేసిరి. మొదటి ముగ్గురు కోడళ్లను తమ అత్తగారివలెనే పొగరుబోతు స్వభావము కలిగి చెడ్డ పేరును తెచ్చుకొనిరి. అత్తగారితో సమానముగా గయ్యాళితనమును, చెడు స్వభావమును కలిగియుండిరి. నాలుగవ కోడలు 'పోలి' మృదు స్వభావురాలు, భర్తయందు ఆసక్తి కలిగియుండెను. ఊరి వారి బట్టల మాలిన్యమును పోగొట్టి స్వచ్చతను కలిగించు 'పోతడు' మాత్రము తన కుటుంబ సభ్యుల దుష్టస్వభావముచే నేర్పడిన తన కుటుంబంలోని మాలిన్యమును పోగొట్టలేని స్థితిలో నుండెను. దీనికి తోడు వాని నిర్ధనత్వము కూడా వానిని బాధించుచుండెను. చిన్నకోడలైన 'పోలి'ని తన భార్యయగు 'మాలి' మిగిలిన కోడళ్లును దూషించుట, బాధించుట గమనించియు నిస్సహాయుడై యూరకుండెను. అత్తయగు 'మాలి', మిగిలిన తోడికోడళ్లను యింటిపనులన్నిటిని 'పోలిపై వదలిరి. ఇంటి పనులన్నింటిని మారు మాట్లాడక తలవంచి చేయుచున్న ఆమె పై జాలియైన లేక- ఆమెపై చాడీలు చెప్పి ఆమె భర్తచే 'పోలి'ని కొట్టించి, తిట్టించి సంతోషపడుచుండిరి. ఈ విధముగ తనను, అత్త, తోడికోడళ్లు, అనేక విధములుగ బాధించుచున్నను, భర్తకు చాడీలు చెప్పి కొట్టించుచున్నను, తిట్టించుచున్నను, 'పోలి' తన శాంత స్వభావమును, దైవభక్తిని, ధర్మకార్యాసక్తిని విడువక కాలమును గడుపుచుండెను.
   
ఇట్లుండగా కార్తీకమాసము వచ్చెను. గ్రామములోని వారందరును కార్తీకమాస స్నానములను చేయుటకై కృష్ణానదికి పోవుచుండిరి. నదిలో స్నానము చేసి తీరమున దీపములు వెలిగించుచు పూజలను చేయుచుండిరి. ఇట్లు గ్రామము నుండి నదీస్నానమునకు, దీపారాధనకు, పూజలకు చాలామంది వెళ్లిరి. అట్లు వెళ్లిన వారిలో నిజమైన భక్తులు కొందరుందురు. కొందరు, తామును వారికివలె పూజ మున్నగువానిని చేసి పుణ్యమును సంపాదింపవలయునని తలచి నదీస్నానము మొదలగువానిని చేయుదురు. మరికొందరు తామును మిగిలిన వారివలె చేయనిచో బాగుండదని వచ్చి మిగిలిన వారి వలె నదీస్నానమును, మిగిలిన వానిని ఆచరింతురు. ఇట్టి వీరందరిని చూచి వినోదించుటకై కూడా మరికొందరు నదీస్నానము మొదలగు వానికి తయారగుదురు.

 

 

Sampoorna Karthika Maha Purananam 30th Day Parayanam

 

   పోలి అత్త 'మాలి' యను ఆమె కోడళ్ళు ముగ్గురును 'పోలి'ని యింటి వద్ద నుంచి నదీస్నానమునకు వెళ్లిరి. ఇంటిపనిని, బాధ్యతను 'పోలి'కి అప్పగించిరి. నదీ స్నానమునకు బోయి స్నానము, దీపారాధన మున్నగు వానిని చేయునప్పుడు 'మాలి' మున్నగు వారి దృష్టి దైవముపై, దైవ కార్యముపై లేదు. మనస్సును చేయుపనిపై నిలుపలేదు. భక్తి వారిలో మొదటి నుండియు లేదు. స్నానము మొదలగు వానిని చేయుచున్నను వారు, 'పోలి' యింటివద్ద పాలను త్రాగుచున్నదేమో, పెరుగు, వెన్న మొదలగు వానిని తినుచున్నదేమో? లేక వానిని అమ్ముకొని సొమ్ము చేసుకొని దాచుకొనుచున్నదేమో' అని అనేక విధములుగ తలచుకొనుచు, తమ తలపులను మాటలలో పక్కవారికి తెలుపుకొనుచు, తమ బుద్దిని, మనసును 'పోలి'ని ఆడిపోసికొనుటయందు నిలిపిరి. వారి శరీరములు అవయవములు నదీస్నానమును, దీపారాధనమును, దైవ దర్శనమును చేయుచున్నవి. వారు కేవలము 'పోలి'కి చెందిన పరధ్యాసలో మనస్సును, స్నానము మొదలగు వానిలో శరీరములను  'పోలి'ని నిందించుటలో మాటలను నిలిపిరి. ఈ విధముగా కార్తీకమాసమును కృష్ణాతీరమున వారు గడిపిరి. వ్రతోద్యాపనకై మార్గశిర శుద్ద పాడ్యమినాడు కృష్ణాతీరమునకు చేరిరి.

ఇక యింటనున్న 'పోలి' నిస్సహాయురాలు. అత్తగారికి, తోడికోడళ్లకును సమాధానమును కూడా చెప్పలేని స్థితిలోనున్నది. భర్తయు తన తల్లి మాటలను, వదినల పలుకులను వినును, నమ్మును. తనను (పోలి) పట్టించుకొనడు. నదీస్నానము, దీపారాధన మున్నగు వానిని చేయువలయుననియున్నను, యింటి బాధ్యతకు బంధితురాలైన ఆమె తన భక్తిని, నదీ స్నానాదుల యందలి కోరికను, దైవ, ధర్మ కార్యాసక్తిని తనలోనే దాచుకొనెను. అత్తకు, తోడికోడళ్ళకు సమాధానము చెప్పలేదు. తననొక సాటి జీవిగనైన తలచని వారి మానవత్వమునకేమి చేయును?
   
అప్పుడామె నిస్సహాయ రీతిలో  నింటి బాధ్యతలను, యింటి పనులను చేయుచు నింటిలోనే యున్నదై తన మనసులో నిట్లనుకొనెను - 'దీనరక్షణ! గోవిందా! జనార్దనా! స్వామీ! దీనబంధూ! నేనేమి చేయగలను. అశక్తురాలను, నిస్సహాయురాలను, నా అత్త, తోడికోడళ్ళు, నన్ను విడిచి నదీతీరమునకేగి, స్నాన, దీపారాధన మున్నగు వానిని చేయుచున్నారు. వారివలె నాకును - 'పుణ్యమును సంపాదించవలెను. భగవంతుని పూజింపవలయును' అని యుండునని భావింపకపోయిరి.
   
నేనేమియు చేయలేకున్నాను. పవిత్రనదీ స్నానము లేదు. స్పూర్తినిచ్చు దీపారాధన లేదు. మనసునకు ప్రశాంతతనిచ్చు దైవదర్శనము పూజ, పురాణ శ్రవణము యేవియును లేవు. ఏమి చేయుదును. నా కెట్టి గతి కలుగునో కదా! నేనెంత దురదృష్టవంతురాలను' అని ఆమె బహు విధములుగ విచారించెను.

 

 

Sampoorna Karthika Maha Purananam 30th Day Parayanam

 


తన మనసులో భగవంతుని ధ్యానించుచునామె, తన పరిస్థితికిలోబడి, యింటిలో కుండలోనున్న నీటితో స్నానమాచరించెను. చినిగిన వస్త్రమును ధరించిన ఆమె తాను ధరించిన జీర్ణవస్త్రము యొక్క అంచును చించి వత్తిగ చేసెను. దానికొక పాత్రలో నుంచి కవ్వమున  కంటిన కొద్దిపాటి వెన్ననుదీసి, ఆ పాత్రయందుంచి, దీపమును వెలిగించి, "స్వామీ! పుండరీకాక్షా! గోవిందా! జనార్దనా! అనాథరక్షకా! దీనబంధూ! దయ జూపుము. నేనశక్తురాలను. నాపై ననుగ్రహము నుంచుమ"ని పోలి ప్రార్ధించెను.
   

 

ఇట్లు దీనావస్థలో వున్న పోలిని వైకుంఠమున వున్న దయాసముద్రుడగు శ్రీ మహావిష్ణువు గమనించెను. ఆమెపై అనుగ్రహము కలిగెను. ద్వారపాలకుడైన సుశీలుడను వానిని జూచి, ఓయీ! నీవీమెను వెంటనే సగౌరవముగా బంగారు విమానము నెక్కించి తీసికొని రమ్మని ఆజ్ఞాపించెను. సుశీలుడను వెంటనే 'పోలి' వున్న చోటునకు బంగారపు విమానముతో వచ్చి 'ఓ సాధ్వీ! మంచి నడవడిక గల ఉత్తమురాలా! నిన్ను యీ శరీరముతోనే వైకుంఠమునకు తీసికొని రమ్మని శ్రీ మహావిష్ణువు పంపెను. కావున వెంటనే వచ్చి యీ విమానమును ఎక్కుము రమ్మ'ని తొందరపెట్టెను. ఆమెను విమానముపై నెక్కించుకొనుచుండెను.
   
అప్పుడే వ్రతోద్యాపనము చేసికొని 'పోలి' అత్త 'మాలి', మిగిలిన తోడికోడళ్లు ముగ్గురును యింటికివచ్చిరి. 'మాలి' జరిగిన దానిని తెలిసికొని తాకును వైకుంఠమును చేరవలయునని తలచి విమానముతో నెగురబోవు 'పోలి' పాదములను పట్టుకొనెను. 'మాలి' పెద్ద కోడలు తన యత్తయగు 'మాలి' పాదములను పట్టుకొనెను. . అట్లే ఆమె పాదములను రెండవ కోడలు, రెండవ కోడలి పాదములను మూడవ కోడలు పట్టుకొనిరి. ఈ విధముగ వైకుంఠమునకు విమానములో పోవుచున్న 'పోలి' పాదములను పట్టుకొని అత్త 'మాలి' ఆమె పాదములను పట్టుకొని పెద్దకోడలు, ఆమె పాదములను పట్టుకొని రెండవ కోడలు, ఆమె పాదములను పట్టి వ్రేలాడు మూడవ కోడలు, చూచువారికి విచిత్ర దృశ్యమును కల్పించిరి.
   
వైకుంఠ విమానమును నడిపించు సుశీలుడు వీరిని జూచెను. వారు 'పోలి'ని పెట్టిన బాధలను గుర్తుకు తెచ్చుకొనెను. శ్రీ మహావిష్ణువు మాటలను 'పోలి'పై ఆయనకు గలిగిన దయను గమనించెను. మీరు మంచివారు కారు. 'పోలి'ని చూచి అసూయపడి ఆమెను బహువిధములుగ బాధించిరి. మీరు దుష్టులు. మీరు నదీ స్నానము, దీపారాధనము, దైవదర్శనము, పూజ, పురాణశ్రవణము మున్నగువానిలో పాల్గొన్నను, మనసులో 'పోలి'ని దూషించుచు, పాలు, పెరుగు, నెయ్యి మొదలగు యింటి విషయములను తలచిరి. 'పోలి'పై అసూయపడిరి. కావున మీరు దుష్టులు. మీరు వైకుంఠమునకు రాదగిన వారు కారు. కుంభీపాకము మొదలగు నరకములే మీకు దగినవి. ఆటకుపొండని సుశీలుడు పలుకుచు చేతిలో వున్న కత్తితో 'మాలి' చేతులను నరికెను. అప్పుడు మాలి, ఆమె కోడళ్ళు ముగ్గురును కిందపడిరి.
   
సుశీలుడు మిక్కిలి ప్రేమాదరణలతోను, మహావైభవముగా 'పోలి'ని వైకుంఠమునకు తీసికొని పోయెను. ఈ విధముగా పోలి శ్రీ మహావిష్ణువు దయకు పాత్రురాలైనది. 'పోలి' వృత్తాంతము వలన ఈ కింది విషయములు గమనింపదగి వున్నవి.భగవంతుని యందు నిర్మలమైన భక్తి వుండవలెను. ఆ భక్తిలో తన్మయత్వము వుండవలెను. పూజలోని ఆడంబరములుగాని, పూజ చేయువారి ఆడంబరముగాని భగవంతుని మొగమాట పెట్టవు. ఇతరులను చూచి అసూయపడుట, వారిని బాధించుట భక్తులైన వారికి వుండరాదు. అట్టివారు 'మాలి' మొదలగువారు. పరిశుద్దమైన భక్తి మాత్రమే, నిరాడంబరమైనను భగవంతునకు ప్రీతి కలిగించును. దిక్కు లేని వారికి దేవుడే దిక్కు.

కావున మనలో ప్రతి యొక్కరును, అసూయాద్వేషములను విడిచి నిర్మలమైన భక్తితో ఉన్నంతలో యధాశక్తిగ భగవంతుని చేరుటకు 'పోలి'వలె యత్నింపవలెను. 'మాలి' మున్నగువారు సంసారములోని మాయకు గుర్తులు కాగా, 'పోలి' నిర్మల, నిశ్చల భక్తికి ప్రతీక. అట్టి భక్తికి కులము, సంపన్నత మున్నగునవి లేవు. మనమును అట్లగుటకు యత్నించుట మంచిది.

 

 

Sampoorna Karthika Maha Purananam 30th Day Parayanam

 


 

30 వ రోజు

నిషిద్ధములు        :- పగటి ఆహారం, ఉసిరి

దానములు         :- నువ్వులు, తర్పణలు, ఉసిరి

పూజించాల్సిన దైవము     :- సర్వదేవతలు + పితృ దేవతలు

జపించాల్సిన మంత్రము    :- ఓం అమృతాయ స్వాహా మమసమస్త పితృదేవతాభ్యో నమః

ఫలితము         :- ఆత్మస్థయిర్యం, కుటుంబక్షేమం          

 


More Kartika Maha Puranam