సంపూర్ణ కార్తీక మహాపురాణము

మూడవ రోజు పారాయణము

 

 

 

పంచమాధ్యాయము

'ఓ శివధనుస్సంపన్నా! జనకరాజా! శ్రద్దగా విను. మనము చేసిన పాపాలన్నింటినీ- నశింపచేయగల శక్తి ఒక్క కార్తీక మాస  వ్రతానికి మాత్రమే వుంది. కార్తీకమాసములో విష్ణుసన్నిధిని  ఎవరయితే భగవద్గీతా పారాయణమును చేస్తారో - వారి పాపాలన్నీ కూడా పాము కుబుసములాగా తొలగిపోతాయి. అందునా పదీ - పదకొండు అధ్యాయాలను పారాయణ చేసేవారు -  వైకుంఠానికి క్షేత్రపాలకులవుతారు. ఎవరయితే కార్తీకమాసంలో తులసీదళాలతోగాని, తెలుపు లేదా నలుపు గన్నేరు పూలతో గాని విష్ణుపూజను చేస్తారో -వాళ్లు వైంకుఠానికి చేరి, విష్ణు సమభోగాలననుభవిస్తారు. ఈ కార్తీకమాసంలో హరిహరులెవరి సన్నిధినైనా సరే - ఏ పురాణాన్నయినా సరే ప్రవచించేవారు సర్వ కర్మబంధ విముక్తులవుతారు.

 

కార్తీక  వనభోజనము

 

Sampoorna Karthika Maha Purananamu 3nd Day Parayanam

 

శ్లో" యః కార్తీకే సితే వనభోజన మాచరేత్
     సయాతి వైష్ణవం ధామ సర్వపాపైః ప్రముచ్యతే !!


కార్తీకమాస శుక్లపక్షంలో వనభోజనము చేసినవారు - పాపవిముక్తులై విష్ణుధామాన్ని పొందుతారు. జప, హోమ, పూజా, భోజన, తర్పణ ఫలాలతో - పాపీ క్షుద్ర ఛండాలాది అశౌచవంతుల యొక్క సంభాషణలను వినిన పాపం తుడిచి పెట్టుకు పోతుంది. కాబట్టి మహారాజా! కార్తీకమాస శుక్లపక్షంలో అన్నిరకాల వృక్షాలతో బాటుగా ఉసిరిచెట్టు కూడా వున్న తోటలోనే వనభోజనమును ఏర్పాటు చేసుకోవాలి. ఉసిరి చెట్టు క్రింద సాలగ్రామము నుంచి, గంధ పుష్పాక్షతాదులతో పూజించి, యధాశక్తి బ్రాహ్మణుల నాహ్వానించి గౌరవించి, వారితో కలసి భోజనము చేయాలి.  ఇలాగున - కార్తీక మాసములో వనభోజనాన్ని యెవరయితే నిర్వహిస్తారో,  వాళ్లు ఆయా కాలాలలో చేసిన సర్వపాపాల నుంచీ తెములుకుని, విష్ణులోకాన్ని పొందుతారు. జనకజనపతీ! ఈ కార్తీక మహాత్మ్యాన్ని భక్తిశ్రద్ధలతో విన్న  బ్రహ్మణుడొకడు దుర్యోనీ సంకటము నుంచీ రక్షింపబడ్డాడు. కథ చెబుతాను విను.

 


దేవదత్తోపాఖ్యానము:

 

Sampoorna Karthika Maha Purananamu 3nd Day Parayanam

 

పూర్వం కావేరీ తీరములో దేవశర్మ అనే సద్భ్రాహ్మణుడుండేవాడు. అతనికొక పరమ దుర్మార్గుడయిన కుమారుడు కలిగాడు. అతని పేరు  దేవదత్తుడు. అతగాడి దుష్ట ప్రవర్తనలను గుర్తించిన తండ్రి, అతగాడిని పాపవిముక్తుని చేయాలని సంకల్పించి 'నాయనా! రోజూ కార్తీక ప్రాతః స్నానాన్ని ఆచరించు. సాయంకాలమున హరి సన్నిధిలో దీపారాధనమును చేస్తూ వుండు. ఈ విధంగా కార్తీక వ్రతాన్ని ఆచరించి ధన్యుడివికా' అని చెప్పాడు. కాని  దుర్వర్తనుడయిన ఆ బ్రాహ్మణ పుత్రుడు -  తానటువంటి కట్టుకథలను నమ్మననీ, కార్తీక వ్రతాన్ని  ఆచరించననీ - తండ్రికి యెదురుతిరిగాడు. అందుకు కినిసిన దేవశర్మ తన కుమారుడిని 'అడవిలోని చెట్టు తొర్రలో యెలుకవై పడివుండు' అని శపించాడు. శాపానికి భయపడిన ఆ విప్రకుమారుడు తండ్రి పాదాలబడి, తనకు తరణోపాయం చెప్పమని కోరగా -  ఆ తండ్రి ' నాయనా ! నీ వెప్పుడైతే కార్తీక మహాత్మ్యాన్ని సంపూర్ణముగా వింటావో అప్పుడే నీ యెలుక రూపము పోతుం'దని - శాపవిముక్తి అనుగ్రహించాడు.


దేవదత్తునికి శాపవిముక్తి:

 

 

Sampoorna Karthika Maha Purananamu 3nd Day Parayanam

 

 

పితృశాప కారణంగా అప్పటికప్పుడే మూషికరూపాన్ని ధరించిన బ్రాహ్మణ యువకుడు గజారణ్యములో ఫలవంతమైనదీ  - అనేక జంతువుల కాధారభూతమైనదీ అయిన  ఒకానొక మహావృక్ష కోటరములో మనసాగాడు. ఇలా కొంతకాలము గడిచాక, ఒకానొకప్పుడు మహర్షియైన విశ్వామిత్రుడు శిష్య సమేతంగా కార్తీక స్నానమాచరించి వచ్చి, ఆ యెలుక వున్న చెట్టు మొదలునందు దువిష్ణుడై తన పరివారానికి పరమపావనమైన కార్తీక మహాత్మ్యాన్ని వినిపించసాగాడు.


ఆ సమయంలో దయాహీనుడూ, పాపాలపుట్టా, అడవి జీవాలను హింసించి పొట్టపోసుకునేవాడూ అయిన ఒక కిరాతకుడాప్రాంతాలకు వచ్చాడు. పుణ్యపురుషుల దర్శనమువల్ల ఉపకారమేగాని, అపకారము యేనాడూ జరుగదు. అదేవిధముగా, విశ్వామిత్రాది తపోబృంద దర్శనమాత్రం చేత - రవంత పశ్చాత్తప్తుడూ - జ్ఞానీ అయిన ఆ కిరాతకుడు వారిని సమీపించి 'అయ్యా ! మీరు చెప్పుకుంటున్న కథలేమిటి? అని వింటూంటే - నాకీ కిరాతక జీవితం  పట్ల చిరాకు పుడుతోంది. దయచేసి ఈ రహస్యమేమిటో చెప్పండి' అనగానే, అతనిలో వివేకం విచ్చుకుంటున్న వైనమును గమనించిన విశ్వమిత్రుడు - 'నాయనా! మేము కార్తీక వ్రతాన్ని ఆచరిస్తున్నాము. ఈ కార్తీక మాసములో యెవరయినా సరే తెలిసిగాని, తెలియకగాని స్నాన దాన జప తపః పురాణ శ్రవణాదును చేసినట్లయితే వారు వారి సర్వ పాపాలనుంచీ విముక్తులవుతారు. ఈ వ్రతాన్ని భక్తితో ఆచరించేవాళ్లు జీవన్ముక్తులవుతారు' అని  తెలియజేశాడు. ఈ విధముగా కిరాతకునికి చెబుతూన్న కార్తీక మహాత్మ్యాన్ని వినడమే తడవుగా - తొర్రలోనున్న యెలుక తన శాపగ్రస్తరూపాన్ని వదలివేసి, పూర్వ యువ బ్రాహ్మణ రూపాన్ని పొంది - విశ్వామిత్రాదులకు ప్రణమిల్లి తన  పూర్వవుగాధను వినిపించి, ఆ బుషులనుండి సెలవు తీసుకొని తన  ఆశ్రమానికి తరలిపోయాడు. అనంతరము ఆ కిరాతకుడు కూడా విశ్వామిత్రాదుల వలన కార్తీక మహత్మ్యాన్ని కడకంటా తెలుసుకోవడం వలన - ఆ జన్మకి కిరాతకూడయ్యీ కూడా - దేహంతరాన ఉత్తమగతులను పొందాడు. కాబట్టి ఓ జనకరాజా! ఉత్తమ గతులను కోరేవారు ప్రయత్నపూర్వకముగా నయినాసరే కార్తీక వ్రతమాచరించాలి. లేదా, కనీసము కార్తీక మహాత్మ్యాన్నయినా భక్తి శ్రద్దలతో వినాలి.


పంచమోధ్యాయ స్సమాప్త:  


షష్ఠాధ్యాయము

 

 

Sampoorna Karthika Maha Purananamu 3nd Day Parayanam

 

 

శ్రీ వశిష్ఠుడు చెబుతున్నాడు రాజర్షీ, జనకా! ఈ కార్తీక మాసము ముప్పయి రోజులు కూడా - ఎవరైతే శ్రీమహావిష్ణువును కస్తూరీ, గంథాదులతోనూ, పంచామృతములతోనూ అభిషేకిస్తారో వారికి పదివేల అశ్వమేధాలు చేసిన ఫలితము లభిస్తుంది. కార్తీక మాసములో సంధ్యావేళ విష్ణుసన్నిధిలో దీపారాధనమును చేసినా, దీపదానము చేసినా వారు విష్ణులోకాన్ని పొందుతారు. ప్రత్తిని శుభ్రపరచి దానితో వత్తిని చేసి, బియ్యప్పిండి లేదా గోధుమపిండితో ప్రమిదను చేసి ఆవునేతిని పోసి, ఆ ప్రతివత్తిని తడిపి వెలిగించి ఒకానొక సధ్భ్రాహ్మణుని ఆహ్వానించి, చివరి రోజున వెండి ప్రమిదను, భమిడి వత్తినీ చేయించి, వాటిని బియ్యపు పిండి మధ్యన వుంచి, పూజా నివేదనాదులను పూర్తిచేసి, బ్రహ్మణులకు భోజనము పెట్టి అనంతరము - తాము స్వయంగా


దీపదానమంత్రము

 

 

Sampoorna Karthika Maha Purananamu 3nd Day Parayanam

 



  

మంత్రం :  సర్వజ్ఞాన ప్రదం దీపం సర్వసంప చ్చుభావహం !
                 దీపదానం ప్రదాస్వామి శాంతిరస్తు సదామమ!!


'జ్ఞానమునూ, సంపదలనూ,శుభములనూ కలిగించే దైవ, దీపదానాన్ని చేస్తున్నాను. దీని వలన నాకు నిరంతరము శాంతి, సుఖము లేర్పడుగాక' అని చెప్పుకుంటూ, పిండితో సహా ఆ దీపాన్ని బ్రాహ్మణునికి దానం చేయాలి. అలా చేసినవారు అక్షయమైన పుణ్యాన్ని పొందుతారు. ఈ  ఈ దీపదానము వలన విద్య, జ్ఞాన, ఆయుర్వృద్ధి, అనంతరము స్వర్గభోగాలూ కలుగుతాయి. మనోవాక్కాయ కృత పాపాలన్నీ సమసిపోతాయి. నిదర్శనార్ధమై ఒక కథను వినిపిస్తాను విను.


లుబ్ధ వితంతువు మోక్షమందుట

 

 

Sampoorna Karthika Maha Purananamu 3nd Day Parayanam

 


పూర్వం ద్రావిడ దేశములో ఒక అనాథ వితంతు వుండేది. ఆమె రోజూ భిక్షాటనమును చేసి, వచ్చిన దానిలో - మంచి అన్నమునూ, కూరలని విక్రయించి తాను దూషితాన్నముతో తృప్తిపడుతూ డబ్బును వెనకేయసాగినది. ఇతరుల యిండ్లలో వంటపనులు, కుట్టుపనులు మొదలైనవి చేస్తూ ప్రతిఫలముగా వారి వద్ద కొంత ద్రవ్యాన్ని తీసుకుంటూ వుండేది. అదిగాక  ద్రవ్యభిక్షాటన కూడా చేసేది. ఇలా నిత్య ధనార్జనాలగ్నమానసయైన ఆ వితంతువు డబ్బు సంపాదించడమే తప్ప  యేనాడూ హరినామస్మరణ చేయడంగాని, హరికథనో, పురాణాన్నో వినడంగాని, పుణ్యతీర్ధ సేవనమునుగాని, ఏకాదశీ వుపవాసమును గాని చేసి యెరుగదు. ఇటువంటి లుబ్ధరాలింటికి దైవవశాన - శ్రీరంగ యాత్రీకుడైన ఒక బ్రహ్మనుడు వచ్చి - ఆమె స్ధితిని చూసి -  ఆమెకు నరకము తప్పదని గుర్తించి, జాలిపడి - ఆమెను మంచి దారిలో పెట్టదలచి -

 

Sampoorna Karthika Maha Purananamu 3nd Day Parayanam

 

'ఓ అమాయకురాలా! నేను చెప్పేది శ్రద్దగా విని ఆలోచించుకో. ఈ కేవలము చీమూ - నెత్తురూ - మాంసమూ - ఎలుకలతో కూడుకుని సుఖదుఃఖ లంపటమై వున్నదే తప్ప, ఈ తోలు శరీరము వట్టి అశాశ్వతమని తెలుసుకో. నేల, నీరు, నిప్పు, నింగి, గాలి - అనే పంచభూతాత్మకమైనదే ఈ శరీరము. ఈ దేహము నశించగానే ఆ పంచభూతములు కూడా - ఇంటి కొప్పు మీద కురిసి నలుదిక్కులకూ చెదరిపోయే వాననీళ్లలా - చెదరిపోతాయి. నీటి మీద నురుగులాటి నీ తనువు నిత్యము కాదు. ఇది శాశ్వతమని నమ్ముకున్నట్లయితే - ఆశల అగ్నిలో పడే మిడతలవలె మసి కావడమే తప్ప మేలనేది లేదు. మోహాన్ని, భ్రమలనూ వదలి పెట్టు. దైవమొక్కడే శాశ్వతుడనీ, సర్వభూతదయకారుడనీ గుర్తించు. నిరతమూ హరిచరణాలనే స్మరించు. కామమంటే - కోరిక, కోపమంటే - దురాగ్రహం, భయమంటే - ఆత్మనాత్మీయ భంగత, లోభమంటే - ధనవ్యయచింత, మోహమంటే - మమతాహంకారాలు - ఇటువంటి ఈ ఆరింటినీ వదలిపెట్టు. నా మాటవిని, యికనుంచయినా కార్తీకమాసములో ప్రాతఃస్నానాన్ని ఆచరించు. విష్ణుప్రీతికై భగవదర్పణంగా దీపదానము చెయ్యి. తద్వారా అనేక పాపాల నుంచి రక్షించబడతావు' అని హితవు చెప్పి, తనదారిన తాను వెళ్లిపోయాడు.

 

Sampoorna Karthika Maha Purananamu 3nd Day Parayanam

 

 

అతగాడి వచోమహిమ వలన ఆమెకు జ్ఞానోదయమైంది. తను చేసిన పాపాలకై చింతించినది. తానుకూడా కార్తీక వ్రతాన్ని చేయాలని సంకల్పించినది. అందుచేత ఆ  సంవత్సరములో వచ్చిన కార్తీకమాసాననే వ్రతాచరణమును ప్రారంభించినది. సూర్యోదయ వేళకల్లా చన్నీళ్ల స్నానమును,  హరిపూజ, దీపదానము, పిదప పురాణ శ్రవణము - ఈ  విధముగా కార్తీక మాసము నెల రోజులూ ఆచరించి చివరిరోజున చక్కగా బ్రహ్మణసమారాధన కూడా చేసినది. తక్షణమే ఆమె బంధాలు నశించిపోయినదై. విగతాసువై విమానారూఢురాలై, శాశ్వత స్వర్గభోగ సౌఖ్యాలను పొందినది. కాబట్టి 'రాజా! కార్తీకమాసములో అన్నిటికంటే ప్రధానమైనది దీపదానము. తెలిసిగాని, తెలియకగాని యెవరైతే దీపదానము చేస్తున్నారో వారు తమ పాపాలను నశింప చేసుకొన్నవారే అవుతున్నారు. దీనిని వినినా, చదివినా జన్మ సంసార బంధ విముక్తులై విష్ణుభక్తి పరాయణులవుతారు.


ఏవం శ్రీస్కాంద పురాణాంతర్గత కార్తీక మహాత్మ్యే షష్ఠోధ్యాయ స్సమాప్త:

 

 

Sampoorna Karthika Maha Purananamu 3nd Day Parayanam

 

 

3 వ రోజు


నిషిద్ధములు :- ఉప్పు కలిసినవి, ఉసిరి

దానములు :- ఉప్పు

పూజించాల్సిన దైవము :- పార్వతి

జపించాల్సిన మంత్రము :- ఓం పార్వత్యై - పరమేశ్వర్యై స్వాహా

ఫలితము  :- శక్తి, సౌభాగ్యము


మూడవ రోజు పారాయణము సమాప్తము


More Kartika Maha Puranam