భజగోవిందం

 

 

హైందవ ధర్మానికి ఒక కొత్త దశనీ, దిశనీ అందించినవారు జగద్గురువు శ్రీ ఆదిశంకరాచార్యులు. భారతదేశం నలుదిక్కులా సంచరిస్తూ, హైందవ ధర్మంలో పరస్పర విరుద్ధంగా కనిపించే నమ్మకాలన్నింటినీ ఒక తాటి మీదకు తెస్తూ తన జీవితాన్ని ధర్మ సంస్థాపన కోసం వెచ్చించిన ధన్య జీవి. ఒక పక్క హిందూ ధర్మానికి పునాదిగా భాసిల్లే భగవద్గీత వంటి గ్రంథాలకు భాష్యాలను రాస్తూ... మరో పక్క శివానందలహరి, సౌందర్యలహరి వంటి కవితాత్మక స్త్రోత్రాలను అక్షరబద్ధం చేస్తూనే భారతదేశం నాలుగు దిక్కులలోనూ నాలుగు మఠాలను స్థాపించి హిందూతత్వాన్ని సుస్థిరం చేశారు. జీవుడు, దేవుడు ఇద్దరూ ఒక్కటే అన్న అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన ఆచార్యులు శంకరులు. ఇంత విశిష్టమై జీవితం గడిపిన వ్యక్తి కాబట్టే ఆయనను సాక్షాత్తూ శంకరుని అవతారంగా భావించేవారూ లేకపోలేదు.

శంకరులవారి రచనలలో భజగోవింద శ్లోకాలకి గొప్ప ప్రాధాన్యం ఉంది. సాధారణంగా శంకరులవారి రచనలన్నీ జ్ఞానయోగంలో సాగుతాయి. కానీ చిత్రంగా భజగోవిందం మాత్రం భక్తిమార్గంలో నడుస్తుంది. గోవిందుని తలుచుకోమంటూ హెచ్చరిస్తుంది. ప్రముఖ రాజకీయ, ఆధ్యాత్మికవేత్త సి.రాజగోపాలాచారి ప్రకారం ఇదేమీ చిత్రమైన విషయం కాదు. జ్ఞానం పరిపక్వమైతే అది భక్తిగా మారక తప్పదు అంటారు రాజగోపాలాచారి. భజగోవింద శ్లోకాల ఆవిర్భావానికి కారణం అంటూ ఒక కథని చెబుతూ ఉంటారు పెద్దలు. శంకరాచార్యులవారు తన పధ్నాలుగుమంది శిష్యులతో కలిసి కాశీలో సంచరిస్తుండగా... ఒక ముదుసలి వ్యాకరణ సూత్రాలను వల్లె వేయడం వారికి కనిపించిందట. కాటికి కాచుకున్న నాడు కూడా ఇంకా డబ్బు కోసమూ, లౌకిక జ్ఞానం కోసమూ తపిస్తున్న ఆ ముదుసలి తీరుని చూసి కోపగించుకున్న శంకరులవారు భజగోవిందలోని తొలి శ్లోకాన్నీ ఆ తరువాత 12 శ్లోకాలనీ ఆశువుగా చెప్పారట.

శంకరుల వారి కవితాధారతో స్ఫూర్తినొందిన శిష్యలు తాము కూడా తలా ఒక శ్లోకాన్ని చెప్పారట. చివర్లో శంకరుల వారు మరో నాలుగు శ్లోకాలను జోడిస్తూ భజగోవింద పఠనాన్ని ముగించారట. శ్లోకాల సంఖ్య గురించీ, వాటిలో ఎవరెన్ని పాడారన్న విషయం గురించి చిన్న చిన్న బేధాభిప్రాయాలు లేకపోలేదు. కొందరి లెక్క ప్రకారం ఇందులో 31 శ్లోకాలు ఉంటే మరికొందరు వాటిని 33గా పేర్కొంటారు. అయితే ఇందులో ఉన్న బోధ ఎంత అద్భుతమైనదన్న విషయమై ఎవరికీ ఎలాంటి అనుమానం లేదు!

భజగోవింద పఠనంలో తొలి శ్లోకమే అన్నింటిలోకీ మకుటాయమానంగా నిలుస్తుంది. చెప్పదల్చుకున్న విషయం ఏమిటో సూటిగా, సున్నితంగా చెప్పేస్తుంది. అది...

భజగోవిందం భజగోవిందం
గోవిందం భజ మూఢమతే
సంప్రాప్తే సన్నిహితే కాలే
నహి నహి రక్షతి డుకృఞ్కరణే

ఓ మూర్ఖుడా! అంత్య దశ సమీపించినప్పుడు నిన్ను ఈ ‘డుకృఞ్కరణే’ తరహా వ్యాకరణ సూత్రాలు ఏమీ రక్షించవు. కాబట్టి ఆ గోవింద నామాన్ని స్మరించు... అన్నది ఈ శ్లోకం చెబుతున్న మాట. భజగోవిందంలోని మిగతా శ్లోకాలు కూడా ఈ వాదననే బలపరుస్తూ సాగుతాయి. అటు స్పష్టంగానూ, ఇటు లయబద్ధంగానూ సాగే భజగోవిందం అంటే ఇష్టపడనివారు ఉండరు. అందులో చెప్పే నిత్య సత్యాలకు ఒప్పుకోని వారూ ఉండరు. అందుకే అన్ని కాలాలలోనూ, అందరికీ నచ్చిన భజన గీతంగానూ, స్తోత్రమాలగానూ భజగోవిందం మిగిలిపోయింది.

- నిర్జర.


More Good Word Of The Day