సత్యమేవ జయతే- ఇది మన జాతీయ నినాదం అని పసిపిల్లలని అడిగినా కూడా చెబుతారు. కానీ ఈ నినాదాన్ని మన ఉపనిషత్తులలోంచి గ్రహించారన్న విషయం చాలా కొద్ది మందికి మాత్రమే పరిచయం. ఇంతకీ ఆ ఉపనిషత్తు ఏమిటో, దాని ప్రాధాన్యత ఏమిటో...

గౌతమబుద్ధుడు తను కనుగొన్న ధర్మం గురించిన తొలి ప్రవచనాన్ని సార్‌నాథ్‌లో అందించాడు. అందుకు గుర్తుగా సార్‌నాథ్‌ని గొప్ప పుణ్యక్షేత్రంగా భావించేవారు. బుద్ధుడి ఆలోచనాతీరుతో ప్రభావితం అయిన అశోకుడు, ఇక్కడ ఒక స్థూపాన్ని ప్రతిష్టించాడు. దాని మీద మూడు సింహాలు ఉన్న మకుటం కనిపిస్తుంది. ఆ గుర్తుననే మన జాతీయచిహ్నంగా తీసుకున్నారు. దాంతో పాటుగా ‘సత్యమేవ జయతే’ అన్న సూక్తిని ముండక ఉపనిషత్తు నుంచి స్వీకరించారు.

హిందూ సంప్రదాయంలో 108 ఉపనిషత్తులలో పది ఉపనిషత్తులను ప్రముఖమైనవిగా గుర్తిస్తారు. వాటిలో ముండక ఉపనిషత్తు ఒకటి. శౌనకుడు అనే శిష్యునికీ, అంగీరసుడు అనే జ్ఞానికీ జరిగిన సంభాషణగా ఈ ఉపనిషత్తు కనిపిస్తుంది. బ్రహ్మే ఈ సృష్టికి ఆది అన్న భావంతో ఈ ఉపనిషత్తు మొదలవుతుంది. ఆ తర్వాత ‘కస్మిన్ను భగవో విజ్ఞాతే/ సర్వమిదం విజ్ఞాతం భవతీతి’ (దేనిని తెలుసుకోవడం వల్ల ఈ ప్రపంచం అంతా అవగతమవుతుంది) అన్న ప్రశ్నతో విషయం వేడెక్కుతుంది. ఈ ప్రశ్నకు సమాధానంగా నిజమైన విద్య అంటే ఏమిటి? బ్రహ్మజ్ఞానం ఎలా లభిస్తుంది? దాని లక్షణాలు ఏమిటి?... లాంటి నిగూఢమైన ప్రశ్నలకు జవాబు కనిపిస్తుంది.

ఇతర ఉపనిషత్తులతో పోల్చుకుంటే ముండక ఉపనిషత్తు కాస్త విప్లవాత్మకంగానే ఉంటుంది. కర్మకాండలకన్నా, క్రతువులకన్నా జ్ఞానానికే అధిక ప్రాధాన్యత ఇస్తుంది ఈ ఉపనిషత్తు. అందుకనే దీనికి ముండక ఉపనిషత్తు అన్న పేరు వచ్చిందని చెబుతారు. ముండక అంటే జుట్టు తీసేసిన అని అర్థం. శిరోముండనం చేయించుకునే సన్యాసులని ఉద్దేశించింది కాబట్టి ఈ పేరు పెట్టారని అంటారు. ఈ ఉపనిషత్తు చదివిన తర్వాత భవబంధాల మీద మమకారం తీరిపోతుందనే సూచనగా ఈ పేరు వచ్చిందనే వాదనా వినిపిస్తుంది.

ముండక ఉపనిషత్తులో మూడు ముఖ్యమైన భాగాలు ఉన్నాయి. వీటిని ముండకాలు అంటారు. మూడవ ముండకంలోని మొదటి ఖండంలోని ఆరవ మంత్రం నుంచే ‘సత్యమేవ జయతే’ అన్న నినాదాన్ని గ్రహించారు. ఆ మంత్రం ఇలా సాగుతుంది...

సత్యమేవ జయతే నానృతమ్
సత్యేన పంథా వితతో దేవయానః
యేనాక్రమంతి ఋషయో హి ఆప్తాకామా
యత్ర తత్సత్యస్య పరమం నిధానమ్॥

‘సత్యం ఒక్కటే జయిస్తుంది. దైవాన్ని చేరుకునేందుకు ఆ సత్యంతోనే మార్గం ఏర్పడుతుంది. నిష్కామమైన రుషులంతా ఆ సత్యమార్గం ద్వారానే పరమాత్మను చేరుకుంటారు,’ అన్నదే పై శక్లోకంలోని భావం. ఇందులోని మొదటి పాదాన్ని పండిత మదన్‌మోహన్ మాలవ్యా ప్రచారంలోకి తీసుకువచ్చారు. స్వాతంత్ర్య సంగ్రామంలో బ్రిటిషర్లను ఎదిరించి ధైర్యంగా నిలిచేందుకు ఈ సూక్తి ఒక మంత్రంలా పనిచేసింది. తర్వాత ఇదే సూక్తిని జాతీయ నినాదంగా రూపొందించారు. మూడు సింహాల రాజముద్ర ఉన్న ప్రతి సందర్భంలోనూ ఈ నినాదాన్ని కూడా ప్రచురించి తీరాల్సిందే అని ప్రభుత్వం ఆదేశించింది.

- నిర్జర.


More Bhakti Content