సమాజం మన ప్రతిబింబం

 


అద్దంలో మన ప్రతిబింబం ఎలా వుంటుంది? మనమేం చేస్తే అదే చేస్తుంది. మనతోపాటు సమానంగా మనం నవ్వితే నవ్వుతుంది. ఏడిస్తే ఏడుస్తుంది. అచ్చంగా ప్రపంచం కూడా అంతే. చాలాసార్లు మనం సంతోషం, బాధ బయటి వారి మీద ఆధారపడి వుంటాయని ప్రగాఢంగా నమ్ముతాం. కానీ, మనం చూసే విధానంపై ఆధారపడి వుంటాయని గుర్తించం. అందుకే చూడండి. చాలామంది వాళ్ళకి బాధ కలగగానే అందుకు ఎవరో ఒకరు కారణంగా చూస్తారు. చివరికి తను చేసే పొరపాటుకి కూడా కారణం ఎదుటి వ్యక్తులే అని నమ్ముతారు. ‘‘తనలా ప్రవర్తించబట్టే నాకు అంత కోపం వచ్చింది. వాళ్ళు అలా అనబట్టే నేను అరిచాను’’ ఇలా ప్రవర్తనలోని లోటుపాట్లకి ఎదుటివాళ్ళని బాధ్యులుగా చేయటం వల్ల మనలో ఏమన్నా మార్పు రావాలా అన్న విషయంపై అస్సలు దృష్టి పెట్టం. దీనికి సంబంధించి ఓ కథ చెప్పుకుందాం.

పూర్వం ఓ పెద్ద అడవిలో ఓ గురుకులముండేది. అక్కడ చాలామంది శిష్యులు గురువుగారి దగ్గర ఎన్నో విద్యలు నేర్చుకుంటూ వుండేవారు. అందులో ఆ రాజ్యపు రాజకుమారులు ఇద్దరు కూడా వున్నారు. సహజంగానే రాజకుమారులు అనేసరికి మిగిలినవారు వారిని ప్రత్యేకంగా చూస్తుంటారు. అందులో చిన్నవాడికి కాస్త కోపం ఎక్కువ. ఈ గురుకుల వాతావరణం, పరిస్థితులు ఏమాత్రం నచ్చవు. దాంతో అదరిమీద ఆ అబ్బాయికి ఏదో ఒక ఫిర్యాదు వుంటూ వుండేది ఎప్పుడూ. పెద్దబ్బాయి ప్రశాంతంగా తన పనేదో తాను చేసుకుంటూ వుండేవాడు. అందరితో మంచిగా వుండేవాడు. అయితే చిన్నవాడు పెద్దవాడి మీద కూడా అలిగేవాడు. నిన్ను అందరూ ఇష్టపడతారు. నువ్వే అందర్నీ నాకు దూరం చేస్తున్నావు అంటూ కోపగించుకునేవాడు. ఇలా వీరిమధ్య స్పర్థలు గురువుగారి దాకా వెళ్ళాయి. గురువుగారు ఇద్దర్నీ పిలిపించి మాట్లాడతారు. చిన్నవాడు ఆశ్రమంలోని మిగతా పిల్లలు తనని బాధపెడుతున్నారని, అలాగే అన్నయ్య కూడా తనని తక్కువ చేస్తున్నాడని... ఇలా ఎన్నో చెబుతాడు.

ఇది ఇలా వుండగా, ఒకసారి గురువుగారు శిష్యులందరినీ అడవికి వెళ్ళి వంటచెరుకు ఏరుకు రమ్మంటారు. శిష్యులందరూ ఆడుతూ పాడుతూ ఉషారుగా వంటచెరుకు ఏరే పనిలో వుంటారు. అంతలో ఎక్కడినుంచో పులుల గాండ్రింపు వినిపిస్తుంది. భయంతో అందరూ దగ్గర్లోని చెట్లని ఎక్కుతారు. చూస్తుండగానే ఓ నాలుగు పులులు అక్కడకి వస్తాయి. పెద్దగా గాండ్రిస్తున్న ఆ పులులని చూసి శిష్యులంతా చాలా భయపడతారు. దొరికితే కండకండలుగా ముక్కలు చేయడం ఖాయమని ప్రాణాలు గుప్పెటపెట్టి ఆ పులులు వెళ్ళడం కోసం ఎదురుచూస్తుంటారు. ఇంతలో దూరాన్న గురువుగారు రావడం గమనిస్తారు. అయ్యో... గురువుగారు ఇటు వస్తున్నారు. ఆ పులులు ఏం చేస్తాయో అనుకుంటారు. గట్టిగా అరిచి చెప్పడానికి, ఎక్కడ ఆ పులులు మీదపడతాయో అని భయపడతారు. ఇంతలో గురువుగారు ఆ పులులకి దగ్గరగా వచ్చేస్తారు. అడవిలో వనమూలికలని ఏరుకుంటూ అటుగా వచ్చిన గురువుగారు పులుల దగ్గరగా వెళ్ళి వీపు నిమురుతారు. ఆశ్చర్యం పులులు అతనిని ఏమీ అనవు. అతను వీపున తట్టి, వెళ్ళండి అనగానే అవి నెమ్మదిగా అక్కడి నుంచి వెళ్ళిపోతాయి.

ఇలా పులులు గురువుగారిని ఏమీ అనకుండా పక్కకి తప్పుకుని వెళ్ళిపోగానే శిష్యులంతా వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటారు. గురువుగారికి వశపరచుకునే విద్య తెలుసని, పులులని వశీకరణం చేసుకున్నారని... ఇలా మాట్లాడుకోవడం చిన్న రాకుమారుడి చెవిలో పడుతుంది. అందరూ తను చెప్పినట్టు వినాలంటే ఆ విద్య ఏదో తానూ నేర్చుకోవాలనుకుంటాడు. ఆరోజు  సాయంత్రం గురువుగారి దగ్గరకి వెళ్ళి, ‘‘గురువుగారూ... అందరూ నా మాట వినాలి కాబట్టి నాకు ఆ వశీకరణ విద్య నేర్పించండి’’ అంటాడు. అందుకు గురువుగారు నాకే విద్యలూ తెలియవు అనగానే ‘‘మరి పులులు మీ మాట ఎలా విన్నాయి?’’ అంటాడు. అందుకా గురువుగారు నవ్వి, అతనని దగ్గరలోని తటాకం దగ్గరకి తీసుకుని వెళతాడు. ఆ తటాకంలోకి తొంగిచూస్తూ నవ్వమంటాడు, అరవమంటాడు. ఇలా ఆ రాకుమారుడిలో అన్ని భావోద్వేగాలూ పలికిస్తాడు. తటాకంలోని ప్రతిబింబం కూడా అదే ప్రతిఫలిస్తుంది. అప్పుడు చెబుతారు గురువుగారు. నువ్వేం చేస్తావో నీ ప్రతిబింబమూ అదే చేస్తుంది. సమాజమే అంతే. నువ్వు ప్రేమిస్తే నీకు ప్రేమనిస్తుంది. నువ్వు ద్వేషిస్తే  ద్వేషాన్నే ఇస్తుంది. పులులని క్రూరమ‌ృగాలుగా నేను చూడలేదు. వాటిని ప్రేమతోనే చూశాను. అందుకే అవీ నన్ను బాధపెట్టలేదు. క్రూర జంతువులే మనం మచ్చిక చేసుకుంటే ఆ ప్రేమకి లొంగిపోతాయి. మరి మనుషులు ఎలా వుండాలి?

ఎన్నోసార్లు కలిగిన బాధకంటే, ఆ బాధకి ఎదుటి వ్యక్తులే కారణమనే విషయమే ఎక్కువ బాధిస్తుంది. ఎప్పుడూ ఎవరో ఒకరి మీద ఫిర్యాదు వుంటుంటే, ఆ మనసు నిత్య అగ్నిహోత్రమే. ఎప్పటికీ ఆ మంటలకి ఏదో ఒకటి చేరుతూనే వుంటుంది. ఆ మంటలు ఆరవు. మనసుకి ప్రశాంతత దక్కదు. దానికి తన, పర భేదముండదు. పక్కనున్న వారి నుంచి ఏమాత్రం పరిచయం లేనివారిదాకా అందరిపై కోపం వస్తుంది. ప్రశాంతంగా వుండరు... ఉండనివ్వరు. అందుకే అగ్నిని రాజేయనే కూడదు. మానసికవేత్తలు చెప్పే విషయం ఒక్కటే. మనసుకి ఏ భావాన్ని అలవాటు చేస్తారో, ఆ భావానికి అది అలవాటు పడిపోయి, ఆ భావానికి లొంగిపోతుంది. అందుకే కోపం కాదు.. ప్రేమని దానికి అలవాటు చేయాలి అంటున్నారు. ఏమంటారు?

-రమ


More Good Word Of The Day