హోమం విశిష్టత

 

 

కేవలం తాను బతకటం కోసం మాత్రమే కాక, కొంతవరకు నిస్వార్థంగా ఇతరుల కోసం ఆలోచించి, పని చేసేవారికే మంచి మనస్సు వుంటుంది. అలా మంచి మనసున్న వారినుంచే మంచి మాటలు వస్తాయి. మహర్షులు ఎన్నో సందర్భాలలో 'పరోపకారార్ధమిదం శరీరమ్' అని చెప్పారు. చెప్పటమే కాదు, ఆచరణలో చూపించారు. బహుశా అందుకే కావచ్చు మహర్షులకు వాక్ శుద్ధి వుండేది. వారు ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా ఇతరుల కోసం ఎంతో కొంత చేసేవారు.

 

మహర్షులు మాట్లాడేది తప్పకుండా జరిగేది. మహర్షులు వివిధ ప్రయోజనాల కోసం రకరకాల హోమాలు చేసేవారు. తమ ఆశయాలను నెరవేర్చుకునేవారు. ఇక్కడ గమనించవలసిందే ఏమంటే మహర్షుల కోరికలన్నీ నేరుగా కానీ, అంతర్గతంగా కానీ ప్రజల కోసమే ఉద్దేశించి వుండేవి - అంటే లోక కళ్యాణం కోసం అన్నమాట!

 

ఈ మధ్య కూడా శ్రీశైలం దగ్గర జరిగిన హోమం సందర్భంగా ఆకాశంలోంచి పెను పరిమాణంలో పెద్ద శిల నదీ జలాల్లో పడటం, జలాలు తాటి చెట్టు ఎత్తున పైకి లేవటం పేపర్లలో కూడా వచ్చింది.

 

హోమాల్లో ఎన్నో రకాల సమిధలు వాడవలసి వుంది. ఒక్కో సమిధ ఒక్కో గ్రహానికి సంబంధించినదై వుంటుంది. అంటే అన్ని గ్రహాలూ సమతుల్య స్థితిలో వుంటేనే సృష్టి సక్రమంగా వుంటుంది. అంటే వ్యాధులు లేకపోవటం, వర్షాలు సక్రమంగా పడటం ఇలాంటివి జరుగుతాయి. 

 

ఈ హోమ ఫలాలు వ్యక్తిగతంగా కూడా అందుకునే విధంగా జ్యోతిష్యవేత్తలు కొన్ని సూచనలు చేశారు. ఎవరైనా ఒక వ్యక్తిపై నవగ్రహాలలో ఏదో ఒక గ్రహ ప్రభావం తక్కువగా వుంటే దానికి సంబంధించిన రంగంలో లేదా విషయంలో ఆ వ్యక్తికి వ్యతిరేక ఫలితాలు వస్తాయి. ఏ వ్యక్తి అయితే వ్యతిరేక ఫలితాలను అనుభవిస్తున్నాడో ఆ వ్యక్తి ఇంట్లో హోమం చేయిస్తే చక్కటి ఫలితాలు వస్తాయి.

 

ఉదాహరణకు రవి(సూర్యుని) గ్రహ ప్రభావం బాగా తగ్గిపోయి, అదే సమయంలో ఇతర గ్రహాలూ కూడా అననుకూలంగా మారితే, ఆ వ్యక్తికి మృత్యువు రావచ్చు లేదా ఆయుష్షు పరంగా తీవ్ర నష్టం జరగవచ్చు. దీనిని నివారించేందుకు రవికి సంబంధించిన ఉపశాంతి చేయమని సూచిస్తారు. తరచుగా హోమాలను ప్రమాద నివారణకు కూడా సూచిస్తారు.

 

ఈ హోమాలలో రకరకాల మూలికలు వాడతారు. శని గ్రహం అనుకూలత కోసం శమీ వృక్ష సమిధను, రాహువు కోసం గరిక ఉపయోగిస్తే, సూర్యానుగ్రహం కోసం అర్క సమిధను ఉపయోగిస్తారు. కేతు గ్రహ ఉపశాంతికి దర్భను ఉపయోగిస్తారు. 

 

ఆయుర్వేదం ప్రకారం అర్క-లో కుష్టు వ్యాధిని నయం చేసే శక్తి వుంది. శరీరంలో ఉత్పన్నమయ్యే వివిధ రకాల దోషాలను పోగొట్టగలిగే శక్తి ఈ మూలికకు వుంది. అలాగే చంద్ర గ్రహ శాంతి కోసం మోదుగను వాడతారు. అటు వైద్య పరంగా చూస్తే జీర్ణ వ్యవస్థను అద్భుతంగా పునరుజ్జీవింప చేసే శక్తి మోదుగకు వుంది. రక్తాన్ని శుభ్రపరుస్తుంది. రావి చెట్టును గురు గ్రహోపశాంతి కోసం ఉపయోగిస్తారు. ఇది వివిధ కప దోషాలను రూపుమాపుతుందని ఆయుర్వేదంలో వుంది.

 

ఈ విధంగా చూస్తే హోమం ప్రత్యక్షంగా మన ఆరోగ్యానికి, పరోక్షంగా నవగ్రహాలపై ప్రభావం చూపుతుందని అర్థం అవుతుంది. అయితే, హోమ క్రమం గురించి క్షుణ్ణంగా తెలిసినవారు హోమం చేస్తేనే హోమ ఫలం అందుతుంది.

 


More Enduku-Emiti