ముస్లింలు కొలుచుకునే కృష్ణుని అవతారం – రామ్‌దేవ్‌

 

 

 

మనం ఇప్పుడు చెప్పుకోబోతున్న రామ్‌దేవ్‌ ఈనాటివారు కాదు. ఎప్పుడో 14వ శతాబ్దంనాటి రాజవంశానికి చెందినవారు. అప్పట్లో రాజస్తాన్‌లోని పోకరాన్‌ అనే ప్రాంతాన్ని తోమర్‌ రాజవంశీయులు ఏలేవారు. ఆ వంశంలోని ఓ రాజుగారి పేరు అజ్మల్‌. జైసల్మేరుకి చెందిన మినాల్‌దేవితో ఆయన వివాహం జరిగింది. కానీ ఎన్నేళ్లు గడిచినా కూడా అజ్మల్‌కి పుత్రసంతానం లేకపోయింది. తన తరువాత రాజ్యానికి వారసునిగా ఎవరూ మిగలరేమో అన్న బెంగతో క్రుంగిపోయాడు రాజా అజ్మల్‌. చివరికి తన ఇష్టదైవమైన కృష్ణుని వేడుకునేందుకు ద్వారకకు వెళ్లాడు.

ద్వారకకు చేరుకున్న అజ్మల్‌ అక్కడి ఆలయంలోని కృష్ణుని విగ్రహం ముందు తెగ విలపించసాగాడు. అతని ఏడుపులు, అరుపులు చూసి విసుగెత్తిపోయిన ఆలయ పూజారి సముద్రంలో మునిగిపోయిన ద్వారకా నగరానికి వెళ్లి నీ ఏడుపేదో అక్కడే ఏడిస్తే ఫలితం ఉంటుందని చెప్పాడట. ఏదో తనని వదలించుకోవడానికి చెప్పిన మాటలనే నమ్మి ఆ రాజు ఈతకొట్టుకుంటూ ద్వారక సమీపంలో మునిగిపోయిన నగరాన్ని చేరుకున్నాడు. అజ్మల్ నిబద్ధతను గమనించిన కృష్ణుడు నిజంగానే ఆయనకు దర్శనమిచ్చి, తానే స్వయంగా అజ్మల్‌ ఇంట జన్మస్తానని వరాన్ని ఒసగాడు. ఇది జరిగిన కొన్ని ఏళ్లకే అజ్మల్‌ ఇంట వీరామ్‌దేవ్‌, రామ్‌దేవ్‌ అని ఇద్దరు కుమారులు జన్మించారు.

రామ్‌దేవ్‌ చిన్నప్పటి నుంచి కూడా అలౌకిక శక్తులను ప్రదర్శించేవాడు. అతని మహిమలను చూసి పోకరాన్ రాజ్య ప్రజలంతా విస్తుపోయేవారు. వాటిలో కొయ్యగుర్రం కథ గురించి ప్రత్యేకంగా చెప్పుకొంటారు. పసివాడైన రామ్‌దేవ్‌కు ఓ కొయ్యగుర్రాన్ని తయారుచేయమంటూ అజ్మల్ ఓ వడ్రండిని కోరాడు. ఇందుకోసం చందనపు చెక్కనీ, గుర్రాన్నీ అలంకరించేందుకు ఖరీదైన బట్టనీ ఇచ్చాడట. కానీ ఆ వడ్రంగి మాత్రం ఆ బట్టలోని చాలాభాగాన్నంతా దొంగిలించేసి, పైపైమెరుగులు దిద్ది గుర్రాన్ని అంటగట్టాడు. రామ్‌దేవ్‌ ఎప్పుడైతే ఆ గుర్రాన్ని ఎక్కాడో వెంటనే దాంతో సహా గాల్లోకి ఎగిరి మాయమైపోయాడట. ఎందుకిలా జరిగిందో అర్థం కాక అజ్మల్ ఆ వడ్రంగిని బెదిరించగానే, అతను తన నేరాన్ని ఒప్పుకున్నాడట.

 

 

రామ్‌దేవ్ బాల్యం ఇలా చిలిపిచేష్టలతో గడిస్తే, అతని యవ్వనం అంతా తన చెంతకు వచ్చినవారి కష్టాలను తీర్చడంతో సాగిపోయింది. ధనికాబీదా తేడా లేకుండా, పెద్దాచిన్నా బేధం రాకుండా తన చెంతకి ఎవరు ఏ బాధతో వచ్చినా వాటిని తీర్చేవారంట రామ్‌దేవ్‌. రాజుగా తన అధికారాలతోనూ, అవతార పురుషునిగా తన మహిమలతోనూ రాజ్యంలోని ప్రజల వెతలను తీర్చేవారట. అందుకనే రామ్‌దేవ్ పేరు అచిరకాలంలోనే ఉత్తరాది భారతాన్ని దాటుకుని విదేశాలకు సైతం పాకిపోయింది.

మక్కాలో రామ్‌దేవ్‌ గురించి విన్న ఒక ఐదుగురు పీర్లు ఆయనను పరీక్షించేందుకు పోకరాన్‌కు చేరుకున్నారు. వారిని ఘనంగా ఆహ్వానించిన రామ్‌దేవ్‌ వారికి భోజనం ఏర్పాటు చేశారు. అయితే తాము కేవలం రోజూ తినే పళ్లేలలోనే తింటామనీ, మరే పాత్రలోనూ భుజించమని తేల్చిచెప్పారట ఆ పీర్లు. దానికి రామ్‌దేవ్ చిరునవ్వుతో... ‘మరేం ఫర్వాలేదు. మక్కాలోని మీ పాత్రలు స్వయంగా ఇక్కడికి వస్తున్నాయి,’ అని చెబుతుండగా తమ పాత్రలు గాల్లో తేలుకుంటూ రావడం చూసి ఆ పీర్లు ఆశ్చర్యపోయారట. ఆ సంఘటనతో డంగైపోయిన పీర్లు తమ మరణం వరకూ కూడా రామ్‌దేవ్‌ చెంతనే ఉంటూ ఆయనను కొలుచుకోసాగారు. అప్పటినుంచీ రామ్‌దేవ్‌ను ‘రామ్‌షా పీర్’ పేరుతో ముసల్మానులు సైతం పూజించుకుంటున్నారు.

రామ్‌దేవ్‌ బాబా ఈ భూమ్మీద జీవించింది కేవలం 33 సంవత్సరాలే. 1442 భాద్రపద శుక్ల ఏకాదశినాడు ఆయన తన తనువుని చాలించారు. పోకరాన్‌కు 12 కిలోమీటర్ల సమీపంలోని ‘రామ్‌దేవరా’ అనే ప్రాంతంలో ఆయన సమాధిని దర్శించవచ్చు. ఆ సమాధి చెంతనే ఆయన వద్ద ఉండిపోయిన ఐదుగురు పీర్ల సమాధులు కూడా కనిపిస్తాయి.

కేవలం రామ్‌దేవ్‌ తనువు చాలించిన చోటే కాదు ఉత్తరాదిలో అనేక ప్రాంతాలలో రామ్‌దేవ్‌ను కొలుచుకునేందుకు బ్రహ్మాండమైన ఆలయాలను నిర్మించారు. మన హైదరాబాదులోనూ ఆయన పేరిటి ఆలయాలు ఉన్నాయి. ఇక పాకిస్తాన్‌, కెన్యావంటి విదేశాలలో సైతం ఆయన ఆలయాలు ఉన్నాయి. కులమతాలకు అతీతంగా ఇప్పటికీ ఈ రామ్‌దేవ్‌ను ప్రజలు ప్రార్థిస్తూనే ఉన్నారు. అలా కొలిచినవారి ప్రార్థనలు నిష్ఫలం కావన్నది భక్తుల నమ్మకం.

- నిర్జర.

 


More Purana Patralu - Mythological Stories