గురు పౌర్ణమి రోజున వ్యాసుని ఎందుకు పూజించాలి..?

 

 

వ్యాసమహర్షి ఆషాఢపౌర్ణమి రోజున జన్మించాడు కాబట్టి, ఆ రోజుని వ్యాసపౌర్ణమిగా పేర్కొంటారు. కానీ ఆదే రోజుని గురుపౌర్ణమిగా ఎందుకు భావిస్తాం అంటే చాలా స్పష్టమైన కారణాలే కనిపిస్తాయి. వ్యాసుని అసలు పేరు కృష్ణద్వైపాయనుడు. నలుపు రంగులో ఉన్నవాడు కాబట్టి కృష్ణ అనీ, ద్వీపం (ద్వైపాయనము) మీద జన్మించినవాడు కాబట్టి ద్వైపాయనుడు అనీ ఆ పేరు వచ్చిందంటారు. అప్పటివరకూ ఉన్న వేదాలన్నింటినీ ఒక చోటకు చేర్చి, వాటిని నాలుగు భాగాలుగా విభజించాడు కాబట్టి ఈ కృష్ణద్వైపాయనుడు ‘వేదవ్యాసుడు’గా మారాడు.

వేదవ్యాసుడు అనగానే మహాభారతం కూడా గుర్తుకు వస్తుంది. వ్యాసుడు మహాభారత రచయితే కాదు, అందులో ఒక ముఖ్య పాత్ర కూడా! ఇంకా చెప్పాలంటే వ్యాసుడు లేనిదే భారతం లేదు. వ్యాసుని కారణంగానే దృతరాష్ట్రుడు, పాండురాజు, విదురులు జన్మించారు. అంటే వ్యాసుడు లేకపోతే కౌరవపాండవులే ఉండేవారు కాదన్నమాట! పైగా వ్యాసుని తల్లి సత్యవతి, భీష్ముని తండ్రి అయిన శంతనుని వివాహం చేసుకుంటుంది. అంటే! భీష్ముని దగ్గర్నుంచీ భీముని వరకూ ప్రతి ఒక్కరూ వ్యాసునికి బంధువులే!

వ్యాసుడు భారతాన్నే కాదు, భాగవతం సహా అష్టాదశ పురాణాలనీ రాశాడనీ... యోగసూత్రాలకు భాష్యాన్ని అందించాడనీ అంటారు. ఇక బ్రహ్మసూత్రాలను రాసింది కూడా వ్యాసుడే అని చెబుతారు. అంటే హిందూ సంస్కృతికి మూలమైన శాస్త్రాలన్నింటికీ వ్యాసుడు మూల పురుషుడన్నమాట. అలాంటి వ్యాసుని గురుపరంపరకు ప్రతినిధిగా భావించి, ఆయన పుట్టినరోజుని గురువులను ఆరాధించే గురుపౌర్ణమిగా జరుపుకోవడంలో ఆశ్చర్యం ఏముంది!

- నిర్జర.

 

 


More Guru Purnima