రంగుల పండుగ హోలీ

Colorful Festival Holi

 

తెలుపు, నలుపు, ఆకుపచ్చ, పసుప్పచ్చ లాంటి అనేక రంగులు సందడి చేస్తోంటే.. ఆ రంగులు పూసిన, పూయించుకున్న ముఖాలు వెలిగిపోతోంటే.. ఎవరికివారు ఉత్సాహంతో ఉరకలు వేస్తూ రంగులవానలో చిందులు వేస్తోంటే.. వేరే చెప్పాలా.. ఆ సంబరం పేరే హోలీ. ఇది రంగుల పండుగ. రంగోం కా త్యోహార్. colors తో చేసుకునే colorful festival. రంగులు జల్లుతూ, జల్లించుకుంటూ జోరుగా, హుషారుగా గడిపే రోజు. చీకులూ చింతలూ, చిరాకులూ పరాకులూ మరచి, పరవశించే రోజు. రంగుల్లో మునిగితేలుతూ పూలతోటలా, ఇంద్రధనుసులా కళకళలాడే కమనీయమైన రంగుల పండుగ.

హోలీని సంస్కృతంలో వసంతోత్సవం అంటారు. ఇది అతి ప్రాచీన పండుగ. ఈ ఉత్సవం గురించిన కధనాలు పురాణాల్లో ఉన్నాయి.

అసలు హోలీ పండుగ జరుపుకునే సంప్రదాయం ఎలా వచ్చిందో తెలుసా? హిరణ్యకశిపునికి తన కొడుకు ప్రహ్లాదుడు విష్ణు నామస్మరణ చేయడం గిట్టలేదు. శత్రు జపం చేయడం ఏమిటని ఎంత వారించినా వినకపోయేసరికి కోపం పట్టలేక కొడుకును ఏనుగులతో తొక్కించమన్నాడు. అవి తప్పుకుని వెళ్ళిపోతాయి. కొండపైనుండి విసిరేయగా విష్ణుమూర్తి కాపాడాడు. లాభంలేదని హిరణ్యకశిపుడు తన చెల్లెలు హోలిక చేతిలో కొడుకును ఉంచి దహించమన్నాడు. ఆ మంటలు విష్ణు భక్తుడైన ప్రహ్లాదుని ఏమీ చేయలేదు కానీ హోలిక మాత్రం దహనమైపోయింది. ఈ హోలికా దహనానికి గుర్తుగా దక్షిణ భారతంలో కామదహనం చేస్తారు. మరుసటి రోజు పరస్పరం రంగులు జల్లుకుని ఆనందించారు. ఆ సంబరమే హోలీ పర్వదినంగా జరుపుకోవడం ఆచారమైంది..

హోలీకి ముందురోజు రాత్రి హోలికా దహనంతో పండుగ హడావిడి మొదలవుతుంది. అందుకోసం పుల్లలు, కట్టెలు పోగుచేస్తారు. నాలుగురోడ్ల కూడళ్ళలో హోలిక బొమ్మను తగలబెడతారు. ఈ దహనాన్ని రాక్షసత్వాన్ని అంతం చేయడానికి సంకేతంగా భావిస్తారు. హోలీ రోజు చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ రంగులతో ఆటలాడతారు. ఈ కోలాహలం మధుర, బృందావనాలను తలపిస్తుంది.

ఫాల్గుణ మాస పౌర్ణమిరోజును హోలీగా జరుపుకుంటాం. ఈ పండుగను మొట్టమొదట గుర్తించింది భారత్, నేపాల్, శ్రీలంకలు. హిందువులు, సిక్కులకు ఇది ముఖ్యమైన పర్వదినం. భారత్ లో బెంగాల్, ఒరిస్సా, బీహార్, గోవా, గుజరాత్, మహారాష్ట్ర, మణిపూర్, కేరళ, ఆంధ్రప్రదేశ్, కాశ్మీర్, పంజాబ్ - ఇలా అన్ని రాష్ట్రాల్లో కులమతాలతో సంబంధం లేకుండా అందరూ ఆనందంగా జరుపుకుంటారు. అలాగే భారత ఆచారాలు, అలవాట్లు ప్రతిఫలించే మలేషియా, గుయానా, సౌత్ ఆఫ్రికా, యునైటెడ్ కింగ్డమ్, మారిషస్, ఫిజి తదితర దేశాల్లో కూడా ఈ కలర్ఫుల్ పండుగ జరుపుతారు.

పశ్చిమ బెంగాల్, ఒరిస్సా రాష్ట్రాల్లో హోలీని డోల్ యాత్ర లేదా డోల్ జాత్ర అని, బసంతోత్సవ్ అని అంటారు. శ్రీకృష్ణుని పేరుమీద జరుపుకునే హోలీ మధుర, బృందావనం, నందగాం, బర్సాన ప్రాంతాల్లో మరింత శోభాయమానంగా 16 రోజులపాటు జరుగుతుంది. హోలీ రోజుల్లో ఈ ప్రదేశాలు యమా కలర్ఫుల్ గా ఉంటాయి. టూరిస్టులతో కిటకిటలాడుతాయి. అయితే హోలీకి ఉపయోగించే రంగుల్లో ఉండే రసాయనాలు కళ్ళకు సోకితే ప్రమాదం. ఒక్కోసారి చూపు పోయే అవకాశం కూడా ఉంది. కొన్ని వర్ణాలు చర్మానికి సైతం హాని చేస్తాయి. కనుక వీటితో అప్రమత్తంగా ఉండాలి. ఆ సంగతి విస్మరిస్తే కళకళలాడాల్సిన పండుగ కళావిహీనంగా మారుతుంది. ఆనందం స్థానంలో ఆందోళన చోటు చేసుకుంటుంది.

రోజూవారీ దిగుళ్ళకు దూరంగా ఒకరిమీద ఒకరు రంగులు (colors) చిలకరించుకుంటూ, రంగు నీటిని (color water) పోసుకుంటూ చేసుకుంటూ ఆనందం పొందుతారు, వింత అనుభూతిని సొంతం చేసుకుంటారు. ఇది నిజంగా చూడచక్కని రంగుల పండుగ(Colorful Day). సంతోషాలు వెల్లివిరిసే వర్ణోత్సవం (Cheerful Day).

మీ అందరికీ హోలీ శుభాకాంక్షలు!

 

Holi wishes and celebrations, hindu festival holi, colorful festival holi, harmful colors holi festival, holi game with colors, colours festival holi celebration, happy holi, holi date 08.03.2012


More Holi Purnima