తొలి ఏకాదశి రోజున ఏం చేయాలి...?

 

 

ఆషాఢమాసంలో వచ్చే మొదటి ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి నుంచే పండుగల్నీ మొదలవుతాయి కాబట్టి దీన్ని తొలి పండుగ అని కూడా పిలుస్తారు. మరి ఈ తొలి ఏకాదశి రోజు ఏం చేయాలో, ఈసారి వస్తున్న తొలి ఏకాదశి ఎందుకంత ప్రత్యేకమో తెలుసుకుందాం...

ఏడాదిలో వచ్చే 24 ఏకాదశులలోనూ ఈ రోజు మొదటిదిగా చెప్పుకోవచ్చు. అందుకే ఈ రోజు ఉపవాసం ఉంటే ఆ విష్ణుమూర్తి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. ఇందుకోసం దశమి రాత్రి నుంచే ఎలాంటి ఆహారమూ తీసుకోకుండా ఉండాలి. ఇక ఏకాదశి రోజు ఉదయాన్నే నిద్రలేచి పూజగదిలో ఉన్న విష్ణుమూర్తిని తులసీదళాలతో పూజించాలి. ఆ రోజు పాలు, పళ్లులాంటి వండని పదార్థాలు మాత్రమే తీసుకోవాలి.

ఏకాదశి రోజు రాత్రి అంతా మెలకువగా ఉండాలి. ఆ రాత్రివేళ వీలైతే విష్ణుమూర్తికి సంబంధించిన భాగవతాన్ని చదువుకోవడం కానీ, విష్ణుసహస్రనామం జపించడం కానీ చేయాలి. మర్నాడు... అంటే ద్వాదశి రోజు తెల్లవారుజామునే దగ్గరలో ఉన్న ఆలయానికి వెళ్లి ఉపవాస దీక్షను విరమించాలి. దీనినే తొలి ఏకాదశి వ్రతం అంటారు. ఈ వ్రతం చేసినందుకే కుచేలుడు అంతటివాడికి కూడా దరిద్రం వదిలిపోయి సకల సంపదలూ కలిగాయని శాస్త్రాలు చెబుతున్నాయి.

తొలి ఏకాదశిని శయన ఏకాదశిగా కూడా పిలుచుకుంటారు. ఈ రోజు నుంచి నాలుగు నెలలపాటు విష్ణుమూర్తి పాలకడలి మీద నిద్రిస్తాడట. అందుకనే ఆ పేరు. అందుకే ఈ రోజు నుంచి పగలు కంటే రాత్రిళ్లు ఎక్కువసేపు ఉంటాయి. చలి కూడా పెరుగుతుంది. వాతావరణంలో ఒక్కసారిగా వచ్చే ఈ మార్పు వల్ల రకరకాల వ్యాధులు మొదలవుతాయి. అందుకే ఈ రోజు పేలాల పిండిని తప్పకుండా తినమని చెబుతారు. పేలాల పిండి వల్ల జలుబులాంటి సమస్యలు దూరమైపోతాయి. పేలాలపిండిని బెల్లం, యాలుకలతో కలిపి తినడం వల్ల ఒంట్లో వేడి పెరుగుతుంది.

ఆవులను పూజించేందుకు కూడా తొలి ఏకాదశి చాలా మంచిది. గోవు అంటే సాక్షాత్తు కామధేనువు. అందుకే ఈ రోజు కనుక గోపూజ చేస్తే మన మనసులో ఉన్న కోరికలన్నీ తీరిపోతాయని నమ్మకం.

ఇంతకీ ఈసారి వచ్చే తొలిఏకాదశి ప్రత్యేకత చెప్పనేలేదు కదూ! ఈసారి తొలి ఏకాదశి జులై 23 నాడు అంటే సోమవారం రోజు వస్తోంది. సోమవారం శివుడుకి చాలా ఇష్టమైన రోజు. అందుకే చాలామంది శివుడి అనుగ్రహం కోసం సోమవారం ఉపవాసం ఉంటారు. అందుకే ఈ తొలి ఏకాదశికి కనుక ఉపవాసం ఉంటే అటు విష్ణుమూర్తీ, ఇటు శివుడూ... ఇద్దరి అనుగ్రహం లభిస్తుంది. ఎలాంటి కష్టమైనా తీరిపోతుంది.

- నిర్జర.

 


More Others