అమర్నాథ్ చూసొద్దాం రండి!

 

 

హిమాలయాలు అన్న పేరు వింటేనే చాలు... భగవంతుని స్మరించుకున్నంత పారవశ్యానికి లోనవుతారు. మన దృష్టిలో హిమాలయాలు పర్వతాలు మాత్రమే కాదు, శివకేశవుల స్వరూపాలు. అందుకే అమర్నాథ్ పేరుతో మంచులింగాన్ని పూజించినా, మానససరోవరం పేరుతో సరస్సుని కొలిచినా... జీవితంలో ఒక్కసారైనా అక్కడి పుణ్యక్షేత్రాలను దర్శించాలని తపిస్తారు. మరి వాటిలో ప్రత్యేక స్థానం ఉన్న అమర్నాథ్ యాత్ర గురించి ఓసారి తల్చుకుందామా...

 

అమర్నాథ్ గుహ వెనక కథ!: అమర్నాథ్ కేవలం ఒక గుహ మాత్రమే కాదు. దాని వెనుక ఒక విశిష్ట గాథ ఉంది! ఒకానొక సందర్భంలో శివుని సతి పార్వతి, తనకు అమరత్వం గురించిన రహస్యాన్ని చెప్పమని కోరిందట. ఆ రహస్యాన్ని ఏ జీవి విన్నా కూడా, ఆ ప్రాణికి అమరత్వం సిద్ధిస్తుంది. అందుకని ఎవ్వరూ లేని ప్రాంతంతో పార్వతికి అమరత్వ రహస్యాన్ని చెప్పాలనుకున్నాడట పరమేశ్వరుడు. అందుకని ఏ ప్రాణీ చేరుకోలేని అమర్నాథ్ గుహను ఎంచుకొన్నాడట. అయితే శివుడు పార్వతికి అమరత్వం గురించి చెప్పే సమయంలో. ఒక పావురాల జంట ఆ రహస్యాన్ని విన్నదట. అప్పటినుంచీ ఆ పావురాల జంట మరణమే లేకుండా అక్కడక్కడే తిరుగుతున్నాయని అంటారు. అమర్నాథ్ యాత్రికులు కొందరు తాము ఆ పావురాలను చూశామని కూడా చెబుతుంటారు.

 

 

ఒకో ఊరి వెనుక ఒకో కథ!: ఈ లోకం మీద నుంచి పార్వతీపరమేశ్వరులు అంతర్థానం అయ్యింది కూడా ఇక్కడే అని చెబుతారు. శ్రీనగర్కు ఓ వంద కిలోమీటర్ల దూరంలో పెహల్గావ్ అనే గ్రామం ఉంది. దీనిని ‘బైల్ గావ్’ అని కూడా పిలుస్తారు. పరమేశ్వరుడు ఇక్కడ తన నందిని విడిచిపెట్టాడు కాబట్టి ఆ పేరు వచ్చిందట. ఇక చందన్వారీలో తన సిగలోని చంద్రుడినీ, శేష్నాగ్ దగ్గర తన మెడలో పాములనీ, మహాగణేశ పర్వతం వద్ద కుమారుడు గణేశుడినీ, పంచతరణి దగ్గర తనలోని పంచభూతాలనీ విడిచారని చెబుతారు. ఆయా ప్రాంతాల పేర్లు కూడా శివుడు విడిచినవాటిని తలపించేలా ఉండటం విశేషం.

 

 

రెండు మార్గాలు: అమర్నాథ్కు చేరుకునేందుకు రెండు మార్గాలు ఉన్నాయి. మొదటి దారిలో పెహల్గావ్ నుంచి పంచతరణికి వెళ్లి... అక్కడి నుంచి ఆరుకిలోమీటర్ల దూరంలో ఉండే గుహకి చేరుకుంటారు. కాస్త దూరమైనా, శివుడు నడిచివెళ్లిన దారి కావడంతో చాలామంది యాత్రికులు ఈ మార్గాన్నే ఎంచుకొంటారు. ఇక శ్రీనగర్ నుంచి బాల్తాల్కు చేరుకుని అక్కడి నుంచి కేవలం 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుహకు చేరుకోవడం మరో మార్గం. అయితే బాల్తాల్ నుంచి గుహకు చేరుకునే మార్గం చాలా కష్టంగా ఉంటుంది. సామాన్లంతా మనుషులే మోసుకువెళ్లాలి.

 

 

హెలికాప్టర్లూ ఉంటాయి: యాత్ర కోసం ఇన్ని కష్టాలు పడలేం అనుకునేవారికి జమ్ము, శ్రీనగర్, పెహల్గావ్ల నుంచి పంచతరణి వరకు హెలికాప్టర్లు అందుబాటులో ఉంటాయి. రక్తం గడ్డకట్టించే చలిలో, కాలు జారితే మరణం చేరువయ్యే దారిలో... ఎంతో శ్రమకి ఓర్చి అమర్నాథ్ గుహకు చేరుకునేవారికి తగిన ఫలితం దొరుకుతుంది. దాదాపు 130 అడుగులుండే ఈ గుహలో ప్రవేశించాక కనిపించే శివలింగం జలరూపంలో ఉన్న శివుని దర్శించిన అనుభూతినిస్తుంది.

గొర్రెల కాపరి కథ: ఏడాది పొడవునా ఈ గుహలోకి ప్రవేశించడానికి సాధ్యం కాదు. కేవలం ఎండాకాలం వచ్చేసరికే ఇక్కడి మంచు లింగం ఏర్పడుతుంది. అమర్నాథ్ గుహ మీదుగా జారే నీటిబొట్లు ఆ సమయంలో ఓ లింగాకారంలోకి మారతాయి. ఇలా పది కాదు వందకాదు వేల సంవత్సరాల నుంచీ జరుగుతోందని చెబుతారు. అందుకు సాక్ష్యంగా పురాణాలలో సైతం ఈ గుహ ప్రస్తావన కనిపిస్తుంది. అయితే ఈ మార్గం దుర్గమంగా మారిపోవడంతోనో, శత్రురాజులకు భయపడో, 12వ శతాబ్దం తర్వాత భక్తులు గుహ వైపుగా వెళ్లడం మానుకున్నారు. క్రమేపీ ఆ గుహ ఎక్కడుందో కూడా మర్చిపోయారు. 15వ శతాబ్దంలో తిరిగి ‘బూటా మాలిక్’ అనే గొర్రెల కాపరి ఈ లింగాన్ని కనుక్కోవడంతో తిరిగి ఈ క్షేత్రానికి ప్రచారం లభించింది.

 

ఇలా వెళ్లాలి.... అమర్నాథ్ యాత్ర ఏటా ఆషాఢమాసంలో మొదలై సాధారణంగా రాఖీపౌర్ణమి రోజున ముగుస్తుంది. అలాగే ఈసారి కూడా జూన్ 28న మొదలై ఆగస్టు 7న ముగుస్తోంది. ఈ యాత్ర చేయాలనుకునేవారు ముందుగా అమర్నాథ్ యాత్రను పర్యవేక్షించే Shri Amarnathji Shrine Board వెబ్సైట్ ద్వారా రిజిస్టరు చేసుకోవాలి. బోర్డు సూచించిన బ్యాంకులో తగిన దరఖాస్తు చేసుకుని, వాటికి మీ ఆరోగ్యం భేషుగ్గా ఉందనే వైద్యపరీక్షల నివేదికను కూడా జోడించాలి. ఆ పత్రాలన్నింటినీ అమర్నాథ్ యాత్ర అధికారికి పంపాలి. సదరు అధికారి అంగీకరించిన తర్వాతే, ఆయన సూచించిన రోజునే అమర్నాథ్కు ప్రవేశం లభిస్తుంది.

ఒకప్పుడు అమర్నాథ్ యాత్ర కోసం ఏటా లక్షలమంది యాత్రకులు ప్రయాణమయ్యేవారు. కానీ కశ్మీర్లో శాంతిభద్రతల సమస్యలు పెరిగినప్పుడల్లా, యాత్రికల సంఖ్య కాస్త తగ్గుముఖం పడుతూ ఉంటుంది. అయితే ప్రయాణికులకు ఎలాంటి ఆపదా రాకుండా ఉండటానికి మన భద్రతా బలగాలు వారిని దారిపొడుగూతా కంటికిరెప్పలా కాచుకుని ఉంటాయి. ఇక పెహల్గావ్ నుంచి అనేక స్వచ్ఛంద సంస్థలు కూడా యాత్రికుల ఆకలి తీర్చేందుకు సిద్ధంగా ఉంటాయి. పైగా సాక్షాత్తూ ఆ అమరలింగేశ్వరుడు మనల్ని కాచుకునేందుకు సిద్ధంగా ఉన్నాడయ్యే! అందుకే భక్తులు ఆ అమర్నాథుని జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాలని ఉవ్వళ్లూరుతూ ఉంటారు.


- నిర్జర.

 

 


More Others