కంబోడియా రామాయణం

 


భారతీయుల దృష్టిలో రాముడు ఈ భూమి మీద నడయాడిన ఒక అవతారం. ఆ అవతారానికి సాక్షిగా నిలిచి, ఆయన జీవితాన్ని కావ్యీకరించిన రుషి వాల్మీకి. వాల్మీకి రాసిన రామాయణమే కాకుండా దాని స్ఫూర్తిగా అనేక రామాయణాలు ప్రచారంలో ఉన్నాయి. అంతదాకా ఎందుకు! వాల్మీకి పేరుతోనే ఆనంద రామాయణం, అద్భుత రామాయణం వంటి కావ్యాలు లభ్యమవుతున్నాయి. ఇక తమిళం (కంబరామాయణం), తెలుగు (రంగనాథ రామాయణం) వంటి స్థానిక భాషలలో రాసిన రామాయణాల సంగతి చెప్పనే అక్కర్లేదు. వీటన్నింటి కారణంగా వాల్మీకి రచన ఉపఖండంలోని ప్రతి నోటా వినిపించసాగేది. వేల ఏళ్ల క్రితం మన దేశంలో ఎవరిని కదిపినా కూడా ఆసాంతం రామగాథను చెప్పగలిగేవారు.

 

విదేశాలలోనూ

వేయి సంవత్సరాల క్రితమే మన దేశంలోని నౌకాయానం గణనీయంగా అభివృద్ధి చెందింది. మన దేశం నుంచి వజ్రాలు మొదలుకొని మసాలా దినుసుల వరకూ విదేశాలకు ఎగుమతి చేసేవారు. ముఖ్యంగా దక్షిణాసియాకు ఈ ఎగుమతులు శాశ్వతమైన వ్యాపార సంబంధాలను ఏర్పరుచుకునే స్థాయిలో ఉండేవి. అలా భారత దేశం నుంచి దక్షిణాసియా దేశాలకు చేరుకున్న వర్తకులుతో పాటుగా మన దేశపు ఆచార వ్యవహారాలను, ఐతిహాసాలను కూడా ఇతర దేశాలను ప్రభావితం చేశాయి. అలా విదేశాలలో సైతం విస్తృతం ప్రచారం పొందిన గాథలలో రామాయణానిదే అగ్రతాంబూలం.

 

 

ఒకోచోట ఒకోలా

విదేశాలలోని వినిపించే ప్రతి రామాయణంలోనూ రాముడే నాయకుడు. రావణుడే ప్రతినాయకుడు. సీత నాయిక. రావణుడు, సీతను ఎత్తుకు వెళ్లడం, అతడిని సంహరించి సీతను దక్కించుకోవడమే ఇతివృత్తంగా కనిపిస్తుంది. కాకపోతే స్థానిక ఆచారాలకు అనుగుణంగా మార్పులు ఉండేవి. మరికొన్ని ప్రదేశాలలో బౌద్ధమత ప్రభావం వల్ల రామాయణంలో బౌద్ధ ఛాయలు కనిపించేవి. ఉదాహరణకు లావో దేశంలో రామాయణాన్ని ‘ప్రాలక్‌ ప్రారామ్‌’ పేరుతో వ్యవహరిస్తారు. అంటే రామలక్ష్మణుల కథ అని స్థానిక అర్థం. ఈ కథ ప్రకారం రాముడు, బుద్ధుని పూర్వ జన్మలలో ఒకరు. రామాయణం వారికి బుద్ధుని జాతక కథలలో ఒకటి. ఇక జావాకి చెందిన ‘కకావిన్‌ రామాయణంలో’ని ద్వితీయార్థంలో స్థానిక దేవతలు కూడా పాత్రలుగా కనిపిస్తారు. 

 

 

కంబోడియా

రామాయణ ప్రభావం కంబోడియా దేశం మీద ఎక్కువగా కనిపిస్తుంది. అక్కడి ప్రాచీన దేవాలయమైన అంగ్‌కోర్‌వట్ గోడల మీద రామాయణ దృశ్యాలు కనిపిస్తాయి. దాదాపు వెయ్యేళ్ల క్రితమే ఈ దేశంలో రామాయణం మారుమోగిపోయిందని పరిశోధకుల అంచనా. ప్రాచీన దేవాలయాల మొదలుకొని రాజప్రసాదాల వరకు ఎక్కడ చూసినా రామాయణ ఘట్టాలే కనిపించేవి. ‘రియామ్‌కే’ పేరుతో ప్రజల నోళ్లలో ఉన్న ఆ రామాయణాన్ని కొన్ని వందల సంవత్సరాల క్రితం ఎవరో అజ్ఞాత రచయితలు అక్షరబద్ధం చేశారు. ఈ కంబోడియా రామాయణం రాముని వనవాసంతో మొదలవుతుంది, ఆ తరువాత రాముని ఆశించి సూర్పణఖ భంగపడటం, సీతాపహరణం, హనుమంతుని పరిచయం, రావణవధ, సీత అగ్నిప్రవేశం వంటి ఘట్టాలన్నీ యథాతథంగా కనిపిస్తాయి. అయితే సముద్రం మీద వంతెన కట్టే సమయంలో హనుమంతుడు ‘సువన్నమచ్చ’ అనే సాగరకన్యతో ప్రేమలో పడే సంఘటన ఒకటే కాస్త భిన్నంగా కనిపిస్తుంది. కంబోడియా వాసుల దృష్టిలో రాముడు, విష్ణుమూర్తి అవతారం అయినప్పటికీ... ఒక ఉత్తమమైన మానవునికి ప్రతీక! అందుకే రాముని కీర్తిస్తూ, ఆయన గాథలను వర్ణిస్తూ రామాయణాన్ని వివిధ రీతులలో ప్రదర్శిస్తూ ఉంటారు. రామాయణం ఆధారంగా ‘లాఖోన్‌’ పేరుతో వారు సాగించే నృత్యం ప్రతి పండుగలోనూ తప్పనిసరిగా చోటుచేసుకుంటుంది.

 

 

చెడు మీద మంచి

రామాయణం జరిగిందా లేదా? జరిగితే రాముడు అవతార పురుషుడా కాదా? అన్న ప్రశ్నలు అప్రస్తుతం. నమ్మినవారికి నమ్మనంత! కానీ ఆనాటి ధర్మాన్ని పాటించిన ఆదర్శమూర్తిగా, చెడు మీద విజయాన్ని సాధించిన విజేతగా రాముడు ఇప్పటికీ ఎప్పటికీ మానవాళికి ఒక గొప్ప ఉదాహరణే! అందుకనే రామాయణం ఏ ప్రాంతంలోకి ప్రవేశించినా కూడా, అక్కడి ప్రజల మన్ననను పొందింది. రాముడు మన దేశంలోనివాడే అన్నంతగా వారు ఆయనను కొలుచుకున్నారు. అందుకు వాల్మీకి రాసిన రామాయణమే వారికి ప్రేరణనిచ్చింది. అలా అది ప్రపంచకావ్యంగా నిలిచింది.

 

 

- నిర్జర.

 


More Purana Patralu - Mythological Stories