సంక్రాంతి పండుగకు ముగింపు – ముక్కనుమ

 

 

సంక్రాంతి అంటే నాలుగురోజుల పండుగ అని అందరికీ తెలిసిందే! ఇందులో తొలి మూడు రోజులకీ ఏదో ఒక పరమార్థం ఉంది. కానీ నాలుగోరోజున ఫలానా విధులు నిర్వహించాలి అంటూ ఎక్కడా కనిపించదు. కాబట్టి ముక్కనుమ ఓ పండుగలా కాకుండా సంక్రాంతి సంబరాలకు ముగింపులా తోస్తుంది.

 

- సంక్రాంతిలో తొలిరోజైన భోగిన కీడుపండుగగానూ, రెండో రోజైన సంక్రాంతిని పెద్దల పండుగగానూ, మూడోరోజైన కనుమను పశువుల పండుగగానూ చేసుకునే జనం నాలుగో రోజున గ్రామదేవతలను తల్చుకుంటూ మాంసాహారాన్ని వండుకునే సంప్రదాయం కనిపిస్తుంది. అందుకనే ముక్కనుమను ముక్కల పండుగగా కూడా పిల్చుకోవడం రివాజు.

 

- సంక్రాంతిలో మూడోరోజైన కనుమనాడు పొలిమేర దాటకూడదన్న నియమం ఉంది. కాబట్టి ఇంటికి వచ్చిన ఆడపడుచులని సత్కరించుకుని, మనసారా బహుమతులు ఇచ్చుకుని ముక్కనుమనాడు వీడ్కోలు పలుకుతారు. కొంతమంది ముక్కనుమను కూడా పండుగగా భావించి, ముక్కనుమనాడు కూడా బయల్దేరకూడదని చెబుతుంటారు. కానీ ఈ విషయమై శాస్త్రపరంగా ఎలాంటి నియమమూ లేదు.

 

- ముక్కనుమ రోజున కొత్త వధువుల ‘సావిత్రి గౌరీవ్రతం’ అనే వ్రతాన్ని పట్టడం కూడా కనిపిస్తుంది. ఇందుకోసం మట్టి ప్రతిమలను ప్రతిష్టించుకుని, వాటికి తొమ్మిది రోజుల పాటు తొమ్మదిరకాల పిండివంటలు నివేదనం చేస్తారు. చివరికి ఆ బొమ్మలను నీటిలో నిమజ్జనం చేస్తారు. బోమ్మలతో చేసే వ్రతం కాబట్టి, దీనికి బొమ్మల నోము అని కూడా పిలుచుకోవడం కద్దు.

 

- కనుమనాడు రథం ముగ్గు వేయడం మనకి తెలిసిందే! కొందరు ముక్కనుమ రోజున కూడా రథం ముగ్గు వేస్తుంటారు. సంకురుమయ్య ఉత్తరాయణం వైపుగా మరలే ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆయనను సాగనంపేందుకు అన్నట్లుగా ఇలా రథం ముగ్గుని వేయడం ఆచారం. ఈ ముగ్గుకి ఉన్న కొసను మాత్రం ఇంటి బయటకు వెళ్లేలా దిద్దుతారు.

 

- సంక్రాంతి నాలుగో రోజున తమిళనాట కూడా ఘనంగా జరుపుకొంటారు. వారు ఈ రోజుని కరినాళ్ అని పిలచుకుంటారు. ఈ రోజు చుట్టాలను కలుసుకుంటే మంచిదని చెబుతారు. ఒకరకంగా బంధుత్వాలను కలుపుకునేందుకు, సంబంధీకుల మంచిచెడులను పరామర్శించేందుకు ఈ రోజున ప్రాముఖ్యతని ఇస్తారన్నమాట. అంతేకాదు, ఈ రోజున కుటుంబసమేతంగా వనభోజనాలకు వెళ్లే ఆనవాయితీ కూడా ఉంది.

- నిర్జర.


More Sankranti