అనుభూతులు శాశ్వతం కావు!


భగవద్గీత తొలి అధ్యాయం అంతా అర్జున విషాదంతోనే సరిపోతుంది. కురుక్షేత్రమనే సంగ్రామంలో ఎటు పోవాలో, ఏం చేయాలో పాలుపోని అర్జునుడు, శ్రీకృష్ణుని శరణుకోరే సన్నివేశం ఉంటుంది. ఒక రకంగా అర్జున విషాద యోగం భగవద్గీతకి భూమికను అందిస్తుంది. ఆ తరువాత వచ్చే రెండో అధ్యాయమే సాంఖ్య యోగం! భారతీయ దర్శనాలలో సాంఖ్య దర్శనము ఒకటి. పురుషుడు, ప్రకృతి వంటి విషయాలను సూక్ష్మంగా చర్చించే దర్శనము సాంఖ్యము. అతి క్లిష్టమైన, మేధోపరమైన జ్ఞానంగా సాంఖ్యాన్ని భావిస్తారు. అలాంటి సాంఖ్యంలోని సారాన్ని అర్జునుడికి అందిస్తున్నాడు శ్రీకృష్ణుడు. కేవలం సాంఖ్యం మాత్రమే కాదు! భారతీయ తత్వచింతనలో చాలా అంశాలను భగవద్గీత ఒక చోటకి క్రోడీకరిస్తుంది. ఉపనిషత్తుల దగ్గర్నుంచి భక్తియోగం వరకూ జ్ఞానాన్ని ఒకచోటకి చేరుస్తుంది. అందుకనే భగవద్గీతకు అంత ఆదరణ. శ్రీ కృష్ణుడు సాంఖ్య యోగాన్ని వివరించడంలోని ముఖ్య ఉద్దేశం.. దుఃఖానికి కారణాన్ని చెప్పడం, స్థితప్రజ్ఞుని లక్షణాలను వివరించడం. ఈ రెండు విషయాలూ సాంఖ్యయోగములోని 14వ శ్లోకంలో కనిపిస్తాయి.మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖదుఃఖదాః ! ఆగమాపాయినో నిత్యాః తాంస్తితిక్షస్వ భారత !

ఇంద్రియాలు తమ చుట్టూ ఉన్న విషయాలకు ప్రతిస్పందిస్తున్నప్పుడు సుఖదుఖాలు, చలి, వేడి వంటి అనుభూతులు కలుగుతున్నాయి. ఇలాంటి అనుభూతులు శాశ్వతమైనవి కావు. కాబట్టి వీటిని సహింపుము. ఇక్కడ కృష్ణుడు భౌతికమైన అనుభూతును, మానసికమైన సంవేదనలనూ ఒకే తాటికి కట్టేశాడు. ఎందుకంటే మనస్సు కూడా ఒక ఇంద్రియమే కదా! ఈ ఇంద్రియాల ద్వారానే మనం ప్రపంచాన్ని గమనిస్తుంటాం. ప్రపంచంలో స్పందన, ప్రతిస్పందన వీటి ద్వారానే జరుగుతుంది. మరి ఇంద్రియాలు వ్యక్తిగతమైనప్పుడు, అవి మనకు అందించే అనుభూతులు కూడా మన పరిపక్వత ఆధారంగానే ఉంటాయి కదా! శరీరం దృఢంగా ఉన్న ఒక మనిషి శీతోష్ణాదులకు అతీతంగా ఉండవచ్చు. మనసు దృఢంగా ఉన్నవాడు సుఖదుఖాలకు అతీతంగా సంచరించవచ్చు. ఇంద్రియ సంబంధమైన అనుభూతులన్నీ కూడా శాశ్వతం కావనీ, ఇవన్నీ వస్తూపోతూ ఉండేవని గ్రహించిననాడు... అన్ని స్థితులనూ సమంగా చూసే స్థితప్రజ్ఞత ఏర్పుడుతుంది. This too shall pass అనే నమ్మకం కలుగుతుంది. ఆ నమ్మకాన్ని కలిగి ఉండమని చెబుతున్నాడు శ్రీకృష్ణుడు. ఇటు శరీరం మీదా, అటు మనసు మీదా అదుపు సాధించమని సూచిస్తున్నాడు.

- నిర్జర.

 


More Good Word Of The Day