మేరీమాత సాక్షాత్కరించిన చోటు - వేళాంగిణి

భగవంతుడైనా ఓ అమ్మకడుపున పుట్టాల్సినవాడే అని ఓ నానుడి. అందుకనే మనం దేవుడిని ఎంతగా ఆరాధిస్తామో, ఆ దేవునికి జన్మనిచ్చిన తల్లిని కూడా అంతగా కొలుచుకుంటాము. జీసన్‌కు ఎంత ప్రాధాన్యతని ఇస్తామో, ఆయన తల్లి మేరీమాతను అంత భక్తితో చూసుకుంటాము. ఆ మేరీమాత మన దేశంలో సాక్షాత్కరించిన చోటే వేళాంగిణి.


వందల ఏళ్ల చరిత్ర
తమిళనాడులోని చెన్నైకు 300 కిలోమీటర్ల దూరంలో వేలాంగిణి అనే పట్నం ఉంది. బంగాళాఖాతపు తీరంలో ఉండే ఈ పట్నానికి వేల ఏళ్ల చరిత్ర ఉంది. అప్పట్లోనే గ్రీసు వంటి దేశాలతో వర్తకం చేసిన దాఖలాలూ ఉన్నాయి. అయితే 16వ శతాబ్దంలో ఆ చరిత్రకు మరో ఘనత తోడైంది. అదే మేరీమాత దివ్వదర్శనం. వేలాంగిణి పట్నంలో మేరీమాత మూడుసార్లు దర్శనమిచ్చారని చెబుతారు. ఆ మూడు సందర్భాలూ ఇవే...

 

- తొలిసారి మేరీమాత బాలఏసుతో ఓ పశువుల కాపరికి కనిపించిందట. పాలమ్ముకునేందుకు వెళ్తున్న ఆ కాపరిని మేరీ మాత ఆపి, తన భుజాన ఉన్న పిల్లవాడి కోసం కాసిని పాలిమ్మని అడిగిందట. ఆమె కోరినట్లుగానే పాలని అందిచాడు కాపరి. ఆ తరువాత యథాప్రకారం పాలమ్ముకునేందుకు ముందుకు సాగిపోయాడు. కానీ ఆశ్చర్యం! సగం పాలే ఉండాల్సిన తన పాత్రలో నిండుగా చిక్కటి పాలు ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు. ఆ ప్రాంతాన్ని ఇప్పటికీ ‘మేరీ కుల్లం’ పేరుతో పిలుచుకుంటారు.


- రెండోసారి మేరీమాత మజ్జిగ అమ్ముకుంటూ జీవించే ఓ వికలాంగునికి దర్శనమిచ్చి... తన భుజాన ఉన్న పిల్లవాడి కోసం కాసిన మజ్జిగ ఇమ్మని కోరిందట. ఆమె దివ్యరూపాన్ని చూసిన యువకుడు మారుమాటాడకుండా మజ్జిగను అందించాడు. ఆ తరువాత అతడిని నాగపట్టణం వెళ్లమని సూచించిదట మేరీ. అక్కడ ఓ పెద్దాయన వద్దకు వెళ్లి తనకోసం ఓ చర్చిని నిర్మించమని, తన మాటగా తెలియచేయమన్నదట. ఆ మాటలను విన్న యువకుడు హడావుడిగా లేచి నిల్చోగానే, తన అవిటితనం మాయమైపోవడాన్ని గమనించి ఆశ్చర్యపోయాడు. ఆ ఘట్టాన్ని పురస్కరించుకుని వేళాంగిణిలో మేరీమాతకు ఓ చర్చిని నిర్మించారు. అందులో ఉన్న తల్లిని ‘ఆరోగ్యమాత’గా (Our Lady of Good Health) పూజించడం మొదలుపెట్టారు.


- ఇక మూడోసారి మేరీమాత సాక్షాత్కారం మరింత చారిత్రాత్మకం. మకావ్‌ నుంచి శ్రీలంక వెళ్తున్న ఓ నౌక తుపానులో చిక్కుకుపోయింది. అందులో ఉన్న పోర్చుగీసు వర్తకులంతా తమ ప్రాణాల మీద ఆశలను వదిలేసుకున్నారు. తమని ఎలాగైనా ఆ మేరీ మాతే కాపాడాలంటూ వేడుకున్నారు. ఆశ్చర్యంగా ఆ నౌక, మేరీ మాత గుడిని నిర్మించిన వేలాంగిణి తీరానికి చేరుకుందట. దాంతో ఆ తల్లే తమను కాపాడిందన్న నమ్మకంతో ఆ వర్తకులు మేరీమాత గుడిని మరింతగా అభివృద్ధి చేశారట.


స్వయంగా మేరీమాత సాక్షాత్కరించి, స్వస్థతపరచిన ప్రదేశం కావడంతో వేలాంగిణి చర్చి అంటే భక్తులకు విపరీతమైన నమ్మకం. ఎలాంటి వ్యాధినైనా ఆ ‘ఆరోగ్యమాత’ తీరుస్తుందని విశ్వాసం. అందుకే అటు క్రైస్తవులతో పాటుగా హిందువులు కూడా వేలాంగిణి దేవిని దర్శించుకుంటారు. తలనీలాలు సమర్పించుకోవడం, చెవులు కుట్టించుకోవడం, కాలినడకన మొక్కుని చెల్లించుకోవడం వంటి హైందవ సంప్రదాయాలు కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఇక ఏటా ఆగస్టు 29 నుంచి తొమ్మిది రోజుల పాటు జరిగే ఉత్సవాలలో అయితే లక్షలాదిమంది పాల్గొంటుంటారు. వేలాంగిణిలోని ఆరోగ్యమాతని దర్శించుకోలేనివారి కోసం ప్రపంచవ్యాప్తంగా Our Lady of Good Health పేరిట వందలాది చర్చిలు కూడా వెలశాయి. పిలిస్తే పలికే దైవంగా వేలాంగిణిమాత కోట్లాది ఇళ్లలో పూజలందుకుంటోంది.

 

- నిర్జర.


More Temples