విమానం బొమ్మలే ఆ దేవుడికి కానుకలు!

 


మనసుకి ఏ కష్టం తోచినా, జీవితంలో ఏ అడ్డంకి ఎదురైనా ఆ దేవుని ముందర మన బాధని చెప్పుకొంటాము. మన నమ్మకమో, దేవుని మహిమో... ఒకోసారి మన కోరిక తీరుతుంటుంది కూడా! కొన్నిసార్లు మాత్రం ఫలానా సమస్య వస్తే ఫలానా ఆలయంలో తప్పక సమాధానం లభిస్తుంది అన్న నమ్మకాలు కూడా వినిపిస్తుంటాయి. అలాంటి ఓ విభిన్నమైన పుణ్యక్షేత్రం పంజాబులోని జలంధర్‌లో ఉంది.

 
పంజాబులోని జలంధర్ పట్నానికి ఓ 12 కిలోమీటర్ల దూరంలో తల్హాన్‌ అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో 60 సంవత్సరాలకు పైబడిన ఒక గురుద్వారా ఉంది. దాని పేరే ‘బాబా షహీద్‌ నిహాల్‌ సింగ్‌’ గురుద్వారా! ఈ గురుద్వారాలో నిహాల్‌ సింగ్‌ అనే మహాత్ముని సమాధి ఉంది. ఆ నిహాల్ సింగ్‌ వెనుక ఓ వింత కథ కూడా ప్రచారంలో ఉంది.

 

 


ఒకప్పుడు తహ్లాన్ సమీపంలో నివసించిన నిహాల్‌ సింగ్‌ మహా దయాముడట. బావిలోతుల్లో ఉన్న నీటిని చేదుకునేందుకు గిలకలు చేయడం. ఆ గిలకలని బావులకి అమర్చడం ఇదే ఆయన పనిగా ఉండేది. నిహాల్ సింగ్‌ ఏ బావిలో అయితే రాట్నం అమరుస్తారో... ఆ బావి ఎప్పుడూ ఎండిపోదు అని నమ్మేవారు. అంతేకాదు! బావిలోని నీరు కూడా తియ్యగా మారిపోయేదట!

 
ఒకసారి నిహాల్‌ సింగ్ ఏదో బావిలో గిలకను అమరుస్తుండగా ప్రమాదవశాత్తూ చనిపోయారు. ఆయనని ప్రస్తుతం ఉన్నచోట సమాధి చేశారు. ఆ తర్వాత కాలంలో నిహాల్ సింగ్‌ అనుచరుడు హర్నామ్‌ సింగ్ చనిపోయాక... ఆయన సమాధిని కూడా ఆ పక్కనే నిర్మించారు. ఏటా నిహాల్ సింగ్‌ వర్ధంతి సందర్భంగా గొప్ప జాతర జరుగుతుంది. ఆటల పోటీలతోనూ, యుద్ధ విద్యల ప్రదర్శనతోనూ ఆ సమయంలో తహ్లాన్‌ గ్రామమంతా కోలాహలంగా మారిపోతుంది.
 

ఇంతకీ ఈ గురుద్వారా గురించిన వైవిధ్యం గురించి చెప్పనే లేదు! ఎలా మొదలైందో కానీ... ఇక్కడికి వచ్చే భక్తులలో ఓ నమ్మకం మొదలైంది. ఈ గురుద్వారాలో కనుక ఒక విమానం బొమ్మని ముడుపుగా సమర్పిస్తే... విదేశాలకు సునాయాసంగా వెళ్లవచ్చన్నదే ఆ నమ్మకం. ఏ దేశానికైనా వెళ్లాలనుకుని వెళ్లలేకపోతున్నా, వీసాకి సంబంధించిన సమస్యలు తలెత్తుతున్నా ఈ గురుద్వారాలో సమాధి ముందర విమానం బొమ్మని ఉంచితే సరి! విదేశీయానానికి సంబంధించిన ఎటువంటి సమస్యలైనా ఇట్టే పరిష్కారం అయిపోతాయట.

 
ప్రతి ఆదివారం ఈ గురుద్వారాలో కనీసం వందమందన్నా విమానం బొమ్మలు తీసుకువస్తారని ఓ అంచనా. అలా తీసుకువచ్చినవారు ఎప్పుడూ అసంతృప్తికి లోనుకాలేదట. అందుకు నిదర్శనంగా తహ్లాన్ చుట్టుపక్కల ప్రతి కుటుంబంలోనూ ఎవరో ఒకరు విదేశాలలో ఉండటాన్ని గమనించవచ్చు. అందుకే ఈ గురుద్వారాకు ‘హవాయి జహాజ్‌ గురుద్వారా’ అన్న పేరు కూడా స్థిరపడిపోయింది. తెలుగు రాష్ట్రాల్లో వీసా సమస్య వస్తే చిలుకూరుకి ఎలా వెళ్తారో... పంజాబ్‌ చుట్టుపక్కలవారు విదేశయాన సమస్యలని దాటేందుకు ఈ గురుద్వారాను చేరుకుంటారు.


 
- నిర్జర.


More Purana Patralu - Mythological Stories