ఆత్మపరిశీలన ఎందుకు!


ఒక యోగి ఆత్మకథ! ఈ పేరు వినగానే దాని రచయిత పరమహంస యోగానంద కూడా స్ఫురిస్తారు. స్వామి వివేకానంద తరువాత, పాశ్చాత్య దేశాలలో భారతీయ సంస్కృతికి మరింత గౌరవాన్ని ఇనుమడింపచేసిన వ్యక్తి యోగానంద. చిన్నప్పటి నుంచి అలౌకికమైన సంపద కోసం, అంతులేని ప్రశాంతత కోసం తపించినవారు. తన గురువు స్వామి యుక్తేశ్వర్‌ను కలుసుకున్నాక కానీ ఆయన వెతుకులాట ఓ కొలిక్కి రాలేదు. ఈ మధ్యలో ఎందరో సాధువులు, మర్మయోగులు ఆయనకు తారసిల్లారు. అలాంటి ఒక సందర్భంలో కోల్‌కతాలోని కాళీఘాట్‌లో ఆయనను ఓ సాధువు కలిశారు. ఆ సమయంలో యోగానందతో సాధువు అన్న కొన్ని మాటలు చాలా విలువైనవిగా అనిపిస్తాయి. అవేమిటంటే...

‘నేను చాలాకాలం చిత్తశుద్ధిగా అంతఃపరిశీలనను అభ్యసించాను; జ్ఞానార్జనకు అత్యంత బాధాకరమైన మార్గమిది. ఆత్మ పరీక్ష చేసుకోవడం, తన ఆలోచనలను నిర్విరామంగా పరిశీలన చేసుకోవడం కఠోరమైన విదారక అనుభవం. అత్యంత ప్రబలమైన అహంకారాన్ని సైతం అది నుగ్గు చేస్తుంది...’

‘మనిషి బడాయిల్లోంచి బయటపడేవరకు శాశ్వత సత్యాన్ని అర్థం చేసుకోలేడు. అనేక శతాబ్దాలుగా పంకిలమైన ఉన్న మానవ మనస్సు లెక్కలేనన్ని ప్రపంచమాయలతో కూడిన దుర్భర జీవితాన్ని సృష్టిస్తోంది. మనిషి మొదట, తనలోని శత్రువులతో జరిపే పెనుగులాట ముందు, యుద్ధభూమిలో జరిగే పోరాటాలు తీసికట్టే అనిపిస్తాయి!’

‘సంకుచితమైన తన కష్టంలోనే మునిగిపోయి, ఇతరుల జీవితాల్లోని దుఃఖాలకు స్పందించే శక్తిని కోల్పోయినవాడు లోతులేని మనిషి. శస్త్రంతో మాదిరిగా సునిశితంగా ఆత్మపరిశీలనను అభ్యసించినవాడు, మొత్తం మానవాళి పట్ల జాలి పెరుగుతూ ఉండటం గమనిస్తాడు. చెవులు ఊదరగొడుతూ, అధికార పూర్వకంగా అహంకారం వెల్లడించే కోరికల నుంచి అతనికి విముక్తి కలుగుతుంది,’ ఈ మాటలు చెబుతూ తరతరాల ఆధ్మాత్మిక వారసత్వాన్ని పుణికిపుచ్చుకోమని యోగానందను దీవిస్తూ ఆ సాధువు తన దారిన సాగిపోయాడు. కానీ ఆయన చెప్పిన మాటలు మాత్రం యోగానంద మీద తీవ్ర ప్రభావం చూపాయి. తరువాతి కాలంలో మార్గదర్శకంగా నిలిచాయి.

- నిర్జర.


More Good Word Of The Day