వీరే అష్టదిక్పాలకులు

 

 

హిందూధర్మంలో జ్ఞానానికి ఎంత ప్రాముఖ్యత ఉందో, భక్తికీ అంతే ప్రాముఖ్యత ఉంది. ఆ భక్తి తనకు నీడనిచ్చే చెట్టు మీద కావచ్చు, తన దాహాన్ని తీర్చిన నీటి మీద కావచ్చు, తనకు ప్రతిరూపమని భావించే విగ్రహం మీద కావచ్చు.... ఆఖరికి తన చుట్టూ ఉండే దిక్కుల మీదా కావచ్చు. ఏ దిక్కూ లేనివాడికి దేవుడే దిక్కంటారు కదా! అందుకేనేమో అన్ని దిక్కులలోనూ ఆ దైవశక్తికి ప్రతిరూపాలైన పాలకులను నియమించుకున్నారు మన పెద్దలు.

తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం, ఈశాన్యం... ఇవే మన అష్టదిక్కులు. కొన్ని సందర్భాలలో వీటికి ఊర్ధ్వ, అధో దిక్కులను కలిపి దశదిక్కులుగా భావించేవారూ లేకపోలేదు. అష్టదిక్పాలకులకు మధ్యలో మరో దిక్కును ఉంచి నవదిక్పాలకులను పూజించిన సందర్భాలూ ఉన్నాయి. హిందువుల మత విశ్వాసంలో ఈ అష్టదిక్పాలకులకు ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. మన వాస్తు శాస్త్రమంతా ఈ అష్టదిక్కుల మీదే ఆధారపడి ఉంది. ఆయా దిక్కులకు అధిపతులైన దేవతల లక్షణాలకు అనుగుణంగా వాస్తులోని చాలా సూత్రాలు రూపొందింపబడి ఉన్నాయి. మన పురాతన ఆలయాలలోని పైకప్పుల మీద సైతం ఈ అష్టదిక్పాలకుల ప్రతిమలు ఉండటాన్ని గమనించవచ్చు. సర్వవ్యాపి అయిన ఆ భగవంతునికి తాము ప్రతినిధులం అన్న సూచనను బహుశా వీరు అందిస్తుంటారేమో! ఇలా ఎనిమిది దిక్కులకూ కూడా దేవతలకు పాలకులుగా భావించడం హిందూ ధర్మంలోనే కనిపిస్తుంది. వీరు వివరాలు ఇవిగో...

 

దిక్కు పాలకుడు వాహనం ఆయుధం
తూర్పు ఇంద్రుడు ఐరావతం వజ్రాయుధం
పడమర వరుణుడు మొసలి పాశము
ఉత్తరం కుబేరుడు నరుడు గద
దక్షిణం యముడు మహిషము దండము
ఆగ్నేయం అగ్ని మేషము శక్తి
నైరుతి నిరుతి గుర్రము ఖడ్గము
వాయువ్యం వాయువు లేడి ధ్వజము
ఈశాన్యం ఈశ్వరుడు త్రిశూలం వృషభము

ఈ అష్టదిక్పాలకులకు చెందిన మంత్రాలను పూజించడం వలనా, వారికి సంబంధించిన యంత్రాలను ఆరాధించడం వల్ల సకల శుభాలూ కలుగుతాయన్నది భక్తుల నమ్మకం. వీరినే కాకుండా కొందరు ఊర్ధ్వ దిక్కుకి బ్రహ్మనూ, అధో దిక్కుకు విష్ణువునూ పాలకులుగా భావిస్తుంటారు.

- నిర్జర.


More Vyasalu