చల్లంగ చూడు మాంకాళీ

 

ఇవాళ జంట నగరాలలో బోనాలు సమర్పించే ఆలయాల గురించి చెప్తానన్నానుకదా. బోనాల సమర్పణకి కూడా కొన్ని నియమాలున్నాయి. ఈ బోనాలు ముందుగా గోల్కొండ కోటలోని జగదంబా మహాకాళి ఆలయంలోని అమ్మవారికి సమర్పిస్తారు. తర్వాతే మిగతా ఆలయాలలో. అందుకనే ముందుగా ఆ ఆలయం గురించి తెలుసుకుందాము.  

జగదంబా మహాకాళి ఆలయం, గోల్కొండ

ఈ ఆలయం 900 సంవత్సరాల క్రితం నుంచీ వున్నది. అంటే గోల్కొండ కోట కట్టటానికన్నా ముందే ఈ ఆలయం వున్నది. పూర్వం ఈ కొండమీద గొల్లవారు పశువులను మేపుకోవటానికి వచ్చేవారు. వాళ్లు కనుగొన్న ఆలయం ఇదని ఒక కధనం వున్నది. ఇంకొక కధనం ప్రకారం కాకతీయ రాజు ప్రతాప రుద్రుడు ఈ కొండమీద మట్టికోట కట్టించేటప్పుడు అక్కడ అమ్మవారిని పూజించి బోనాల పండగ చేశారు. ఈ మట్టికోట గొల్లవాళ్ళు పాలించేవారు. అప్పటినుంచీ దీనిని గొల్లకోట అనేవారనీ, అదే క్రమంగా గోల్కొండ అయిందంటారు. అప్పటినుంచీ ఇక్కడ బోనాల ఉత్సవం నిర్వహిస్తున్నారు. అందువల్లనే కాబోలు అతి పురాతనమైన ఈ ఆలయంలో ముందుగా బోనాల ఉత్సవం ప్రారంభమవుతుంది. హింతూ ముస్లిమ్ ల సమైక్యతకు చిహ్నంగా, నిజాం సమయంలో జరిగిన బోనాల ఉత్సవాలలో ముస్లింలు కూడా సోదర భావంతో పాల్గోనేవారు.

ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం బోనాల సందర్భంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు లంగర్ హౌస్ చౌరస్తాలో ఆలయ కమిటీవారికి అందజేస్తారు. అలాగే ఈ ఆలయ కమిటీ తరఫున జంట నగరాలలోని సికిందరాబాద్ లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి, లాల్ దర్వాజా అమ్మవారికి, ఇంకా కొన్ని ఆలయాలలో అమ్మవార్లకు పట్టు వస్త్రాలు అందజేస్తారు. ప్రభుత్వ ప్రతినిధులు పట్టు వస్త్రాలు ఆలయ కమిటీకి అందజేసిన తర్వాత చుట్టు పక్కల ప్రాంతాలనుంచీ భక్తులు తీసుకు వచ్చిన తొట్టెల ఊరేగింపు ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం ప్రారంభమయ్యే ఈ ఊరేగింపు రాత్రి వరకూ సాగుతుంది. గోల్కొండ ప్రాంతంలో వుండే ఆలయ పూజారిగారి ఇంటినుంచి అమ్మవారి విగ్రహాన్నికూడా ఊరేగింపుగా తీసుకు వెళ్తారు. ఈ ఉత్సవాలకు సమీపంలోవారేకాక చుట్టుపక్కల జిల్లాలనుంచి కూడా భక్తులు ఎక్కువ సంఖ్యలో హాజరవుతారు. అమ్మవారికి తొమ్మిది వారాలపాటు పూజలు నిర్వహిస్తారన్నానుకదా. ఈ తొమ్మిది వారాలలో 3వ వారం ఉజ్జయినీ మహంకాళి బోనాలు, ఐదవ వారం లాల్ దర్వాజా అమ్మవారి బోనాలతోబాటు అన్ని ప్రాంతాలలో కూడా ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి.

ఆలయం : ఇక్కడ చాలాకాలం ఎటువంటి షేడ్ లేకుండా వున్నది. ఇప్పుడు కూడా ఆలయం చిన్నదే. అయితే అనేక శతాబ్దాలనుండీ పూజలందుకుంటున్న తల్లి మహిమ మాత్రం అనంతమని ఆలయంలో బోనాలు సమర్పించే భక్తులను చూస్తే తెలుస్తుంది. ఈ ఆలయం కిందనుంచీ చార్మినార్ దాకా సొరంగ మార్గం వున్నదంటారు. ఇప్పుడు మూసేశారు.

బోనాలు: బోనాల ఉత్సవాలు ఈ ఆలయంలో ప్రారంభమవుతాయన్నానుకదా. ఇక్కడ 9 వారాలపాటు తొమ్మిది పూజలతో అమ్మవారిని కొలుస్తారు. అంటే దాదాపు 2 నెలల 15 రోజులు. ఈ సమయంలో ప్రతి గురువారం, ఆదివారం భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. తొమ్మిది వారాలు అమ్మవారికి పూజలు చేసిన తర్వాత తొమ్మిదవ వారంతో ఈ ఉత్సవాలు ముగుస్తాయి. ఘటం ఉత్సవం రంగం తర్వాత జరుగుతుంది. హరిబౌలిలోని అక్కన్న మాదన్న దేవాలయము వారి ఘటముతో ఏనుగు అంబారీపై, అశ్వాల మధ్య, అక్కన్న, మాదన్నల బొమ్మల నడుమ ఊరేగింపు మొదలయ్యి సాయంత్రానికి నయాపుల్ వద్ద ఘటముల నిమజ్జనతో ముగుస్తుంది. లాల్‌దర్వాజా నుండి నయాపుల్ వరకు వీధుల వెంబడి వేలాదిమంది ప్రజలు నిలుచుని అత్యంత సుందరంగా అలంకరించబడిన ఘటాలను చూస్తారు. పోతురాజుతో పాటు, వివిధ పౌరాణిక వేషధారణలలో ఉన్న కుర్రాళ్ళు జానపదగీతాలు, వాయిద్యాల నడుమ నృత్యం చేస్తారు. పాత నగరంలో జరిగే ఘటాల ఊరేగింపులో పరిసర ప్రాంతాలలోని ఆలయాలవారంతా పాల్గొంటారు

ఉజ్జయిని మహంకాళి ఆలయం, సికిందరాబాద్

సికిందరాబాద్ లో జనరల్ బజారులో కిక్కిరిసిన దుకాణాల మధ్య వున్నది ఈ ఆలయం. మొదట్లో ఇక్కడ ఆలయం మాత్రమే వుండేది. తర్వాత తర్వాత జనావాసాలు పెరిగాయి. ఈ ఆలయం వెనుక ఒక చిన్న కధ వున్నది. క్రీ.శ. 1813 లో సురిటి అప్పయ్య అనే ఆయన మిలటరీలో పని చేస్తూ ఈ ప్రాంతాల్లో వుండేవారు. ఆయనకి ఉజ్జయినీ బదిలీ అయితే అక్కడికి వెళ్ళారు. ఒకసారి అక్కడ కలరా వ్యాధి తీవ్రంగా ప్రబలి, చాలామంది చనిపోసాగారు. అప్పుడు అప్పయ్యగారు ఉజ్జయిని మహంకాళి ఆలయానికి వెళ్ళి ఆ తల్లికి మొక్కుకున్నారు. కలరా తగ్గిస్తే తన స్వంత ఊరులో అమ్మవారికి ఆలయం నిర్మిస్తానని. కలరా తగ్గింది. రెండు ఏళ్ళ తర్వాత స్వస్ధలానికి వచ్చిన అప్పయ్యగారు దారుతో అమ్మవారి విగ్రహాన్ని చేయించి ఒక వేప చెట్టు కింద వుంచి పూజించసాగారు. తర్వాత చిన్న ఆలయం... ఆ తర్వాత ఆలయం విస్తీర్ణం చేసే సందర్భంలో తూర్పువైపు వున్న బావిని మరమ్మత్తు చేయిస్తుంటే బావిలో మాణిక్యాంబ విగ్రహం దొరికింది. అమ్మవారి ఆనతి ప్రకారం అమ్మవారి విగ్రహం పక్కనే మాణిక్యాంబ విగ్రహాన్ని ప్రతిష్టించారు. క్రీ.శ. 1864 సం. లో శ్రీ సురటి అప్పయ్యగారి సారధ్యంలో ఇదివరకు విగ్రహాల స్ధానంలో ఇప్పుడున్న మూర్తులను ప్రతిష్టించారు. అప్పటినుంచీ ఇక్కడ శాస్త్రోక్తంగా నిత్య పూజలు జరుగుతున్నాయి.

అమ్మవారు: ఇక్కడ అమ్మవారు ఒక చేతిలో ఖడ్గంతో, మరో చేతిలో భరిణతో దర్శనమిస్తారు. పక్కనే మాణిక్యాంబ దర్శనమిస్తుంది. ముందు వున్న వేప చెట్టుని అలాగే వుంచి చుట్టూ ఆలయం నిర్మించారు. ఉపాలయంలో ఈశ్వరాంశ సంభూతుడైన వీరభద్రస్వామి చతుర్భుజాలతో ఎదురుగా నందీశ్వరుడితోసహా దర్శనమిస్తాడు.

బోనాలు:  గోల్కొండలో బోనాల ఉత్సవం మొదలయిన మూడవ ఆదివారం ఈ ఆలయంలోనూ, ఈ పరిసర ప్రాంతాలలోని వందకు పైగా ఆలయాలలోనూ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. అదే రోజు సాయంత్రం ఫలహారం బళ్ళు ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తాయి. మర్నాడు మహంకాళి, మాణిక్యాంబల చిత్రపటాలను ఏనుగు మీద వూరేగిస్తారు. ఇక్కడ బోనాల మర్నాడు జరిగే రంగం చాలా ప్రసిధ్ధి చెందింది. ఘటం ఊరేగింపు రోజూ, పరిసర ప్రాంతాలలో ఒక్కొక్క వీధిలో జరుగుతుంది. ఈ ఆలయాలని మీరు దర్శించారా? లేకపోతే అవకాశం వున్నప్పుడు తప్పక దర్శించండి. ఈ నెల 15వ తారీకునుంచీ మహిళలు ఆసక్తిగా ఎదురుచూసే శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. ఆ సందర్భంగా కొన్ని అమ్మవార్ల ఆలయాలు దర్శించుకుందాము.

- పి.యస్.యమ్. లక్ష్మి

(తెలుగులో అత్యధిక యాత్రా వ్యాసాలు వ్రాసిన మహిళ)

 


More Bonalu