తొలి ఏకాదశి విశేషాలెన్నో..

 


ఏడాది పొడవునా ఎన్ని ఏకాదశిలు ఉన్నా... ఆషాఢంలో వచ్చే ఏకాదశి తీరే వేరు. ఎందుకంటారా...

తొలి ఏకాదశి- కాలాన్ని ఎవరు నిర్వచించగలరు. ఇది మొదలు, ఇది తుది అంటూ ఎవరు విభజించగలరు. ఏదో మన సౌలభ్యాన్ని బట్టి, జీవన విధానం బట్టి... ఇది తొలి, ఇది మలి అంటూ నిర్వచించుకుంటాం. అలాగే ఏకాదశిలు అన్నింటిలోకీ వర్షరుతువు ఊపందుకున్నాక వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశిగా పరిగణించడం మొదలుపెట్టారు. పైగా ఈ పక్షం నుంచే హైందవుల పండుగలు, పబ్బాలు ఒకదాని తరువాత ఒకటిగా వస్తాయి కాబట్టి తొలి అన్న పదం సరిగ్గా సరిపోలుతుంది. సంస్కృతంలో దీనినే ప్రథమ ఏకాదశి అంటారు.

 

శయన ఏకాదశి- ఈ రోజు నుంచి విష్ణుమూర్తి నాలుగు మాసాలపాటు పాలకడలిపై యోగనిద్రలోకి జారుకుంటాడని నమ్మకం. లౌకికరీత్యా ఈ రోజు నుంచి రాత్రివేళలు మరింత పెరుగుతాయి కాబట్టి, వాటిని ఆ స్థితికారుని విశ్రాంతిగా భావించడ సబబే! ఇలా నిదురించిన విష్ణుమూర్తి, కార్తీక శుద్ధ ఏకాదశినాడు వచ్చే ఉత్థాన ఏకాదశి నాడు మేలుకుని తన భక్తులకు దర్శనమిస్తాడని ప్రతీతి.

 

చాతుర్మాసవ్రతం- శయన ఏకాదశి నుంచి ఉత్థాన ఏకాదశి వరకూ ఉండే నాలుగు నెలల పాటు చేసే వ్రతాన్ని చాతుర్మాస వ్రతం అంటారు. భౌతిక రీత్యా ఈ నాలుగు మాసాలలో మన శరీరం దుర్బలంగా ఉంటుంది. ఒక పక్క నుంచి వర్షాలు, మరో పక్క పెరిగిపోతున్న రాత్రివేళలు, ఇంకో వైపు ఉధృతంగా సాగే పొలం పనులు... మానసికంగా, శారీరకంగా మనం నీరిసించిపోతాము. పైగా రాత్రివేళలు పెరగడం అంటే చంద్రుని ప్రభావం మన మీద అధికంగా ఉండటమే! జాతకరీత్యా చంద్రుడు మనఃకారకుడు కదా! ఇలాంటి పరిస్థితుల మధ్య ఉపవాసం, జాగరణ, భగవన్నామస్మరణ... వంటి ఆయుధాలతో అటు మనసునీ, ఇటు శరీరాన్నీ దృఢంగా ఉంచే సాధనమే చాతుర్మాసవ్రతం.

 

చాతరుర్మాసవ్రత కాలంలో వచ్చే ఏకాదశి వంటి పుణ్య తిథులలో ఉపవాసం ఉండటమే కాకుండా, ఒకో మాసంలో ఒకో రకమైన ఆహారాన్ని విసర్జించాలని చెబుతారు పెద్దలు. శ్రావ‌ణ‌మాసంలో కొన్ని రకాలైన ‌కూర‌లు,  భాద్రపదంలో పెరుగు, ఆశ్వయుజంలో పాలు, కార్తికంలో రెండు బ‌ద్ద‌లుగా వ‌చ్చే గింజ‌ల‌ను (పెస‌లు, మినుములు వంటివి) విజర్జించాలని సూచిస్తారు. ఆయా కాలాలలో మన శరీరంలో ఏర్పడే పిత్త, వాత, కఫ సంబంధమైన దోషాలను పరిహరించేందుకు ఈ నియమాలను ఏర్పరిచి ఉంటారు.

 

ఈ చాతుర్మాసవ్రతం మనకే కాదు, యతులకు కూడా ముఖ్యమైన ఆచారమే! ఈ నాలుగుమాసాలపాటు వారు ఎటువంటి ప్రయాణాలూ సాగించకుండా, ఒకచోట స్థిరంగా ఉండి భక్తులకు బోధ చేస్తుంటారు. దీని వెనుకా ఒక భౌతిక కారణం కనిపించకపోదు. యతులు సాధారణంగా పర్వతాలు, అడవులలోనే కదా సంచరించేది. వర్షాకాలంలో కొండచరియలు విరిగిపడటం, వాగువంకలు పొంగిపొరలడం సహజం. ఈ కాలంలో ప్రయాణం ప్రాణాంతకం! కాబట్టి ఒకచోట స్థిరంగా ఉండి తపస్సుని ఆచరించుకోవడం కోసం వారికి చాతుర్మాసవ్రతాన్ని సూచించి ఉంటారు. పైగా ఈ సమయంలో తమ ఊరిగుండా వెళ్లే యతులను కలిసి, వారిని సేవించి, ఆతిథ్యాన్ని అందించి... వారి నుంచి ప్రవచనాలను స్వీకరించే భాగ్యమూ సామాన్యులకు కలుగుతుంది.

 

ఉపవాస విధానం- ఏకాదశి ఉపవాసాన్ని ఆచరించేవారు అంతకు ముందురోజైన దశమినాటి సాయంవేళ నుంచే దీక్షను ప్రారంభిస్తారు. ఇక ఏకాదశి తిథినాడు నిరాహారంగా ఉండి, భగవన్నామస్మరణతో మనసుని పవిత్రంగా ఉంచుకుంటారు. ఏకాదశి ఉదయాన ఉపవాసంతో శరీరాన్ని క్షీణింపచేస్తే, రాత్రివేళ జాగరణతో మనసుని శుష్కింపచేస్తారు. ఉపవాసంతో శరీరం జాగరూకమై తనను తాను స్వస్థత పరుచుకుంటుందని ఆయుర్వేదం చెబుతోంది. ఇక జాగరణతో మనసు జాగరూకమైన తనలో ఏర్పడే ఆలోచనల పట్ల ఎరుకను సాధిస్తుందన్నది పెద్దల మాట. అలా ఉపవాస, జాగరణలతో సాగిన దీక్ష మరుసటిరోజు తెల్లవారుజామునే ఆలయాన్ని దర్శించుకోవడం ద్వారా ఒక ముగింపుకి వస్తుంది. ఈ దీక్షకు కొనసాగింపుగా ద్వాదశినాడు అతిగా భుజించకూడదన్నది నియమం. ఇదీ ఏకాదశి విశేషం!

 

- నిర్జర.

 


More Others