ఇవే సప్తవ్యసనాలు

 

మనిషన్నాక రకరకాల అలవాట్లు ఉంటాయి. కానీ ఆ అలవాట్ల అదుపులో మనిషి ఉంటేనే ప్రమాదం. ఇక ఆ అలవాటు అతని వ్యక్తిత్వంలో భాగంగా మారిపోయి, అతన్ని దిగజారుస్తుంటే అంతకు మించిన వ్యసనం ఉండదు. అందుకనే వ్యసనం అన్న పదానికి ఆపద, చింత, నిష్ఫల ప్రయత్నం వంటి పర్యాయ పదాలు కనిపిస్తాయి. అలాంటి ఆపదలకు కారణం అయ్యే ఏ అలవాటైనా వ్యసనమే! కాకపోతే కాలమాణ పరిస్థితులను బట్టి కొన్ని వ్యసనాలను సప్తవ్యసనాలుగా పేర్కొన్నారు పెద్దలు. అలా మహాభారతంలోని ఉద్యోగపర్వంలో పేర్కొన్న సప్తవ్యసనాలు ఇవిగో...

వెలది జూదంబు పానంబు వేటపలుకు
ప్రల్లదంబును దండంబు పరుసదనము।
సొమ్ము నిష్ప్రయోజనముగ వమ్ముసేత
యనెడు సప్త వ్యసనముల జనదు తగుల॥

వ్యభిచారం, జూదం, మద్యపాన సేవనం, వేట, పరుషంగా మాట్లాడటం, కఠినంగా దండించడం, వృధాగా సొమ్ములను ఖర్చుచేయడం అనేవి వ్యసనాలుగా పేర్కొంటోంది ఈ పద్యం.

- వ్యభిచారపు మత్తులో ఉన్నవాడు తన కుటుంబాన్నీ, ఆరోగ్యాన్నీ, సంపదనీ ఎలాగూ నాశనం చేసుకుంటాడు. పైగా అతని మనసులో స్త్రీల పట్ల ఎలాంటి గౌరవమూ మిగలదు. ఆడవారిని కేవలం వినోదవస్తువులుగానే చూసే దౌర్భాగ్యపు దృక్పథం అతనికి అలవడిపోతుంది. ఇక ప్రతి స్త్రీనీ అదే దృష్టితో చూస్తూ, వారిని వేధించడం మొదలుపెడతాడు.

- గురప్పందాలు, క్యాసినో, రమ్మీ... ఇలా జూదం అనే రాక్షసునికి పది కాదు పదివేల తలలు! ధర్మరాజంతటి వాడు జూదం కోసం తన భార్యని సైతం పణంగా పెట్టే స్థితికి చేరుకున్నాడు. పాచికల దగ్గర్నుంచీ పేకాట వరకూ ఎలాంటి జూదమైనా మనిషి విచక్షణని దెబ్బతీస్తుంది. అందులో ఓటమిని పొందినవాడు, ఎలాగైనా విజయాన్ని పొందాలనే అహంకారంతో... ఒంటి మీద గుడ్డలని సైతం తాకట్టు పెట్టేందుకు సిద్ధపడతాడు. 

- మనిషి నాగరికతను నేర్చిన దగ్గర్నుంచీ మద్యపానమూ అతనికి తోడుగా వస్తూనే ఉంది. సుర, మధిర, మద్యం- పేర్లు ఏవైతేనేం... మనిషి తాగుడుకి బానిసగా మారుతూనే ఉన్నాడు. మద్యం మత్తుని రుచిమరిగిన మనిషి దానికోసం సమయం, సంపద, కాలం, కుటుంబం అన్నింటినీ వదులుకునేందుకు సిద్ధపడతాడు. అదుపు తప్పి చివరికి తన ప్రాణాలనే కోల్పోతాడు. తనను నమ్మినవారిని బజారున పడేస్తాడు.

- వేటని ఇప్పటికీ రాచరికపు ఆటగా భావించేవారు లేకపోలేదు. నోరు లేని జీవాలు ప్రాణాల కోసం పరుగులెత్తడం చూసి సంబరపడిపోవడాన్ని మించిన దారుణమైన వ్యసనం మరొకటి ఉండదు కదా! అందుకే ఇప్పటికీ కొన్ని దేశాలలోని ప్రభుత్వాల సంపాదన కోసం వేటని అనుమతిస్తున్నాయి.

- సంపద పోతే తిరిగి సంపాదించుకోవచ్చు. ఆరోగ్యం హరించుకుపోతే చికిత్స తీసుకుని బాగుపడవచ్చు. కానీ వింటి నుంచి వెలువడిన బాణం, నోటి నుంచి వెలువడిన మాట తిరిగి వెనక్కి రావడం కష్టం. వాటివలన కలిగే నష్టాన్ని నివారించడం ఒకోసారి అసాధ్యం. కానీ ఇలా నోటి మాట మీద అదుపు లేనివారు తిరిగి తిరిగి అదే తప్పుని చేయడం చూస్తూనే ఉంటాము. వారి మాటకు ఎదురులేకపోవడం వల్లనో, అహంకారం తృప్తి చెందడం వల్లనో ఎంత తోస్తే అంత మాట్లాడేస్తూ ఉంటారు. అందుకే విచక్షణ లేకుండా మాట్లాడటాన్ని కూడా సప్తవ్యసనాలలో ఒకటిగా ఎంచారు పెద్దలు.

- దేశాన్ని పాలించే వ్యక్తి కావచ్చు, ఇంట్లో పిల్లలని అదుపు చేసే తండ్రి కావచ్చు, విద్యార్థులను శిక్షించే ఉపాధ్యాయుడు కావచ్చు- దండించే అధికారం ఉన్నవారికి అలా దండించడంలో కనుక తృప్తి లభించడం మొదలుపెడితే... అతడిని అదుపు చేయడం అసాధ్యం. అందుకే నియంతలు లక్షలమందిని పొట్టనపెట్టుకున్న అధ్యాయాలు చరిత్రలో అడుగడుగునా కనిపిస్తాయి. చేసిన తప్పుకి ప్రతిఫలంగా, ఇతరులకు గుణపాఠంగా దండన కనిపించాలే కానీ ప్రతీకారంగా తోచకూడదు.

- డబ్బుని మంచినీరులా ఖర్చుచేయడం ఏ కాలంలో అయినా పెద్ద వ్యసనమే! అవసరం అయినప్పుడు అదే రూపాయి మనకి అక్కరకు రావచ్చు. రూపాయి రూపాయిగా జాగ్రత్త చేసిన సొమ్ములే మన ప్రాణాలను కాపాడవచ్చు. డబ్బుని ఖర్చుచేయడం మీద అదుపులేకపోతే కనుక ఆస్తులన్నీ ఆరతి కర్పూరంగా హరించుకుపోతేగానీ ఆ అలవాటు ఆగదు. అన్నింటికంటే ఖరీదైన వ్యసనం- అవసరం లేకుండా డబ్బులు ఖర్చు చేయడమే!

 

- నిర్జర.


More Vyasalu