శివతాండవాన్ని బ్రహ్మదేవుడు చిత్రించిన పుణ్యస్థలం !

 

 

తమిళనాడులోని కుట్రాలం అనే పేరు వినగానే, అందరి మదిలో అదొక పర్యాటక స్థలంగానే మెదలుతుంటుంది. కుట్రాలంలోని కొండలు, ఆ కొండల పై నుండి జాలువారుతోన్న జలపాతాలే మన మదిలో మెదలడం సహజం. పేదవాళ్ళ ఊటీగా పేర్కొనబడుతున్న కుట్రాలానికి ఆ పేరు ఏర్పడటానికి కారణం అక్కడ నెలకొన్న కుట్రాలీశ్వరుడే ! పంచసభలలోని ఇంద్రసభ ఇక్కడ ఉన్నదని ప్రతీతి. ఇంతటి ఘనచరిత్ర గలిగిన ఈ పుణ్యస్థలం గొప్పదనాన్ని ఎందరో తమిళకవులు తమ కీర్తనలలో నిక్షిప్తం చేసారు. తిరుజ్ఞాన సంబంధర్, తిరునావుక్కరసు, అరుణగిరినాథర్ వంటి కవులు ఈ క్షేత్రమహత్యాన్ని తమ కీర్తనల ద్వారా లోకానికి చాటారు. వేదవ్యాస విరచితమైన 'తామ్రపర్ణి మహాత్మ్యం'లో ధరణీపీఠం గురించి, శెన్బగదేవి గురించి, కుట్రాలీశ్వరుని గురించి విపులంగా వివరించబడింది. ఆ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు కుట్రాలం యొక్క గొప్పదనం అర్థమవుతుంది.

 


పూర్వము ఈ పుణ్యభూమి పృథులలో చెప్పిన నియమాలనుననుసరించి పరిపాలన చేస్తున్న పృథువు రాజ్యంలో ప్రజలంతా సుఖశాంతులతో విలసిల్లసాగారు. ఆ రాజ్యంలో బృహస్పతి వంశావళికి చెందిన రోచిష్మానుడు, సురుచి అనే ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. నాలుగు వేదాలను, సకల శాస్త్రాలను ఔపోసన పట్టిన ఈ అన్నదమ్ములు అపర విష్ణుభక్తులు, అయితే, వారు అపరిమితమైన విష్ణుభక్తి పరాయణత్వంతో దేశంలోని అన్ని ప్రాంతాలను పర్యటిస్తూ శివనింద చేయసాగారు. విష్ణువేగొప్ప, శివుడు గొప్ప కాదన్న వాదనలతో దేశమంతా పర్యటిస్తుండేవారు. ఆ నోట, ఈనోట ఈ విషయం పృథుమహారాజు చెవిన పడింది. విషయం విన్నంతనే ఎంతో కలత చెందిన పృథువు, నేరుగా కైలాసానికి వెళ్ళి శివునితో ఈ విషయాన్ని వినమ్రతతో విన్నవించాడు.

"పరమేశ్వరా ! నాదేశంలో శివభక్తి పరాయణులు ఉండాలి. అందుకు నువ్వే ఏదైనా మార్గాన్ని చూపాలి" అని వేడుకున్నాడు అతని ప్రార్థనను విన్న శివపరమాత్మ, "తగిన సమయంలో అగస్త్య మహాముని ద్వారా అందుకు తగిన ప్రయత్నాలు మొదలవుతాయి" అని పృథువును స్వాంతన పరిచాడు.



అందుకు తగినట్లుగానే, కొన్నాళ్ళ తర్వాత అగస్త్య మహామునీశ్వరుడు కుట్రాలంలోనున్న విష్ణు సన్నిధికి శివచిహ్నాలతో వచ్చాడు. ఆ దృశ్యాన్ని చూసిన విష్ణుభక్తులు అగస్త్యుని విష్ణుసన్నిధికి రాకుండా అడ్డుకున్నారు. వారి గొడవకు ఆరోజున తిరిగి వెళ్ళిపోయిన అగస్త్యుడు మరుసటి రోజున ఓ విష్ణుభక్తునివలె వేషాన్ని వేసుకుని విష్ణ్యాలయానికి చేరుకున్నాడు, అగస్త్య మునీశ్వరుని ఆవిధంగా చూసిన విష్ణుభక్తులు, ఆయన్ని సాదరంగా ఆహ్వానించి, ఆలయం లోపలకు తీసుకెళ్ళి, ఆయన్నే పూజావిధులు నిర్వహించమని చెప్పారు.

గర్భగృహంలోకి వెళ్లిన అగస్త్యుడు, శివుని ధ్యానిస్తూ పూదండతో విష్ణువును తాకాడు. అంతే ఆ మరుక్షణమే, నిల్చున భంగిమలో నున్న విష్ణుమూర్తి ప్రతిమ క్షణమాత్రములో శివలింగంగా మారిపోయింది. అదే సమయంలో ఆలయ ప్రాంగణంలోనున్న విష్ణు పరివార దేవతలంతా శివపరివార దేవతలుగా మారిపోయారు.  ఆ దృశ్యాన్ని చూసిన విష్ణుభక్తులు  స్తంభించిపోయారు. అక్కడున్న సురుచి ఆవేశంతో ఊగిపోయాడు. ఫలితంగా అగస్త్యునికి, సురుచికి మధ్య తీవ్రమైన వాగ్యుద్ధం మొదలైంది. అప్పుడు ఆకాశవాణి పలుకుతూ, ఎవరైనా మధ్యవర్తిని పెట్టుకుని వాదనలను కొనసాగించమని చెప్పింది.

 


ఆ మరుక్షణం శివుని ఎడమభాగం వైపు నున్న ధరణి పీఠం నుంచి ఒక దేవి ఆవిర్భవించింది. ఆ దేవి మధ్యవర్తిత్వం వహించగా, అగస్త్య, సురుచిల వాదనలు కొనసాగాయి. ఈ వాదనలో ఎవరైతే ఓడిపోతారో, వారు గెలిచిన వారి మతాన్ని అనుసరించాలన్న నిబంధనతో సుమారు ఐదురోజులపాటు వాదన కొనసాగింది. చివరగా అగస్త్యమహామునీశ్వరుడే గెలిచాడు. ఫలితంగా అక్కడున్న విష్ణుభక్తులంతా అగస్త్యుని ద్వారా శివదీక్షను స్వీకరించారు. ఈ వాదనకు మధ్యవర్తిత్వం వహించింది ఆ పరాశక్తియే. ఆ ధరణిపీఠ నాయకి సృష్టి, స్థితి, సింహారము అనే మూడింటిని నిర్వహిస్తుంటుంది. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేద అనే మూడు వేదాలరూపంగా భాసించే ధరణీపీఠనాయకి తెలుపు, ఎరుపు నలుగు రంగులతో దర్శనమిస్తుంటుంది. అప్పుడు జరిగిన వాదప్రతివాదనలకు సాక్ష్యంగా కుట్రాలం లో కొలువైన ధరణీపీఠ నాయకి, భక్తజనులను తన కరుణాపూరిత దృక్కులతో కరుణిస్తోంది.

 


More Shiva