కళ్లార్పనీయని... ఆరు కృష్ణాలయాలు!

 

గురువాయూర్: తులసి మాలలతో, ముగ్ధ మనోహర రూపంతో అలరించే గురువాయూర్ గోపాలుడి రూపం మరే ఆలయంలోనూ మనం కాంచలేము. ఇక్కడ ప్రతీ రోజూ గంభీరమైన గజరాజాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఘీంకరిస్తాయి. ఆ తరువాతే ఆలయ ద్వారాలు తెరుచుకుంటాయి. అలాగే, ప్రతీ సాయంత్రం గుడి నిండా దీపాలు వెలిగిస్తారు! అప్పుడు శ్రీకృష్ణుడి శోభను చూడటానికి రెండు కళ్లు సరిపోవు! అంతే కాక గురువాయూర్ లో నారాయణీయమ్ గ్రంథ  పారాయణ చేస్తే సకల రోగాలు సమసిపోతాయని భక్తుల విశ్వాసం.

ఉడుపి: ఉడుపి క్షేత్రంలో దర్శన ప్రత్యేకత ఏంటంటే, భక్తులు కృష్ణుడి విగ్రహాన్ని ఒక కిటికీ లోని తొమ్మిది రంధ్రాల ద్వారా చూస్తారు. ఈ రకంగా తొమ్మిది రంధ్రాల ద్వారా దర్శించుకుంటే ఐశ్వర్యం వస్తుందనేది వారి ప్రగాఢ విశ్వాసం. అంతే కాదు, ఉడిపి కృష్ణుడి అలంకరణలు మనల్ని ఆశ్చర్య చకితులను చేస్తాయి. కొన్ని మార్లు బంగారు ఆభరణాలు, మరి కొన్ని రోజులలో వజ్రాల అలంకరణ చేస్తారు. ఉడిపిలో ప్రతీ రోజూ రథోత్సవం, ప్రతీ రోజూ తెప్పొత్సవం జరగటం విశేషం. ఇక రోజులో పలుమార్లు వివిధ రకాల వాయిద్యాల మంళ ఘోషతో స్వామి వారికి ఇచ్చే హారతి ఒళ్లు పులకింపజేస్తుంది!

 

మేల్ కొటె: మేల్ కొటెలోని విష్ణుమూర్తిని చేలువనారాయణ స్వామి అంటారు. ఈ దేవుడ్ని త్రేతాయుగంలో శ్రీరాముడు, ద్వాపరంలో శ్రీకృష్ణుడు స్వయంగా కొలిచాడంటారు! ఆ విగ్రహమూర్తినే శ్రీరామానుజాచార్యులు మేల్ కొటెలో ప్రతిష్ఠించాడని ఐతిహ్యం. మేల్ కొటెలోని చేలువనారాయణ స్వామికి సంవత్సరానికి ఒకసారి అత్యంత విశిష్ఠమైన వజ్ర కిరీటం అలంకరిస్తారు. సాక్షాత్తూ శ్రీమన్నారాయణుడిదే అయిన ఈ వజ్ర కిరీటాన్ని వైర్ ముడి అంటారు. అలాంటి వైర్ ముడి కిరీటం పెట్టుకుని స్వామి వారు రథంపై ఊరేగటమే... ప్రఖ్యాత వైర్ ముడి ఉత్సవం!

 

పూరి జగన్నాథ్: రాథ దేవీతోనో, బాలకృష్ణుడిగానో కృష్ణుడు దర్శనం ఇవ్వటం సాధారణమే. కాని, పూరీ క్షేత్రంలో జగన్నాథుడు అన్న బలరాముడు, చెల్లెలు సుభద్రతో భక్తుల్ని తరింపజేస్తుంటాడు! ఇక్కడ ప్రతి ఏడాది జరిగే రథయాత్ర ప్రపంచ ప్రసిద్ధి చెందింది. పూరీ వీధుల్లో శ్రీకృష్ణుడు, సుభద్ర, బలరాముల విగ్రహాలను అత్యంత వైభవంగా ఊరేగిస్తారు. రథం సుమారు 45 అడుగుల ఎత్తు, 35 అడుగుల వెడల్పు ఉంటుంది. ఈ రథానికి 16 చక్రాలుంటాయి.

 

ద్వారక: ద్వారవతి గా సంస్కృత సాహిత్యంలో పేరుగాంచిన ద్వారక భారతీయ అతి ప్రాచీన ఏడు నగరాలలో ఒకటి. శ్రీకృష్ణుని కార్యక్షేత్రమైన ఈ పావన ప్రాంతంలో ఇప్పుడున్న నగరం నిర్మించింది శ్రీకృస్ణుని మనవడు వజ్రనాథుడు. అంతకు ముందున్న శ్రీకృష్ణ ద్వారక సముద్రంలో మునిగిపోయింది. దాని అవశేషాలు ఈనాటికీ గుజరాత్ తీరంలో వున్నాయి. ఇక ప్రస్తుతం జనం దర్శించుకునే ఆలయం మహావైభవంగా అయిదంతస్థులతో అలరారుతుంటుంది! లోపలికి వెళ్లే దారి స్వర్గ ద్వారమనీ, బయటకు వచ్చే దారి మోక్ష ద్వారమని అంటారు! ఈ గుడి బయట కూర్చునే సాధువులు ఎవరైతే తమకు భిక్ష ఇస్తారో వారికి పేరు పేరున జేజేలు పలుకుతారు. ఇలాంటి ఆచారం మనకు ఇంకెక్కడా కనిపించదు!

 

మథుర - బృందావనం: మథుర - బృందావనం కృష్ణ భగవానుని అలౌకికమైన అపురూప బాల్యానికి సాక్షి! ఇక్కడ ప్రతీ ఇసుక రేణువు కూడా కృష్ణ తత్వంతో నిండి వుంటుంది. అయితే, మథురలోని ప్రధాన ఆలయం నయన మనోహరంగా అలరిస్తుంది. ఇది ఒకనాడు కంసుని చెరసాల. ఇక్కడే దేవకీ నందనుడు అవతరించాడు!

 

 


More Sri Krishna Janmashtami