• Prev
  • Next
  • పాపం గోవిందరావు బలైపోయాడు

    పాపం గోవిందరావు బలైపోయాడు


    యస్. నర్సింగరావు

    గోవిందరావు తిరుపతి నుండి ట్రాన్స్ఫర్ అయి హైదరాబాద్ వచ్చాడు. ఆయనకు పనిమీద ఉన్న ధ్యాస పనికిమాలిన కబుర్ల మీద ఉండదు. అత్యవసరం అయితే తప్ప మాట్లాడ్డం నచ్చదు. అందునా బాగా పరిచయం ఉండి, కాస్త నచ్చితే తప్ప తక్కినవారితో మాట్లాడ్డం అసలే నచ్చదు. కానీ అతని పక్క సీటు పరమేశానికి మాట్లాడందే తోచదు.

    గోవిందం సీరియస్ గా ఫైళ్ళలో దూరిపోయి ఉండగా వచ్చి ''ఏం మాస్టారూ, అయితే మీరేనన్నమాట తిరుపతి నుండి వచ్చింది?!'' అన్నాడు. ''అబ్బే, వాణ్ణి గోనెసంచిలో కూరి, టాంక్ బండ్ లో విసిరేసి నేనొచ్చా'' అనాలి అనిపించినా తమాయించుకుని... సినిమా హాల్లో కనిపిస్తే 'సినిమాకొచ్చారా?', పెళ్ళికార్డు ఇవ్వడానికి వెళ్తే 'అయితే, మీ అబ్బాయి పెళ్ళి అన్నమాట..' – లాంటి దిక్కుమాలిన ప్రశ్నలు అడుగుతారేంటో అని గొణుక్కుని అవునన్నట్టు తలాడించాడు.

    ''మాది నెల్లూరు. మీరెక్కడి వాళ్ళు? ఐ మీన నేటివ్ ప్లేస్ తిరుపతేనా?'' 'అవన్నీ అవసరమా' అని మరోసారి తిట్టుకుని మళ్ళీ తలూపాడు.

    ''మీ పేరేంటి మాస్టారూ?'' ఈసారి బుర్రూపడం కుదరక తప్పనిసరై పేరు చెప్పాడు గోవిందరావు.

    అతను ఎక్కువ మాట్లాడ్డని అర్ధమయ్యాక ఈయనతో నాకెందుకు అనుకోక ఎలాగైనా మాటల్లోకి దింపాలనే కృతనిశ్చయానికి వచ్చాడు ప్రకాశం. కాసేపు ఆఫీసు విషయాలేవో మాట్లాడాడు.

    అబ్బే, మన గోవిందరావు నోరు మెదపలేదు. తల అడ్డంగా, నిలువుగా ఊపడమే తప్పించి తల దూర్చలేదు. తన ఒపీనియన్ ఏమీ చెప్పలేదు. అవన్నీ తనకెందుకు అన్నట్టు నిర్లిప్తంగా ఊరుకున్నాడు.

    ఇక ప్రకాశానిక్కూడా పంతం పెరిగింది. తిక్క ఎక్కువైంది. ఊరికే చెప్పుకుంటూ పొతే గురుడు వింటున్నాడో లేదో కూడా అంతు పట్టకుండా ఉందని ఎలాగైనా సరే మాటల్లోకి దించాలనుకున్నాడు.

    ''అబ్బా, ఆ ఫైళ్ళు అంతలా కూరుకుపోయి చూడనంతలో కొంపలేం మునగవులెండి. నెలల తరబడీ అవలానే పడుంటాయ్'' అన్నాడు, ఉపోద్ఘాతంగానూ, 'ఇక నువ్వు ఆ పని పక్కన పెట్టు' అని పురమాయిస్తూనూ.

    చెప్పొద్దూ, గోవిందరావుకి ఒళ్ళు మండింది. 'కూసే గాడిద వచ్చి మేసే గాడిదని చెడగొట్టినట్టు, ఇతనేంటి, తను చేయడు, నా పనీ చెడగొడ్తాడూ' అనుకున్నాడు.

    ఇక ప్రకాశం వెంటనే తగులుకుని ''ఇదిగోండి, మీకో చిన్న పజిల్.. నేనో ప్రశ్న అడుగుతాను. మీరు గానీ జవాబు చెప్తే బిర్యానీ, కూల్డ్రింక్స్ తెప్పిస్తాను. ఓడిపోతే మీరు తెప్పించాలి'' అన్నాడు.

    గోవిందరావుకి చిర్రెత్తుకొచ్చింది. 'పనీపాటా చేయకుండా బేవార్సాటలా' అనుకున్నాడు.

    అతనికా ఒప్పందం నచ్చలేదని అర్ధమైన ప్రకాశం ''సర్లే, మీరు కరక్ట్ ఆన్సర్ చెప్తే నేనా రెండూ తెప్పిస్తాను. ఒకవేళ మీరు ఓడిపోతే కేవలం చాయ్ తెప్పిద్దురుగాని. తర్వాత మీ రౌండ్ అన్నమాట. మీరడిగిన ప్రశ్నకు నేను జవాబు చెప్తే మీరు..'' అంటూ స్థూలంగా వివరించాడు. ఈసారి గోవిందరావు ముఖంలో విసుగు స్పష్టంగా కనిపించడంతో అసలే ఒప్పుకోడేమో అనుకుని ''అప్పుడు కూడా నేను కరక్టుగా చెప్తే మీరు కేవలం చాయ్ తెప్పిద్దురుగాని. నేను చెప్పలేకపోతే బిర్యానీ, కూల్ డ్రింక్స్ తెప్పిస్తాను..'' అని మానవుడు ఒప్పుకుంటాడా లేదా అని జంకుతూ చూశాడు ప్రకాశం.

    గోవిందరావుకి ఇదేదో బాగానే ఉంది అనిపించింది. పూర్తిగా ఊపడం కూడా వేస్టు అన్నట్టు కాస్త తలాడించాడు.

    ఆ సరికే ప్రకాశం రెచ్చిపోయి ''సింపుల్ క్వశ్చన్.. మనదేశ వైశాల్యం ఎంత?'' అన్నాడు.

    గోవిందరావుకి సమాధానం తెలీదు. 'నీ దిక్కుమాలిన ప్రశ్న తగలెయ్య' అనుకున్నాడు. 'ఏదో అడిగాడే గానీ, వీడి మొహం, వీడికి మాత్రం ఆన్సర్ తెలుసా? ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్న జాగ్రఫీలు, బయోగ్రఫీలు ఇప్పుడేం గుర్తు ఉంటాయి? చచ్చు ప్రశ్న.. ఇంతకంటే కౌన్ బనేగా కరోడ్ పతి ప్రశ్నలు యమా ఈజీ..' అని సణుక్కుంటూ, స్వగతాలు పలుక్కున్నాడు.

    ''ఏంటి తెలీదా, అయితే ఇవాళ చాయ్ ఖర్చు మీదే'' అన్నాడు ప్రకాశం ఈస్టు నుండి వెస్టు వరకూ నవ్వుతూ.

    గోవిందరావు అందుకు సరేనన్నట్టు బుర్రూపి అసలు సమాధానం ఏంటో తెసుసుకోవాలనే కుతూహలం ఏమాత్రం లేకుండా ''పగలు రెండు కళ్ళు, రాత్రికి నాలుగు కళ్ళు.. ఎవరికి?'' అన్నాడు.

    ఇక ప్రకాశం బుక్కయిపోయాడు. చించీ చించీ విసిగి వేసారిపోయాడు. తమ సెక్షన్లో ఇతర కొలీగ్స్ రానందున పక్క సెక్షన్లు తిరిగొచ్చాడు. ఎవరూ తెలీదన్నారు. తెల్లమొహాలేశారు. వెర్రి మొహంతో తిరిగొచ్చి ''బిర్యానీ, డ్రింకూ తెప్పిస్తాను గానీ, ఇంతకీ దీనికి సమాధానం ఏంటి? అనడిగాడు.

    గోవిందరావు చాలా కూల్ గా ''ఏమో నాకూ తెలీదు'' అన్నాడు.

    ''అదేంటి, జవాబు తెలీకుండానే అడిగారా?'' ఆశ్చర్యంగా అడిగాడు ప్రకాశం.

    ''తెలిసుండాలని చెప్పలేదుగా'' అనేసి ఫైళ్ళలో తల దూర్చేశాడు గోవిందరావు.

    ప్రకాశానికి బుర్ర తిరిగిందని వేరే చెప్పాలా?!


  • Prev
  • Next