రాతి మనసు

రాతి మనసు

ఒక ధనవంతుడికి గోల్ఫ్‌ అంటే పిచ్చి. ఎండావానా, పగలూ రాత్రి ఏమీ తేడా లేకుండా నిరంతరం గోల్ఫ్‌ అడేవాడు. ఆ ఆట ధ్యాసలో పడితే ఆయన భార్యాబిడ్డలు గుర్తుకువచ్చేవారు కాదు. ఆకలిదప్పులు తెలిసేవి కావు. అలాంటి గోల్ఫ్‌ బాబు ఓ సారి తన ఆటలో నిమగ్నమైపోయి ఉన్నాడు. ఇంతలో ఆ గోల్ఫ్‌ మైదానం పక్క నుంచి ఒక శవయాత్ర కదిలిపోతూ కనిపించింది. వెంటనే గోల్ఫ్‌ బాబు తన టోపీని తీసి తలవంచి, ఒక్క క్షణం మౌనంగా ఉండిపోయాడు.

‘ఇన్నాళ్లూ నువ్వు ఒక రాతి మనిషివి అనుకున్నాను. కానీ నీ మనసులో మనుషుల పట్ల ఇంత కరుణ ఉందని తెలియదు మిత్రమా!’ అన్నాడు గోల్ఫ్‌ బాబు హావభావాలను గమనిస్తూ నిల్చొన్న తోటి ఆటగాడు.

‘మరే!’ అన్నాడు గోల్ఫ్‌ బాబు మళ్లీ ఆటకి సిద్ధపడుతూ ‘ఏమైనా తను నాతో 30 ఏళ్లు కాపురం చేసిన మనిషి కదా! ఆ మాత్రం కరుణ కురిపించకపోతే ఎలా!’ అంటూ ఆటలో మునిగిపోయాడు.