పురోగమనం తెలుగు కామెడీ కథ

పురోగమనం తెలుగు కామెడీ కథ

శ్రీ సింగీతం శ్రీనివాసరావు

తన రాజ్యపాలనలో అహర్నిశమూ కళా పోషణలో మునిగిపోయినా క రాజుగారికి ఒక రోజు ఒక ఆలోచన వచ్చింది.అసలు ప్రక్కనున్న మిగతా రాజ్యాల్లో పాలన ఎలా జరుగుతున్నదో వెళ్లి చూడాలని.వెంటనే మంత్రిని పిలిపించి తన ఉద్దేశ్యాన్ని వివరించాడు.

“అలాగే మహారాజా!కావలసిన సిబ్బందినంతా ఏర్పాటు చేస్తాను.మీరు ఎప్పుడు ఊ అంటే అప్పుడే బయల్దేరవచ్చు.ఎక్కడికి వెళ్ళదలచుకున్నారో ముందుగానే ఆ వూరి రాజుగారికి తెలియపరిస్తే మీకు ఘనంగా స్వాగతం పలుకుతారు.అన్నీ వారే చూపిస్తారు "అన్నాడు మంత్రి.

“ వారు చూపించింది మనం చూడ్డం కాదు మంత్రీ.మనము ప్రజల్లో కలిసి అక్కడ ఏం జరుగుతుందో చూడాలి "అన్నాడు క రాజు.

“అంటే ?”అర్ధం కాట్టుగా అడిగాడు మంత్రీ.

“మనం మారు వేషాల్లో సామాన్య ప్రజల్లా వెళ్ళాలి.ఇంకెవ్వరూ వద్దు.మనిద్దరమే "చెప్పాడు క రాజు. మంత్రి ముఖం కాస్త ఇబ్బందిగా పెట్టాడు.పదిమంది సేవకులపని అని తెలిసేసరికి కడుపులో తిప్పినట్టయింది.

“కంగారు పడకు మంత్రీ.అక్కడ మనం రాజు మంత్రి కాదు.స్నేహితులం.ప్రయాణికులం " తన మనసులోనిభయాన్ని రాజుగారు గ్రహించారని తెలియగానే మరింత యిబ్బంది పడ్డాడు మంత్రి.

“రేపు ఉదయమే బయలుదేరుదాం.ముందు మనం సందర్శించే నగరం సింగన్నపురం.అక్కడి రాజుగారు వినోదానికెక్కువ ప్రాముఖ్యత యిస్తారట.చూడాలని వుంది.”అన్నాడు క రాజు.

మరుసటి రోజు వేకువ ఝామున క రాజు,మంత్రి ప్రయాణీకుల దుస్తులు ధరించి కావలసిన తిను బండారాలన్నీ సర్దుకుని సూర్యోదయానికి ముందే బయల్దేరారు.ఎండ జోరు ఎక్కక ముందే సింగన్నపురం చేరుకున్నారు. ముందుగా బజారుకు వెళ్లారు.కాని అక్కడ ఉండవలసిననంత జనం కనిపించలేదు.అంగళ్ళన్నీ మూసి వున్నాయి.

“గురువారాలు మీ రాజ్యంలో సెలవా?”అని ఒకర్నిడిగాడు మంత్రి.

“అన్ని గురువారాలూ కాదు.ఈ రోజే సెలవు "అన్నాడు ఆ వ్యక్తి.

“ఎందుకని ?”అడిగాడు మంత్రి.

“కేళీ మైదానంలో ఒక కొత్త వినోదాన్ని ఏర్పాటు చేశారు రాజుగారు.మావూళ్ళో ఏ రోజు వినోద ప్రదర్శనం వుంటే ఆ రోజు సెలవు "అని చెప్పాడు ఆ వ్యక్తి. క రాజు మంత్రితో సహా ఆ మైదానం వున్నా వైపు కాస్త వేగంగా నడుస్తూ బయల్దేరారు.కళా ప్రియుడైన తాను వినోదం అనగానే చూపించే ఆసక్తికి తానే ఆశ్చర్యపోయాడు. కేళీ మైదానం చుట్టూ జనంతో కిక్కిరిసిపోయింది.

మధ్యనున్న విశాలమైన ఆకుపచ్చని మైదానం మీదికి ఎవ్వరూ రాకుండా భటులు కాపలా కాస్తున్నారు.పడమటి దిక్కున ఒక ఎత్తయిన వేదిక వుంది.దానిమీద వున్న సింహససంపై రాజుగారు అప్పటికే వచ్చి ఆశీనులై వున్నారు.మైదానం మధ్యలో అన్ని వైపులా కప్పబడిన ఒక చిన్న గుడారం వుంది.జరగబోయే వినోదాన్ని గురించి క రాజు,పక్కనున్న వారిని అడిగి తెలుసుకున్నాడు.

ఇది ఒక పోటీ.ఇందులో పాల్గొనేవాళ్ళు ఒక్కొక్కరుగా గుడారంలోకి వెళ్తారు.లోపలి తెరలో ఒక చిన్న రంధ్రం వుంది.అందులోంచి చూస్తే దూరంగా రెండు స్తంభాల మధ్య కట్టిన ఒక పెద్ద జేగంట కనబడుతుంది.పోటీలో పాల్గొనే వ్యక్తి అలా గంటను చూసిన తర్వాత అతని కళ్ళకు గంతలు కట్టి అతని చేతికొక కర్రనిస్తారు.

అతను గుడారం బయటికి వచ్చి జేగంట యెక్కడుందో తెలుసుకుని వెళ్లి దాన్ని కొట్టాలి.అలా కొట్టిన వానికి రాజుగారి చేతి మీదుగా రత్నాలహారం బహుకరింపబడుతుంది.

“ఇదేమిటి ?ఇంత సులభమైన పనికి రత్నాలహారమా !”అనుకున్నాడు మంత్రి. పోటీ మొదలయింది.వరుసగా ఒకరి తర్వాత ఒకరు గుడారంలోనికి వెళ్లడం,రంద్రంలోంచి జేగంటను చూడ్డం,కల్లు గంతలు కట్టడం బైటకి రావడం,ఇక్కడుంచి తమాషాగా మొదలౌతుంది.కర్ర పుచ్చుకుని ఒక్కొక్కరు ఎకడేక్కడో తిరుగుతూ గాలిలోకి కర్రను అటూ ఇటూ విసురుతూ గంటను కొట్టడానికి నానాపాట్లు పడుతున్నారు.కాని వాళ్ళు వెళ్తున్న దిక్కుకి గంటవున్న స్తంభానికి సంబంధమే లేదు.వాళ్ళ ప్రయత్నాలు విఫలమైనప్పుడల్లా జనంలోంచి నవ్వులూ,కేకలు.అందరికంటే యెక్కువగా నవ్వుతున్నది ఆ వూరి రాజుగారే.

ఇలా మధ్యాహ్నం దాటి సాయంత్రం కావస్తున్నా ఎవ్వరూ గంటని కొట్టలేదు సరికదా దాని దరిదాపుల్లోకి కూడా పోలేదు.ఇదంతా గమనిస్తున్న క రాజు యిపుడు తనే పోటీలో పాల్గోవడానికి ఉద్యుక్తుడయ్యాడు.మంత్రికి మొదట కాస్త బెంగ పట్టుకుంది.కానీ క రాజు గారు మారువేషంలో వున్నారు కనుక ఒకవేళ పోటీలో నేగ్గకపోయినా నలుగురిలో నారాయణా అంటూ ఎవ్వరూ పట్టించుకోరని తృప్తిపడ్డాడు.

క రాజుగారు అందరిలాగే గుడారంలోకి వెళ్లారు.రంధ్రంలోంచి కాస్త తీక్షణంగా చూశాడు.ఆ తర్వాత ఆయన కళ్ళకి గంతలు కట్టేరు.గుడారం బయటికి వచ్చి ఒక్క క్షణం ఏకాగ్రతతో ఆలోచించారు. అందరూ ఏ వైపుకి వెళ్ళారో దానికి సరిగ్గా వ్యతిరేకమైన దిశగా తిరిగి నేరుగా వెళ్లి ఒకే ప్రయత్నంలో గంటను కొట్టారు.ఒక్కసారిగా జనమంతా హర్షధ్వనాలతో గంతులేశారు. తను ఎవరైనదీ చెప్పకుండా క రాజుగారు తనలో తాను చిలిపిగా నవ్వుకుంటూ సింగన్నపురం రాజుగారి చేతుల మీదుగా రత్నాల హారాన్ని స్వీకరించారు.

రాత్రి క రాజు,మంత్రి అడవిమార్గాన తిరుగు ప్రయాణం చేస్తున్నారు.చాలా సేపు మౌనంగా వున్నా మంత్రి తన సందేహాన్ని అడక్కుండా ఇక వుండలేక పొయ్యాడు. “మహారాజా !ఈ రోజు జరిగిన పోటీ మొదట చూసినపుడు సులభ సాధ్యంగానే కనిపించింది.కాని ఎందరెందరో ప్రయత్నించారు.విఫలులయ్యారు.మిరూ మాత్రం పూర్తి ఆత్మవిశ్వాసంతో గంటని కొట్ట గలిగారు.మికిలా ఎలా సాధ్యమైంది ?” అని.

“మంత్రీ !మొదట్నించీ నాదొక నమ్మకం.జనం ఏనాడూ తెలివి తక్కువ వాళ్ళు కాదని.కాని అధిక శాతం పొరపాటు చేస్తూనే ఉంటారు.ఎందుకని ?నిలకడగా ఒక్క క్షణం ఆలోచిస్తే అలా చెయ్యరు. ఈనాటి పోటీలో అందరూ రంద్రంలోంచి గంటను చూశారు.కాని గంట ఒక వైపుంటే వాళ్ళు వెళ్ళింది మరోవైపు.దీని అర్ధం ?గంట వాళ్ళు చూసిన చోట లేదు.అంటే వాళ్ళు చూసింది ఒక మిథ్య .

ఒక అద్దంలో కనిపించే ప్రతిబింబం.నేను ఆలోచించింది గంటను ఎలా కొట్టాలని కాదు.ఇంతమంది ఎందుకా పని చెయ్యలేక పోయ్యారని.ఒక్క క్షణం ఆలోచిస్తే అసలు విషయం అర్థమైంది.అందరూ ముందుకు వెళ్లి విఫలమైతే నేను వాళ్లకు వ్యతిరేకంగా వెనక్కి తిరిగి వెళ్లి విజయం సాధించాను. జీవితంలో కూడా అంతే.

బుద్ధిగా ముందుకు సాగిపోతేనే అన్నీ సాధించగలం అనుకోకూడదు.కొన్ని సమయాల్లో వెనక్కి తిరిగి నడిచినప్పుడే నిజమైన విజయం సాధించగలం "అని చెప్పాడు క రాజు. క రాజుగారు చెప్పిన మాటల్ని మల్లె మళ్ళీ తలచుకుంటూ మౌనంగా ప్రయాణం సాగించాడు మంత్రి.

(హాసం సౌజన్యంతో)