ఎవరు బుద్ధిమంతులు!

ఎవరు బుద్ధిమంతులు!

ఓ తండ్రి తన ముగ్గురి పిల్లలనీ దగ్గరకి పిలిచాడు..

‘చూడండి పిల్లలూ! మీ ముగ్గురూ ఈ మధ్య తెగ అల్లరి చేస్తున్నారు. అందుకని నేను ఒక వారం పాటు మిమ్మల్ని పరీక్షించాలనుకుంటున్నాను. ఈ వారం రోజులలో ఎవరైతే మీ అమ్మమాటను చక్కగా వింటారో, పేచీ పెట్టకుండా తింటారో, బుద్ధిగా పనిచేసుకుంటారో... వారికి ఓ పెద్ద కారు బొమ్మని ఇస్తాను’ అన్నాడు.

‘ఓ దానికేం భాగ్యం!’ అన్నారు పిల్లలు.

వారం రోజులు గడిచిపోయాయి. తండ్రి ఆ రోజు ఓ పెద్ద కారు బొమ్మని తీసుకుని ఇంట్లోకి ప్రవేశించాడు. ‘ఈ వారం రోజుల పాటు నేను చెప్పిన విధంగా నడుచుకున్నది ఎవరో మీరే తేల్చుకోండి!’ అన్నాడు తండ్రి కారు బొమ్మని వారి ముందు పెడుతూ.

పిల్లల కాసేపు తర్జనభర్జన పడ్డారు. తమలో తాము వాదులాడుకున్నారు. చివరికి ముగ్గురూ కలిసి ఆ కారు బొమ్మను తండ్రి చేతిలో పెట్టారు.

‘అదేంటీ కారు బొమ్మ నచ్చలేదా!’ అన్నాడు తండ్రి ఆశ్చర్యంగా.

‘బొమ్మ నచ్చక కాదు. నువ్వు చెప్పిన షరతుల ప్రకారం ఆలోచిస్తే... చక్కగా అమ్మమాటని విన్నదీ, పేచీ పట్టకుండా తిన్నదీ, బుద్ధిగా పనిచేసుకున్నదీ... నువ్వేనని తేలింది. అందుకని ఈ బొమ్మ నీకే దక్కుతుంది’ అనేసి తుర్రుమన్నారు పిల్లలు.