టికెట్టే లేకుండా! (ఫ్రెండ్ షిప్ డే స్పెషల్)

టికెట్టే లేకుండా!


అన‌గ‌న‌గా ఓ ముగ్గురు స్నేహితులు... వాళ్లు ముగ్గురూ బుద్ధిగా చ‌దువుకుని మంచి అకౌంటెంట్లుగా మారారు. మ‌ళ్లీ అన‌గ‌న‌గా మ‌రో ముగ్గురు స్నేహితులు... వాళ్లు ఇంకా బుద్ధిగా చ‌దువుకుని మంచి వైద్యులుగా మారారు. వీరంతా క‌లిసి ఒక‌సారి ఒకే రైళ్లో ప్ర‌యాణం చేస్తున్నారు. మాట‌ల సంద‌ర్భంలో వారిలో ఎవ‌రు తెలివైన‌వారు అన్న వాద‌న మొద‌లైంది.
`మేము అకౌంటెంట్ల‌ము కాబ‌ట్టి లెక్క‌ల్లో ప‌క్కాగా ఉంటాం` అన్నారు అకౌంటెంట్లు.
`మీరు లెక్క‌లు రాయ‌డంలోనే జాగ్ర‌త్త‌గా ఉంటారు. మేము లెక్క‌లు వేయ‌డంలో కూడా దిట్ట‌. అందుక‌నే మా ముగ్గురికీ క‌లిపి ఒకే టికెట్టుని కొనుక్కున్నాం!` అని అన్నారు వైద్యులు.
`ఒకే టికెట్టు మీద ముగ్గురు ఎలా ప్ర‌యాణం చేస్తారు?` అని ఆశ్చ‌ర్య‌పోయారు అకౌంటెంట్లు. ఈలోగా టీసీ వ‌స్తున్న హ‌డావుడి తెలిసింది.
వెంట‌నే వైద్యులు ముగ్గురూ ఒక బాత్రూంలోకి దూరిపోయారు. టీసీ త‌లుపు మీద త‌ట్టి టికెట్ అని త‌ట్ట‌గానే లోప‌ల్నుంచి ఒక చేయి టికెట్టుని బ‌య‌ట‌పెట్టింది. వైద్యుల తెలివికి అకౌంటెంట్ల‌కి అంతులేకుండా పోయింది. ఈసారి తాము కూడా ఒకే టికెట్టుని తీసుకోవాల‌ని అనుకున్నారు.
అలా అనుకుని ఫ‌లానా రోజు తిరుగు ప్ర‌యాణంలో క‌లుసుకుందామ‌ని చెప్పుకొని ఎవ‌రికి వారు విడిపోయారు. తిరుగు ప్ర‌యాణంలో వారంతా మ‌ళ్లీ క‌ల‌వ‌నే క‌లిశారు.
`మేమూ మీలాగే ఈసారి ఒకే ఒక్క టికెట్టుని కొన్నాం తెలుసా!` అని గొప్ప‌గా చెప్పారు అకౌంటెంట్లు.
`అవునా! మేము మాత్రం ఈసారి ఒక్క టికెట్టు కూడా తీసుకోలేదు తెలుసా!` అన్నారు వైద్యులు.
వైద్యుల మాట‌ల‌కి అకౌంటెంట్ల మ‌తులు పోయాయి. అస‌లు టికెట్టే లేకుండా ఎలా ప్ర‌యాణం చేస్తారో చూడాలి అనుకున్నారు. ఈలోగా టీసీ వ‌స్తున్న హ‌డావుడి వినిపించింది.
వెంట‌నే అకౌంటెంట్లు ముగ్గురూ ఒక బాత్రూంలోకి దూరిపోయారు. వాళ్లు అలా లోప‌ల‌కి వెళ్లారో లేదో... వెన‌కాలే ఒక వైద్యుడు వెళ్లి బాత్రూం త‌లుపు త‌ట్టి `టికెట్‌` అన్నాడు. ఓ చేయి బ‌య‌ట‌కి పెట్టి ఆయ‌న‌కు టికెట్ అందించింది!!!