Discount Sale

Discount Sale...

Mallik

“కెవ్వ్ వ్వ్ వ్వ్ …” చెవులు గళ్ళు పడిపోయే కేక!

ఆ కేకకి గడ్డం గీసుకుంటున్న కాంతారావు చెయ్యి వణికి గెడ్డం మీద కసుక్కున గాటుపడింది.

“కెవ్వ్ వ్వ్ వ్వ్ …” అన్నాడు అద్దంలో రక్తాన్ని చూస్కుని కాంతారావు.

“ఏంటి అట్టా అరిచారు?… ఈ పేపర్లోని అడ్వటైజ్ మెంట్ మీరు కూడా చూశారా?” సంబరంగా అడిగింది అతని భార్య కామేశ్వరి.

” నా గెడ్డం తెగి నేనరిచాను… నువ్వెందుకిలా అరిచావ్?…” కోపంగా అడిగాడు కాంతారావు.

“ఇదిగో!… పేపర్లోని ఈ అడ్వర్టైజ్ మెంట్ ?” కళ్ళు చిట్లించి అడిగాడు కాంతారావు.

“డిస్కౌంట్ సేల్స్ గురించి! ఏముందో చదివి వినిపించనా?”

“చదువు…” అన్నాడు కాంతారావు మళ్ళీ గెడ్డం గీసుకోవడం మునిగిపోతూ.

కామేశ్వరి చదవడం ప్రారంభించింది.

“ప్రియమైన మిత్రులారా, నేను వ్యాపారంలో చాలా నష్టపోయి బొంబాయి నుండీ మీ ఊరికి దేభ్యం మొహం వేసుకుని వచ్చాను. ఇలా రావడం నాకెంతో ఆనందంగా ఉంది. ఇక్కడ బజార్లో, సెంటర్లో మా డిస్కౌంట్ సెల్ ఈ రోజు నుచే ఆరంభించం.

ఎంతో నాణ్యమైన, ఖరీదైన బట్టలు మీకు అతి తక్కువ ధరలో అమ్మి ఇంకా దివాళా తీసేసి చేతులు దులుపుకుని మా ఊరెళ్ళిపోదామని అనుకుంటున్నాను. కాబట్టి నన్ను దివాళా తీయించే అవకాశం మీరు పొందుతారని భావిస్తూ, ఈరోజే మా డిస్కౌంట్ సేల్ కం ఎగ్జిబిషన్ కి రావాలని కోరుకుంటూ. మీ దగాచంద్.

అమ్మకం రేట్ల వివరాలు.

ఐదు వందల రూపాయల బాబా సూట్ పది రూపాయలకే.

'కెవ్వ్ … ‘ అరిచింది

కామేశ్వరి రెండొందల రూపాయల షిఫాన్ చీర యాభై రూపాయలకే!

“కెవ్వు …” మళ్ళీ అరిచింది.

మూడొందలు ఖరీదు చేసే టెరీ ఊల్ ప్యాంట్ పీస్ డెబ్బయి రూపాయలకే!

“కెవ్ …కెవ్వ్ …”

యాభై రూపాయల దుప్పటి పది రూపాయలకే!

“కెవ్వ్ …కెవ్వ్ …. కెవ్వ్..”

ముప్పయి రూపాయల టవల్ కేవలం అయిదు రూపాయలకే!…

మళ్ళీ సంతోషంతో గుండెలు బాదుకుంటూ అరిచింది కామేశ్వరి.

అలా రేట్ల లిస్టంతా చదివి భర్త మొహం వంక చూసింది.

అంతే… మళ్ళీ కెవ్వుమని అరిచింది.

“అదేంటండీ… మీ మొహమంతా అలా గాట్లు పడ్డాయే౦?… గెడ్డెం కూడా గీసుకోవడం చేతకాదు మొహానికి…”

“కెవ్వు కెవ్వు మని చావు కేకలు పెట్టి నేను ఉలిక్కిపడేలా చేసి ఇప్పుడు గెడ్డం చేస్కోడం రాదంటావేం?… ఇంకొకసారిలా అరిస్తే పీక పిసుకుతానంతే …” అన్నాడు దీనంగా గాట్లు పడిన మొహాన్ని అద్దంలో చూస్కుంటూ.

“పీక పిసికితే పిసికారు గానీ నన్నక్కడికి తీస్కెళ్ళాక పిసకండి…..”

“ఎక్కడికి?…” ఆశ్చర్యంగా చూస్తూ అడిగాడు కాంతారావు.

“ఇంకెక్కడికి…. దగాచంద్ డిసౌంట్ సేల్ కి… హేవండేవండేవండీ… ప్లీజ్…” గెడ్డం పుచ్చుకుని బతిమిలాడి.

“ఛీ… రక్తం, పాడు” అంటూ చేతిని కొంగుకి తుడుచుకుంది.

“తెస్కెళ్ళనుగాక తీస్కెళ్ళను.అక్కడ కుడా నువ్వు కెవ్వుకెవ్వున అరుస్తావ్…”

“ఊహో… నేనరవను… నన్ను దగాచంద్ డిస్కౌంట్ సేల్ కి తీస్కెళ్ళ౦డీ…”

“ఇప్పుడెందుకూ… దండగ…” అన్నాడు మొహం చిట్లించి. కామేశ్వరి మొగుడి అమాయకత్వానికి

ఫక్కుమని నవ్వింది.

“మీ మొహం … దంగా మన్కేంటి!… ఆ దగాచంద్ గాడికి దండగ!!!… వాడు దివాళా తీద్దామని నిర్ణయించుకుని పాపం మనకంత చవకగా అమ్ముతున్నాడు. తెల్సా?… మీకైతే మూడొందలు ఖరీదు చేసే టెర్రీ ఊల్ ప్యాంట్ డెబ్బయి రూపాయలకే వస్తుంది తెల్సా?…” భర్తని టెమ్ట్ చేసింది కామేశ్వరి.

“సర్లే… అలాగే వెళ్దాం …” అన్నాడు కాంతారావు తనుకూడా బట్టలు చవగ్గా కొట్టేయచ్చు కదా అనే ఆలోచనతో.

రెండు రోజుల తరువాత వాళ్ళు దగాచంద్ డిస్కౌంట్ సేల్ కి వెళ్లారు. అక్కడికి జనం విపరీతంగా వస్తున్నారు. చాలా రద్దీగా వుంది. గుమ్మం దగ్గర నిలబడి ఒక వ్యక్తి భోరుమని ఏడుస్తున్నాడు.

“పాపం… ఎవరో ఆయన?!… అతన్ని పర్సేవరైనా కొట్టేశారేమో. అందుకే అలా ఏడుస్తున్నాడు..” కాంతారావు అతనివంక జాలిగా చూసి అన్నాడు.

కామేశ్వరి మళ్ళీ ఫక్కున నవ్వింది.

“మీ తెలివి తెల్లారినట్లే ఉంది… అతనే దగాచంద్. మొన్న ఎడ్వర్టైజ్ మెంట్ లో అతని ఫోటో కూడా ఉంది… పాపం! మనందరికీ చవకగా అత్తలమ్మి దివాళా తీస్తున్నాడు కదా!… అందుకే అలా ఏడుస్తున్నాడు. హిహి పదండి లోపలి వెళ్లి చూద్దాం.” అన్నది కామేశ్వరి గబగబా లోపలి అడుగులు వేస్తూ.

కాంతారావు ఆమెను అనుసరించాడు.

దగాచంద్ వంక వెనక్కి తిరిగి తిరిగి జాలిగా చూస్తూ. “రండమ్మా రండి…” అన్నాడు వీళ్ళని చూస్తూ చీరల సెక్షన్ లోని కౌంటర్ లోని మనిషి.

“మంచి మాంచి చీరల్చూపించు బాబూ…” అంది కామేశ్వరి విలాసంగా.

“చూపించేదేముందమ్మా.. అదిగో… అక్కడ గుట్టగా చీరలు పడేసే ఉన్నాయ్ గా… వాటిల్లోంచి సెలెక్ట్ చేసుకోవటమే…” కామేశ్వరి ఒక్క గంతు గెంతి చీరల గుట్ట మీద పడింది.

” చీరలా గుట్టమీద అలా పడ్తే ఎలా? వేరే వాళ్ళు కుడా సెలెక్షన్ చేస్కోవాలి కదమా?… మీరు గుట్ట మీదనుంచి లేవాలమ్మా…” అన్నాడు సేల్స్ మాన్ మర్యాదగా.

కామేశ్వరి ఓసారి సంతోషంగా చీరల మీద పొర్లి లేచి నిలబడింది.

“వామ్మోవ్… ఎన్ని చీరలో…. ఎన్ని చీరలో!!!” అంది కల్లింతంత చేస్కుని చూస్తూ..

"తీస్కొండమ్మా… మీ కోసమే ఈ చీరలన్నీ బాంబే నుండీ తెచ్చాం…” అన్నాడు సేల్స్ మాన్

కామేశ్వరి గుట్టలోంచి ఆ చీరా ఈ చీరా కాస్సేపులాగి ఒక చీర సెలెక్ట్ చేసింది.

“ఈ చీరెంత బాబూ?” అడిగింది.

“ఇదా?… ముప్పయి రూపాయిలమ్మా…” చెప్పాడు.

“కెవ్వ్ … ” సంతోషంతో గట్టిగా అరిచింది కామేశ్వరి.

ఆ కేకకి సేల్స్ మాన్ కంగారుపడిపోయాడు.

గుమ్మం దగ్గరున్నా దగాచంద్ ఏడు పాపి లోపలి తొంగి చూశాడు.

“ఏంటమ్మా అలా అరిచావు?… మేం తక్కువకేగా అమ్ముతున్నాం?" అన్నాడు అయోమయంగా సేల్స్ మాన్.

“అందుకే అలా అరిచారు…” అంది కామేశ్వరి.

“తక్కువకి బట్టలమ్మేసి నేను దివాళా తీస్తున్నాన్రో దేవుడో…” అంటూ మళ్ళీ ఏడుపు లంకించుకున్నాడు దగాచంద్. అ

తని ఏడుపు చూసి అక్కడున్న అందరూ చాలా సంబరపడ్డారు.

బట్టలు చవగ్గా అమ్మి దివాళా తీస్తున్నాడు కాబట్టే అతనలా ఏడుస్తున్నాడు! అంతగా ఏడుస్తున్నదంటే మనకు ఎంత లాభమో!!… అనుకుని అక్కడి జనం బట్టల మీదకి ఎగబడ్డారు. కామేశ్వరి రెండు చీరలు కొనుక్కుంది.

“అయ్యగారికి సూటింగ్స్ చూస్తారమ్మా?… పది పర్సంట్ నుండీ తొంభై పర్సంట్ డిస్కౌంట్ ఉంది…” అన్నాడు సేల్స్ మాన్

“తొంభై పర్సెంట్ డిస్కౌంట్!… నాకు అవే చూపించు బాబూ!” అన్నాడు కాంతారావు సంతోషంగా.

అతను ఒక జత బట్టలు కొనుక్కున్నాడు. ఆ తరువాత రెండు దుప్పట్లూ, నాలుగు టవల్స్ కొన్నారు. ఇన్ని కొన్నా బిల్లు మూడువందల రూపాయలు మించలేదు. ఇంటికి వెళ్లి కొన్నవన్నీ బయటికి తీసి మరీ మరీ చూస్కుని మురిసిపోయారు.

“పాపం!… ఆ దగాచంద్ ని చూస్తుంటే చాలా జాలేస్తుంది. కదండీ?…. హిహి… బట్టలనీ చవగ్గా ఎంతమంది కొట్టేస్తున్నారో!…. భలే! దివాళా తీస్తున్నాడు…” అంది కామేశ్వరి తన చీరలా వంక మెరిసే కళ్ళతో చూస్కుంటూ.

కాంతారావు బట్టలు కుట్టడానికి టైలర్ కిస్తే కుట్టడానికి జతకి తొంభై రూపాయలు చెప్పాడు టైలర్. అది వింటూనే కాంతారావు కిసుక్కున నవ్వాడు.

“నేనసలు ఈ బట్టలు ఇంతకు కొన్నానో తెల్సా? డెబ్బయి అయిదు రూపాయలక్కోన్నాను… ఇప్పుడు చెప్పు… కుట్టుకులీ ఎంత ఇమ్మంతావ్?” అన్నాడు కళ్ళేగారవేసి నవ్వుతూ.

“మీరు వెయ్యి రూపాయల డ్రస్సు కొన్నా తొంభై రూపాయలకే కుడ్తాం అది మా రేటు సార్!…” కాంతారావు నోరు మూసుకుని బట్టలు టైలర్ కిచ్చి ఇంటికి వెళ్లాడు. టైలర్ బట్టలు కుట్టి ఇచ్చాక్ కాంతారావు వాటిని తొడుక్కొని నిలువుటద్దంలో చూస్కుని మురిసిపోయాడు.

కామేశ్వరి కూడా కొత్త చీట కట్టుకుని సంబరపడిపోయింది. డిస్కౌంట్ సేల్ లో కొన్న దుప్పటి టవల్స్ కూడా వాడారు. ఆ రోజు డిస్కౌంట్ కొన్న బట్టల్ని ఉతికి తాడు మీద ఆరబెట్టిన కామేశ్వరి కెవ్వుమని అరిచి మూర్చపోయింది. కారణం.

ఆమె చీర ఓణీ అయిపొయింది. కాంతారావ్ చొక్కా, ప్యాంటు చిన్న పిల్లల బాబాసూట్ లా అయిపొయింది. టవల్ సైజు చిన్నది కాబట్టి ఏకంగా మాయం అయిపొయింది.!