Dalitaanandalahari

దళితానంద లహరి

*************************************

-పద్మశ్రీ

‘ఎందుకేడుస్తున్నావయ్యా....!’

‘నేను దళితుడిని బాబో...’

“దళితుడివయితే ఏడుపెందుకయ్యా.... మీ దళితులకి ఎన్నో సౌకర్యలుంటేనూ...”

‘మాకా....? సౌకర్యాలా...?’

‘అయ్యో’ ఏడుస్తూ అతని కొడుకు అక్కడికి వచ్చాడు.

'ఏమయిందిరా..’

‘వాడు నన్ను కొట్టాడు....’

‘ఎవడ్రా వాడు....?’

‘దళితుడంట...’

‘మనం కూడా దళితుళమే కదరా...’

‘మనమూ దళితులమేనంట... కానీ పేదోళ్లమంట... మనల్ని పట్టించుకోరంట...’

‘మరి ఆడు పేదోడు కాదా...’

‘ఆడూ పేదోడే కానీ.... పొలిటికల్ లీడరంట....’

‘పొలిటికల్ లీడరయితే ఏంటీ ఆయన కూడా మీలా దళితుడే కదా....?’ అడిగాడు తండ్రీ కొడుకుల సంభాషణని మధ్యలోనే కట్ చేస్తూ.

‘పొలిటికల్ దళితులకి అవేవో చట్టాలున్నాయి బాబయ్యా.... మాబోటి పేద దళితులకి అ చట్టాలన్నీ నీళ్ల మీద బుడగలే....’

“అలా ఎందుకనుకుంటావయ్యా.... ఆ పొలిటికల్ లీడర్లుమీ హక్కులని కాపాడుతూ, మీ చట్టాలని ఉపయోగించుకుంటూ దళితులందరినీ పరిరక్షించేలా కృషి చేస్తారు కదయ్య....”

“ఏం కృషి చేస్తారు బాబయ్యా.... ఎవడి స్వార్ధం వాడిది... తమ ఆధిపత్యాన్ని నిలుపుకోవడం కోసం పడే పాటు మాబోటి పేద దళితులకి సహాయం చేయడం కోసం పడతారనుకుంటున్నారా.....?”

“ఛ... ఊరుకో... మీ లీడర్లు మీ దళితజాతి కోసం రక్తం ధారపోయదానికైనా సిద్ధంగా ఉంటేనూ...”

“అవును ఉన్నారు... నిన్న మా అయ్యని ఎవడో హింసించి రక్తం వచ్చేలా కొట్టాడు... అది పట్టలేదు మా లీడర్లకి... కళ్లముందు రక్తం కారుతున్న మా అయ్యను చూసి కూడా చూడనట్టు నటించి ఎవరో దిష్టిబొమ్మని కొట్టాడని ఉరుకులు పరుగులు తీసి పోలీసు కేసు పెట్టిండ్రు... హు... ఆ దిష్టిబొమ్మకు ఇచ్చిన విలువ కూడా మాకియ్యలేదు...”

“అయ్యో...”

‘అందుకే నేను డిసైడ్ చేసుకున్న....”

“ఏంటది...?”

“మా దళితులందరూ పొలిటికల్ లీడర్లయితే ఎవరికి వారే తమ హక్కులని చక్కగా వాడుకోవచ్చు.... అప్పుడు నా కొడుకుని కూడా మరో దళితుడు కొట్టకుండా చూసుకోవచ్చు...”

“ఆ...”