Cinema theatre booking clerk

సినిమా థియేటర్ బుకింగ్ క్లర్క్

******************************************************************

కుమారి సుచిత్ర గారికి.

మారుతీ కారు దిగి బుకింగ్ వద్దకు వచ్చి,బాల్కానీ టికెట్టు అడిగిన మిమ్ముల్ని చూడగానే చక్కని దర్శకత్వంతో, కమ్మని కథ,పాటలు,మాటలతో రజతోత్సవం జరుపుకున్న తెలుగు సినిమా చూసినంత ఆనందించాను.

మరొక్కసారి బ్లాక్ అండ్ వైట్ పిక్చర్ లాంటి మీ కాటుక కళ్ళలోకి చూడాలనిపించింది.కానీ ముళ్ళపూడి,దాసరిల అద్భుతమైన కథలకు,కొత్తగా సాహితీరంగంలో అడుగు పెట్టిన వాడిచేత సినీ డైలాగులు రాయమంటే,అతడు ఎంత కంగారు పడతాడో అంతగా కంగారు పడ్డాను ధైర్యం చేసి చూడటానికి!

కారణం మనిద్దరికీ అంతస్తులో ఉన్న తేడా!పైగా "మిమ్ముల్ని ప్రేమించాను "అని నేను మనసులోనే అనుకున్నమాట.కొన్ని తెలుగు సినిమాల్లోని అసందర్భపు పాటలూ,మాటలూ అనిపించింది.

కాని సినిమా వదిలాక మీరు వెళ్ళిపోతూ నా పక్కగా వచ్చి,చిరునవ్వుతో టాటా చెప్పినప్పుడు సినిమా నూరురోజులు ఆడిన సందర్భంలో విచ్చేసిన హీరోపైన అభిమాన సంఘాల వారు అభిమానంతో వెదజల్లే పూరేకుల్ని,మీరు దోసిళ్ళతో నాపై జల్లినట్టు అనుభూతి పొందాను.

కానీ ఒక్క విషయం దైర్యం చేసి ఈ ఉత్తరం రాస్తున్నప్పుడు మరోలాభావించండి.బ్రహ్మాండంగా ఉంటుందని వెళ్ళిన సినిమా బోర్ కొట్టినంత చిరాకుపడండి.సినిమా తెరమీద కథానాయక యాబై రోజులు ఉండవచ్చు.

మహా అయితే వందరోజులు.కాని ఏ.సి.థియేటర్ వంటి ఈ నిండు గుండెలో,సెవెన్ టీన్ ఎం.ఎం.తెర వంటి విశాలమైన నా మనస్సు మీరు చెదరని విధంగా ముద్రితమైంది.దీనికి మీరు వెంటనే రిప్లై ఇస్తే,రిలీజ్ పిక్చరుకు రిజర్వుడు సీటు దొరికినంత ఆనందిస్తాను.

లేని పక్షంలో నేను పనిచేస్తున్న థియేటర్లోనే,బ్లాకులో టిక్కెట్టు కొనుక్కుని,సినిమా చూడవలసి వచ్చినంతగా బాధపడతాను.మంచి బ్యానరుపైన మంచి చిత్రాన్ని ఆశించే ప్రేక్షక మహాశాయుడిలా మీ నుండి కట్లులేని సెన్సార్ సర్టిఫికెట్ వంటి సమాధానం ఆశిస్తున్న ఆరాధకుడు.

ఇట్లు

సంగీతరావు

సినిమా థియేటర్ బుకింగ్ క్లర్క్