Home » Articles » Vachestondi Pralayam-2

Rating:             Avg Rating:       140 Ratings (Avg 2.8)

Vachestondi Pralayam-2

" వచ్చేస్తోంది ప్రళయం - 2 "

కవి శేఖర పానుగంటి లక్ష్మీ నరసింహారావు.

" వచ్చేస్తోంది ప్రళయంలోని భాగంలో సూర్యునిలో వంటచెరుకు తరిగిపోతోదంట.ఇలా తగ్గి తగ్గి కొంత కాలానికి సూర్యుడు ఆరిపోతాడుట.సూర్యుడే చల్లారిపోయినప్పుడు చంద్రుడు,తక్కిన నక్షత్రాల మాట ఏమిటంటే...ప్రపంచం అంతా గాఢంధకారం అయిపోదూ!రోజంతా కాళరాత్రే గదా!ఎవరికీ కళ్ళు కనబడవు కదా...ఒకరు గుడ్డివాళ్లయితే తక్కినవారు దారి చూపవచ్చు.

అందరూ గుడ్డివాళ్ళయితే ఏదిగతి ?పైగా చలికి వణికిపోయి కొయ్యబారి పోతామేమో?అన్నం వండుకుందామన్నా, చలికాచుకుందామానుకున్నా...అగ్గిపుల్లయినా వెలుగుతుందో లేదో. అవునూ ఆరిపోయిన సూర్యునికి ఆకర్షణ శక్తి ఉంటుందా?గ్రహాలకు రాజైన సూర్యుడికే దిక్కు లేనప్పుడు ఇతర గోళాలు మాత్రం అంతరిక్షంలో నిలుస్తాయా?పైన ఉండే గోళం ఒకటి డబుక్కున మన మీద పడుతుందేమో...అప్పుడేమిటి గతి ?.” అంటూ జంఘాలశాస్త్రి పెద్ద నిట్టూర్పు విడిచి కూచున్నాడు.

ఈ వార్తలన్నీ విని సభలో అందరూ తెల్లబోయారు.అందరూ నిట్టూర్పులు విడుస్తూ తమ తమ ఆలోచనల్లో పడ్డారు.వారిలో మొదటివాడు కాలాచార్యులు,బ్రహ్మచారి.పోగొట్టుకోవడానికి భార్య గానీ పిల్లలు గానీ లేనివాడు.

అయినా అందరికంటే ఎక్కువ దుఃఖ సముద్రంలో మునిగిపోయాడు. అతని బాధ ఏమిటంటే అతనికి ముక్కుపొడి అలవాటు.సూర్యుడి ఎండ లేకుండా పొగాకు ఆరబెట్టటం ఎలా జరుగుతుందాని ఒక చింత.

ఎలాగోలా అరి,ఎవరైనా పొడి చేసుకుని పెట్టుకుంటే వారిని అరువు అడగడానికి చీకటిలో వెళ్ళగలమా లేదా అని మరో చింత. తర్వాత చెప్పవలసిన వ్యక్తీ వాణీదాసుడు.

ఇతను ఒక కవి.తోకదెబ్బ తగిలి ఎగిరిపోయే భూమి ఇంకో గోళంలో ఢీకొంటే, తను వెళ్లి వేరే గోళంలో పడితే ఆ గోళంలో వారికి తెలుగు రాకపోతే ఎలా అని ఇతనికి వర్రీ. తెలుగురాని వాళ్ళు తన కవిత్వాన్ని ఆస్వాదించలేరు.తమ తమ ఆలోచనలలలో మునిగి ఉన్నారు.

భూమిలో పాతిపెట్టిన వరహాలముంత ఏమవుతుందని ఒకడు. ప్రస్తుతం కోర్టులో జరుగుతున్నకేసులో తన తరుపున తీర్పు వచ్చే సమయంలో ఇదేం ముప్పురా దేవుడా అని ఒకడు, ఎందుకైనా మంచిది,రావలసిన పద్దులు గబగబా వసూలు చేసుకుంటే మంచిది కదా అని ఆలోచించడం మొదలు పెట్టారు.

తూర్పు ప్రాంతం నుండి వచ్చిన ఒకామె " అయ్యా...మా పిన్నమ్మ నిన్ననేను వచ్చేసరికి కొత్తగా పెట్టిన ఆవకాయ ఎండబెట్టింది.అది ఎండకుండానే సూర్యుడు ఆరిపోతాడా ?” అని బాధపడుతూ అడిగింది.

ఇదంతా చూసేసరికి నాకు తోచిన ఆలోచన చెప్పబుద్ది వేసింది. “ సోదరులారా!మనకున్న దుఃఖాలు చాలనట్లు ఈ కొత్త ఏడుపులు ఒకటా?చేటలో పడిన దగ్గర్నుంచి కాటిలో పడేవకరూ మనం ఏడవవలసిన నానారకాల ఏడుపులు చాలనట్లు ఈ ఏడుపులు కూడా ఎందుకు ?చలితో బాధపడేవారు.

మంచుగడ్డ తలకు కట్టుకున్నట్టు,జ్వరం వచ్చినవాడు మంచం కింద కుంపటి పెట్టుకున్నట్టు అనం లేనిపోని కష్టాలు ఎందుకు కొని తెచ్చుకోవాలి?.

మనకు బుద్ధినిచ్చిన దెందుకు?.దుఃఖాన్ని పోగొట్టుకోవడానికి మార్గాలు వెతకడానికి. ఏవేవో ఊహించి,ఎప్పుడో రావాల్సిన కష్టాలు ఇప్పుడే వచ్చినట్టు ఏడవడానికి కాదు.

శత్రువుల నుండి కాపాడుకోవడానికి ఇచ్చిన కత్తితో తన తలకాయ కోసుకున్నట్టుంది. అసలు ఈ ప్రళయం అనే ఆపదే తీసుకుంటే, అది వస్తుందో రాదో సందేహించదగినది.వచ్చినా కలియుగం నాలుగవ పాదంలో రావడానికి వీల్లేదు.

సర్వనాశనం అయిన తర్వాత విచారించడానికి కూడా మనమూ మిగలం.విచారమూ మిగలదు.ఇలాటి ముప్పురాకుండా మనం చేయగలిగేదీ లేదు.

అటువంటి ఆపదలు ఇప్పుడే వచ్చినట్లు ఏడ్చేవాడిని ఏమనాలి?ప్రపంచంలోని వస్తువులు నశించేవి,నీలో ఉన్న పదార్థము శాశ్వతంగా ఉండేది అని తెలిసి కూడా బాధపడటం ఎందుకు? ఏ మహాతేజం ముందు సూర్యుడు వెలవెలబోతాడో,అటువంటి తేజం నీలోనే ఉంది.

అటువంటప్పుడు కంటికి కనబడే సూర్యుడు ఆరిపోతే నీకేం?లేనిపోని బెంగలు పెట్టుకుని మనసు పాడుచేసుకుని చేష్టలుడిగి కూచోకండి.మీ పనులు మీరు చేసుకుంటూనే ఉండండి " అని లెక్చరు యిచ్చాడు జంఘాలశాస్త్రి.

(సరదాగా కాసేపు నవ్వుకోవడానికి మాత్రమే)

(హాసం సౌజన్యంతో)