Home » Articles » Vachestondi Pralayam-1

Rating:             Avg Rating:       182 Ratings (Avg 3.23)

Vachestondi Pralayam-1


కవి శేఖర పానుగంటి లక్ష్మీ నరసింహారావు.

సాక్షి సంఘంలో ఆ రోజు చర్చ రాబోయే ప్రళయం గురించే...ఎవరో ఎండలు ఎక్కువగా ఉన్నాయని వాపోయారు.దాంతో జంఘాలశాస్త్రి ఉపన్యాసం అందుకున్నాడు.ఆ ఉపన్యాసం ఇలా సాగింది.

“ కావూ మరి !ఇంకా ఎక్కువవుతాయి.ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఎండలు హెచ్చయి పోతున్నాయి.వర్షాలు తగ్గిపోతున్నాయి.భూమిలో సారం తగ్గిపోతుంది.భూగర్భంలో ఉండే అగ్ని అధికం అయిపోతోంది.

ఏడుతరాల క్రితం జీవించిన మనుష్యులు ఒకవేళ మళ్ళీ పుడితే వాడు మన జాతి అని మనం అనుకొం.వాడూ మనని అనుకోడు.గేదెముందు లేతపెయ్యల్లా వాడి కంటికి మనం కనబడతాం.

మన కింకా ఎలాటి కొంకినక్కలు పుడతారో ! దీని కంతా కారణం ఈ ఎండ. సూర్యుడి ఆకర్షణ శక్తి ఎక్కువ కావడం చేత భూమి దినదినానికి సూర్యుని సమీపిస్తోంది.మన తాత తండ్రుల కాలం కంటె మన టైములో ఇంకా దగ్గరికి పోయింది.ఆహా..ఇక ముందు ముందు ఏమవుతుందో ఏమో !నిమిష నిమిషం అగ్నిగుండానికి దగ్గరవుతున్నాం.

ఎప్పుడో ఏ పగలు భోజనం చేస్తున్నప్పుడో, రాత్రి నిద్ర పోతుండగానో ఈ భూమి,హోమంలో నేతిబొట్టులా , మంటలో మిడతలా, వెళ్లి ఆ గ్రహకూటమిలో పడిపోయి అంతరించిపోతే... పోనీ దీనికి ఇంకా టైముందని మనసుని ఓదార్చుకున్నా ఇంకో ముప్పు రాబోతోంది.ఇవాళ పత్రిక చూడండి.గ్రహగతుల గురించి ఫారిన్ నుండి వెలువడే పత్రిక ఇది.

దీనిలో ఏం రాసాడో తెలుసా !

ఇక కొన్ని సంవత్సరాలకు ఒక గొప్ప తోకచుక్క పుడుతుందట.దాని తోక మైళ్ళకొద్దీ పొడుగట.నడక విచిత్రమట !అంత గొప్ప తోకతో అది మన భూమిని ఫేడీలున ఒక్కటి తంతుందట.

దెబ్బకీ ఇంత లావు భూమీ పుట్ బాల్ లా ఎగిరిపడుతుంది.ఎక్కడ పడుతుందని ఆలోచించడానికి ప్రయత్నించకండి. అది మన ఊహకు అందదు. కానీ ఆ తోపులో, ఆ ఊపులో అలా అలా అంతరిక్షమార్గంలో భూమి వెళ్ళిపోతుండగా మన గతి ఏమిటో ఆలోచించి చూడండి.

చెట్టు దులుపినప్పుడు నేరేడుపళ్ళు జలజల రాలినట్లు,చెప్పు తీసుకుని మూతి మీద కొడితే పళ్ళు టపటప రాలినట్లు-భూమి నుండి చెల్లాచెదురై అదిరిపడి అంతరిక్షం నుండి జలజల జరజర...జరజర బిర బిర కిందకు పడిపోమూ ? అన్నట్టు కింద అంటే అర్థం ఏమిటి ? అసలు కింద ఎక్కడ ఉంది? భూమిని వదిలిపెట్టినవాడికి కిందేమిటి ? మీదేమిటి ?అలా అంతరిక్షంలో నుండి దిబుకు దిబుకుమని ఎన్ని యుగాలు దిగిపోతామో!? అదీకాక మాట వరసకు చెబుతున్నా-

అలా తోకచుక్క దెబ్బకు భూమి ఎగిరినప్పుడు మనం స్తంభాలని గట్టిగా పట్టుకుని కానీ, భార్యపిల్లలను అంగవస్త్రంతో గానీ, తాళ్ళతో గానీ మంచం కోడుకి వేసి కట్టేసుకుని భూమి నుండి ఎగిరిపోకుండా జాగ్రత్త పడితే ఫరువాలేదని ఆలోచన చేస్తున్నారేమో!అలా చేసినా ఉపద్రవం దాటిపోదు.

ఎందుకంటే తోకచుక్క దెబ్బతిన్న భూగోళం యమస్పీడుతో రంయిరంయిమని చెవులు గింగురులు పడే శబ్దం చేసుకుంటూ దారి, తెన్నూ లేకుండా అంతరిక్షంలో వెళుతూంటే ఏమవుతుందనుకుంటూన్నారు ?తన దారి కడ్డువచ్చిన మరో గోళంలో ఢీ కొట్టడం ఖాయం.

ఢీ కొడితే పండు దోసకాయ విచ్చినట్లు మన గోళం విచ్చుకుపోతోంది.మనం గొట్టంలో నుంచి వెన్నముద్దలు ఎగిరిపోయినట్లు పైకి ఎగిరిపోమూ ? మనలో కొందరు ఇతర గోళాలలో పడిపోకుండా ఉంటారా ? పోనీ ఇవన్నీ జరగవనే అనుకుందాం.