Home » Articles » Telugu Cinemaki Darahaasam-Telugu Prekshakudiki Varahaasam mana Relangi-2

Rating:             Avg Rating:       218 Ratings (Avg 2.61)

Telugu Cinemaki Darahaasam-Telugu Prekshakudiki Varahaasam mana Relangi-2

 

This story is a courtesy of Padma Bhushan Varaprasad Reddy.

 

తెలుగు సినిమాకు దరహాసం- తెలుగు ప్రేక్షకుడికి వరహాసం

మన రేలంగి - 2

తెలుగు సినిమాకు దరహాసం-తెలుగు ప్రేక్షకుడికి వరహాసంగా భాసిల్లిన హాస్యనటుడు మన రేలంగి. తెలుగు తనాన్ని సంప్రదాయాన్ని తోబుట్టువులుగా చేసుకుని ఎదిగిన తెలుగువాడు రేలంగి అందుకే ఆయన నటించిన పాత్రలు ప్రేక్షకులకు అంత చేరువకాగాలిగాయి.

సహజప్రవర్తనా ధోరణి (Behaviour Pattern) సాంఘికాలలోను, కల్పనా ధోరణి జానపదాలలోను, పురాణేతిహాస పరిచయంతో పరకాయ ప్రవేశం చేసి నారదుడు, నక్షత్రకుడు, ఉత్తర కుమారుడు, లక్ష్మణకుమారుడు వంటి పౌరాణిక పాత్రలు పునః సృష్టి చేయగల నటనాపాటవం పౌరాణికాలలోను అద్వితీయంగా చూపించగలిగిన అరుదైన నటుడు రేలంగి.

శ్రోత్రియమైన క్షత్రియమైనా, దళితమైనా ఏ పాత్ర ఎటువంటిదైనా రేలంగివంటి నటశిరోమణికి అవధులు లేవు రానురాను శరీరము అనుకూలించణి అనారోగ్య పరిస్థితి వచ్చినా, ఆ పరిస్థితినే కొత్త తరహా అభినయంగా మార్చుకున్న ధీశాలి అతను.

“నర్తనశాల'లో ఉత్తరుడుగా కౌరవసేనను చూసి వణికిపోతూ అతను అభినయించిన మహాకవి తిక్కన పద్యం 'కౌరవసేనజూచి నడకన్ దొడగెన్ మదితోన మేను' కళ్లముందు ఉత్తర కుమారుణ్ణి తెచ్చి నిలబెట్టింది. మదితో మేను వణకటమనేది ఏమిటో, ఎలావుంటుందో, తిక్కన కవితా హృదయం ఎటువంటిదో రేలంగి చూపించగలిగాడు.

“చెంచులక్ష్మి' లో నారదుడుగా అతని నటన ఆ పాత్రకు చక్కగా సరిపోయిందనే పేరు తెచ్చుకుంది. నీలగగన ఘనశ్వామా' అనే హరినామ కీర్తన చేస్తూ చిత్రంలో రేలంగి భక్తిభావాన్ని ఉద్దీప్తం చేస్తూ ప్రతిభావంతంగా నటించాడు.

డైలాగు చెప్పేటప్పుడు అతను అనేక కొత్తపుంతలు తొక్కాడు తన స్టైల్ అనేది మూడు నాలుగు రకాలుగా వింగడించి ప్రేక్షకలోకం మీద విసిరి 'భళా' అనిపించుకున్నారు. తనదంటూ ఒక ఉచ్చారణ అతనికి వుండేది. 'ఆషాఢప్పట్టీయా శ్రావణపట్టీయా'... 'తమరే తమచోటికే తక్షణమే తట్టా బుట్టాతో తరలిపోవాలి' మొదలైన ఆయన డైలాగులు సినిమాహాల్లో ఈలలు వేయించేవి.

'చింతామణి'లో చచ్చిబ్రతికినవాడును సానికొంప జొచ్చి మిగిలినవాడు లేడు లేడు దైవంబుతోడు' అంటూ ఉత్తరీయం కన్నీటితో తడిపి పిండుతూ పద్యం పాడే దృశ్యం తెలుగు ప్రేక్షకుడు మరచిపోలేడు. ఆయన స్టెప్సు వేస్తూ పాడిన పాటలు 'వినవేబాలా', 'సుందరి నీవంటి దివ్య స్వరూపము', 'నవనీతమ్మా రమణయ్య మామా' కోసం మళ్లీ మళ్లీ సినిమాలు చూసిన వారెందరో! గుణసుందరిలో రాజుగారి మేనల్లుడు, పాతాళభైరవిలో రాణిగారి తమ్ముడు, చింతామణిలో సుబ్బిశెట్టి, నర్తనశాలలో ఉత్త(ర) కుమారుడు, మాయాబజార్ లో లక్ష్మణకుమారుడు, పెద్దమనుషులలో తిక్కశంకరయ్య, దొంగరాముడులో 'భ'కు వత్తులేని వట్టి బద్రయ్య అనే వీర భద్రయ్య, అగ్గి రాముడులో ఫోర్ ఫార్టీ వన్ వంటి ఎన్నో విశిష్ట పాత్రలను ఎంత ప్రతిభావంతంగా రేలంగి పోషించాడో పాత్రోచితంగా సంభాషణలు నొప్పి వక్కాణించాడో తలుచుకుంటే అది ఒక మహా చరిత్రగా సువర్ణాధ్యాయంగా స్పృతి పథంలో నిలిచిపోతుంది.

తమిళంలో టి.ఎస్. బాలయ్య, తంగవేలు వేసిన ఎన్నో పాత్రలకు తెలుగులో రేలంగి తప్పమరొక నటుడు సరితూగే వాడు కాదు. కాదలిక్క నేరమిల్లె, కళ్యాణపరిమ చిత్రాలు తెలుగులో ప్రేమించిచూడు, పెళ్లికానుకగా తీసినప్పుడు రేలంగినే ఆ పాత్రలకు ఎన్నుకొనక తప్పలేదు. రేలంగికి తను నటించిన చిత్రం పేరు చెబితే తెలిసేది కాదు 'పెండ్లిపిలుపు'లో మీ లాయర్ వేషం చాలా బాగుంది' అంటే 'పెండ్లి పిలుపా' నేనెప్పుడు వేశానుబాబూ అందులో అన్నాడొకసారి 'అదేనండీ సి.యస్.ఆర్ గారూ మీరూ' అని చెప్పబోతే 'సినిమా పేర్లు గుర్తుండవు బాబూ..... నిర్మాత పేరు చెప్పండి చాలు' అన్నాడు 'డిబి నారాయణగారి పిక్చరండీ' అంటే 'అట్టా చెప్పండి బాబూ' అని 'మంచి కామెడీ బాబూ చాల్ గొప్ప కామెడీ' అన్నాడు.

'మాయాబజార్' లో లక్ష్మణకుమారుడుగా ఆ రాజదర్పం, ఆత్మాభిమానం, తండ్రినుంచి సంక్రమించిన లక్షణాలన్నిటికీ అద్దంపట్టే రీతిలో రేలంగిహావభావ ప్రదర్శన అద్భుతం. అలాగే శశిరేఖకు తాళికట్టే సన్నివేశంలో పెద్దపులి, భూతం కనిపించగానే అంతచేరువలో అవి ప్రత్యక్షమైతే ఎంత గాభరాపడి గావుకేకలు పెడతామో అక్షరాలా అలా ప్రవర్తించిన మహానటుడు ఒక పక్క చెక్కలవుతున్న కడుపును చేత్తో పట్టుకుని అతనికి జోహారు చెయ్యని ప్రేక్షకుడు ఆనాడు ఈనాడూ కూడా లేదంటే అతిశయోక్తికాదు తన తోటి హాస్యనటులు రమణారెడ్డి, అల్లురామలింగయ్య, చదలవాడ రామకోటి, నల్ల రామ్మూర్తి, సీతారాం, లంక సత్యం, బొడపాటి వంటి వారికి ఆయన పెద్ద దిక్కుగా వుండేవాడు. తమిళ రంగంలో ఎస్.ఎస్.కృష్ణన్, టి ఎ మధురం హాస్యనటులుగా చరిత్రలో నిలిచిపోయేజంట. అలాగే రేలంగి, గిరిజ వెరసి రేలంగిరిజ అలా నిలిచిపోతారు.

మరో మరుపురాని తెరదాంపత్యం సూర్యకాంతంతో! బ్రతుకుతెరువు, భార్యాభర్తలు, దొంగరాముడు, తోడికోడళ్లు వగైరా చిత్రాలలో వారి జంట అభినయం చూసి ఆనందించనివారులేరు. 'ఇరుగువారిని పొరుగువారినిచుట్టాలని పక్కాలని స్నేహితులనీ, వివిధ వృత్తుల్లో వున్నవారిని చిన్నతనం నుంచీ పరిశీలించి చూసేవాణ్ణి మిమిక్రీ ఆర్టిస్టులు ఇదేగా చేసేది.

అదే నేనూ చేసేవాణ్ణి స్కూల్లో మాస్టర్లనీ వారి మాటనీ, నడకనీ, ఇమిటేట్ చేసిన స్టాండప్ ఆన్ ది బెంచ్ గాణ్ణి. కొందరి కంఠస్వరం వారువారు చేసే వృత్తులు, వాటి దైనందిన అవసరాలని బట్టివుంటుంది. అలాగే పాటలాగా మాటకూ శృతి వుంటుంది. ఇవన్నీ గమనించి సొంతం చేసుకునేవాణ్ణి. అది హాబీగా మొదలై జీవనంగా మారిపోయింది అదే నాకు కాస్త తిండీ, మరికాస్త పేరుకూడా తెచ్చిపెట్టింది, అని రేలంగి 1953 లో పచ్చియస్సాస్ కాలేజీ ఆవరణలో జరిగిన చెన్నపురి ఆంధ్ర విద్యార్థి విజ్ఞాన సమితి సన్మానసభలో చెప్పాడు.

'నాటకాల పిచ్చి ముదరడంతో సంగీతంలో సాపాసాలు కూడా పట్టడం నేర్చుకున్నాను రంగస్థల పద్యాలు, పాపట్ల కాంతయ్యగారి పాటలు పాడేవాణ్ని కాకినాడలో నటించే రోజుల్లో నా పద్యాలు నేనే పాడేవాణ్ణి. అంతా మా గురువుగారు జోగినాధం గారి తర్ఫీదు 'రైతులపై అనురాగము జూపని రాజులుండగా ఏల' వంటి ఆనాటి సినిమా పాటలూ బాగా పాడేవాణ్ణి' అని కూడా తను ఎలా గాయకుడైనదీ రేలంగి ఆ సభలో చెప్పడం జరిగింది.

అందుకే ఆయన అటు తర్వాత సినిమాలలో పాడిన పాటల్లో శృతి శుద్ధత వుండేది. తను వేసే పాత్రకు తగ్గట్టు కంఠస్వరం మార్చిపాడే పద్ధతి ఆయనది. హాస్యానికి, సంగీతానికి విడదీయలేని సంబంధం నెలకొల్పిన 'హాసం'గా ఆయన్ని కీర్తించవచ్చు. పరదేశి వంటి ద్విభాషా చిత్రాలలో గాజుల బేహారిగా తమిళంలో తీసిన 'పూంగోదై' చిత్రంలో కూడా రేలంగే నటించాడు అల అనక తమిళ చిత్రాలలో ఆయనకు పేరువచ్చింది.

షూటింగ్ విరామ సమయాలలో ఆయన సంభాషణలు గోష్ఠులు చాలా వినోద భరితంగా ఉండేవి ఒకసారి తన సాటి నటుడితో 'కొరియా యుద్ధం ఎంత వరకు వచ్చింది బాబూ 'అని అడిగాడు రేలంగి.' అదేమిటి! అది ఆగిపోయి అయిదేళ్లు దాటిపోయింది కదా' అన్నాడు ఆ నటుడు 'అది కాదు బాబు మొన్న అడిగితే ఎవరో గనోక్వెల్ దాకా వచ్చిందన్నారుగా' అన్నాడు రేలంగి 'గనోక్వెల్ ఏమిటి అది దగ్గు మందు కదా' అన్నాడు పాపం అమాయకుడు 'ఆ విషయం తమకు తెలుసో లేదో అనీ' అంటూ కొంటెగా నవ్వాడు ఆయన!

అగ్రశ్రేణి నటుడి స్థాయిలో హీరోలకు హీరోగా వెలిగిన రేలంగి చరిత్ర సినీ పురాణంలో ఒక స్వర్ణ పర్వం ఎందరో స్త్రీ పురుష తారల మధ్య రేలంగిని చూసి జన సముద్రం ఉప్పొంగిన సందర్భాలు అనేకం 'నాదేముంది బాబు అంతా ఆ తల్లిదే' అని కళా సరస్వతికి ఆయన నమస్కరించేవాడు మహానటి సావిత్ర అంటే ఆయనకు ఎంతో ప్రేమ, గౌరవం, అంతటి ఆర్టిస్ట్ లేదు, రాదు అనేవాడు అలాగే సి ఎస్.ఆర్ అన్నా అమిత గౌరవం. ఎప్పుడూ ఎంత చిన్న వాడినైనా నాయనా, బాబూ అని తప్ప సంబోధించి ఎరుగని నిగర్వి, వినయశీలి, సంస్కారి రేలంగి.

ఏ రంగ స్థలం నుంచి వచ్చి తాను మహానటుడైనాడో, స్టార్ గా వెలిగాడో ఆ రంగస్థలాన్ని ఆయన ఏనాడూ మరువలేదు. జీవితంలో చివరి దశలో సైతం చింతామణి వగైరా నాటకాలు ప్రదర్శించి తన అభిమానం చాటుకున్నాడు.

ఈ హాసయోగికీ, హాస్యరసయోగికీ ఇదే నా అంజలి.

(హాసం సౌజన్యంతో )

- వేటూరి సుందరరామమూర్తి