‘దేశికోత్తమ’ అమ్జద్ అలీఖాన్
డిసెంబర్ 15 ప్రధాన మంత్రి చేతులమీదుగా అమ్జద్ అలీఖాన్ కి ఘనసత్కారం జరిగింది. విశ్వభారతి యూనివర్సిటీవారు వివిధ రంగాలలోని నిష్ణాతులకు ఇచ్చే ‘దేశికోత్తమ’ అవార్డుకు 2002లో అమ్జద్ అలీఖాన్ ను గణాంక శాస్త్రవేత్త సి. రాధాకృష్ణా రావులకు ఇచ్చారు.
1945లో గ్వాలియర్ లో జన్మించిన అమ్జద్ అలీఖాన్ ప్రముఖ సరోద్ వాద్య నిపుణుడు. మొగలాయి రాజ దర్బారులో వాద్య సంగీతాన్ని అందించిన కుటుంబం వారిది. వారు అనుసరించే ‘సేనియా-బీన్ కర్’ ఘరానా తాన్ సేన్ వారసత్వం అంటారు. తన తండ్రి ఉస్తాద్ హఫీజ్ ఖాన్ వద్ద సరోద్ అభ్యసించిన అమ్జద్ అలీఖాన్ తన 12వ ఏట మొట్టమొదటి సోలో ప్రదర్శన నిచ్చారు. ఆలిండియా రేడియో, టీవీల ద్వారా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించి హిందుస్తానీ శాస్త్రీయ సంగీత వ్యాప్తికి తోడ్పడ్డాడు.

1975లో అంటే 30 ఏళ్ళకే ఆయనను ‘పద్మశ్రీ’ వరించింది. 1977లో తన తండ్రి పేర ఉస్తాద్ హఫీజ్ అలీఖాన్ స్మారక సమితిని ఏర్పరచి 1985 నుండి ప్రతీ ఏటా కచ్చేరీలు నిర్వహించి ఉత్తమ సంగీత కారులను సత్కరించే సంప్రదాయం నెలకొల్పారు అమ్జద్ అలీఖాన్. గతపక్షం డిసెంబర్ 22న ఉస్తాద్ సుల్తాన్ ఖాన్ (సారంగి) ఎల్.కే.పండిట్ (గాత్రం హేమేంద్ర చంద్రసేన్ (సరోద్) లకు ఈ ఏటి అవార్డులు లభించాయి. 1981లో పాకిస్తాన్ పర్యటించి ఇరుదేశాల మధ్య సాంస్కృతిక వారధిని ఏర్పరచడానికి కృషిచేశారు.
సరోద్ వాద్యానికి ప్రాచుర్యం కల్పించి శాస్త్రీయ సంగీతానికి సేవ చేసిన అమ్జద్ అలీఖాన్ కు 1989లో సంగీత నాటక ఎకాడెమీ అవార్డు, తాన్ సేన్ అవార్డు, 1991లో పద్మభూషణ్ లభించాయి. సంగీతానికి ఎల్లలు లేవని చాటి చెబుతూ చైనా, ఇంగ్లండు, అమెరికా, మాస్కో, జర్మనీ, జపాన్ లలో పర్యటించిన ఖాన్ కు ఇంటర్నేషనల్ మ్యూజిక్ ఫోరమ్ అవార్డు లభించింది.
హిందుస్తానీ శాస్త్రీయ సంగీతం వారి వంశంలో ఆరుతరాలుగా వర్దిల్లుతూ వచ్చింది. అది అమ్జద్ అలీఖాన్ తో ఆగటం లేదు తన కుమారులైన అమాన్, అయాన్ లను శిష్యులుగా చేసుకుని తరతరాల వారసత్వాన్ని, ప్రతిభను వారికి అందించారు. వారిద్దరివీ విడివిడిగా 20 దాకా ఆల్బమ్స్ వచ్చాయి. గత నెలలోనే ‘లాండ్ మార్క్ జుగల్ బందీ’ పేర(వర్జిన్ కంపెనీ విడుదల) ఇద్దరూ కలిసి ఒక ఆల్బమ్ రిలీజ్ చేశారు. సరోద్-సితార్ తోను సరోద్-సారంగీతోనూ జుగల్ బందీ ఉన్నా సరోద్-సరోద్ జుగల్ బందీ ఆల్బమ్స్ లో ఇదే ప్రథమం. వారిద్దరూ ఖాన్ వద్ద చిన్న వయస్సు నుండే నేర్చుకున్నారు.
తండ్రి స్థాయి ముందులో తెలియకపోయినా ఆయన వాళ్ల స్కూలుకు వెళ్లినప్పుడు అందరూ ఆటో గ్రాప్స్ కోసం ఆయన వెంటబడడం చూసి ఆయన గొప్పతనం వాళ్లకు తెలిసివచ్చింది. సరోద్ వాద్యంపై గౌరవం పెరిగింది.
వాళ్లకు విద్య నేర్పడమే తప్ప, తన వెంట కచ్చేరీలకు తీసుకువెళ్ళి వాయించమనే అలవాటు లేదాయనకు. వాళ్లు సోలో ప్రదర్శనలు ఇచ్చినపుడు వేరే రకం శ్రోతలుంటారనే అవగాహన వాళ్లకు కలగాలని ఆయన ఉద్దేశ్యం. తండ్రిగానే కాక ఒక కళాకారుడిగా కూడా ఆలోచించి కుమారులు ఇద్దరూ కలిసి ప్రదర్శనలిస్తే శ్రోతలు ఒకరితో ఒకరిని పోల్చి చూస్తారనీ, అందువల్ల ఎవరో ఒకరు బాధపడతారని ఆయన ఆవేదన. అందువల్ల జుగల్ బందీలు ఇవ్వద్దనే వారు. చివరికి ఇప్పుడు జుగల్ బందీ ఇవ్వడం జరిగిపోయింది. ఇక కంపేరిజన్ తప్పేదేమో!
ఈ ఆల్బమ్ లో వారు రెండు రాగాలు వాయించారు. రాగేశ్వరీ, పూర్వీ కళ్యాణ్!’ రాగేశ్వరిని సరోద్ మీద తొలిసారి పలికించినది అమ్జదే!
అమాన్, అయాన్ లు ‘టీవీ’లో సరిగమా ప్రోగ్రాంలలో నిర్వాహకుగా టీవీ ప్రేక్షకులకు పరిచితులు. కానీ వారికంటే ముందు కార్యక్రమం నిర్వహించిన సోనూనిగమ్ కున్న షో బిజినెస్ ఇమేజ్ వాళ్లకు లేకపోవడం ఇబ్బంది అయి పేరు తెచ్చుకోలేకపోయారు.
పైగా దానివల్ల సరోద్ వాయిద్య కులుగా వారికున్న పేరు దెబ్బతినడం మొదలుపెట్టింది. ఇక ఆ కార్యక్రమానికి స్వస్తి చెప్పి సరోద్ వాయిద్యానికే అంకితం అయ్యారు. గురువు, తండ్రి అయిన అమ్జద్ కలలు నెరవేర్చబోతున్నారు.
ప్రముఖ కవుల పై సయీద్ నక్వీ తీసిన ‘గుఫ్ తగూ రీస్ కు అమ్జద్ సంగీతం అందించారు. ఇటీవలే హెచ్.ఎమ్.వి.వారి ‘వాదా’ ఆల్బమ్ కు సంగీతం సమకూర్చారు. దానికి లిరిక్స్ రాసినది గుల్జార్. గుల్జార్ కి ఈయనంటే ఎంత గౌరవమంటే కొన్ని సంవత్సరాల క్రితమే అమ్జద్ పై గుల్జార్ డాక్యుమెంటరీ చిత్రాన్ని నిర్మించారు.
అమ్జద్ కుటుంబం సరోద్ డాట్ కమ్ అనే వెబ్ సైట్ కూడా నడుపుతున్నారు. ఈ క్రమంలో ఈనాటి ‘దేశికోత్తమ’ అవార్డుకు ఒక విశిష్టత ఉంది.
విశ్వకవి రవీంద్రుడు నెలకొల్పిన శాంతినికేతన్ లోని విశ్వభారతి విశ్వవిద్యాలయం ద్వారా ఈ అవార్డు రావడం, అది కూడా కళాపిపాసి అయిన వాజ్ పేయి హస్తాలమీదుగా అందుకోవడం అమ్జద్ అలీఖాన్ కు సంతృప్తి కలిగించే అంశం.
(హాసం పత్రిక సౌజన్యంతో ...
ప్రచురణ: హాసం 1-15 జనవరి, 2002 సంచిక)
|
|