Home » Articles »  Shooting Lo Ting Ting

Rating:             Avg Rating:       74 Ratings (Avg 3.01)

Shooting Lo Ting Ting

Shooting Lo Ting Ting

రావికొండలరావు

***********************

షూటింగ్ అంతే సినిమా షూటింగ్, టింగ్ టింగ్ అంతే ఆక్కడి జరిగే తమాషాలు, సరదాలు, కబుర్లు మొదలైనవన్నమాట.

సినిమాల్లో అవుట్ డోర్ ఇన్ డోర్ అనీ రెండు ఉంటాయి. ఆ రోజుల్లో స్టూడియోలో, ఫ్లోర్ లో షూట్ చేస్తే ఇన్ డోర్. బయట ఎక్కడి తీసిన అవుట్ డోర్. ఆ లెక్కలో చూస్తే ఇవాళ అన్నీ అవుట్ డోర్లే. స్టూడియోలో ఫోర్లోలో తక్కువ.అలాంటిదే ఒక అవుట్ డోర్ మద్రాసులో ఒకరింట్లో జరుగుతుంది.

ఆ ఇల్లు ఊరికి చివర. షూటింగ్ ఏమిటంటే ఆ ఇంటి ఇలాలు మరణించడం. ఆమెను పాడేమీద కట్టి తీసుకెళ్లడం. తక్కిన పాత్రలన్నీ బోరున ఏడవడం వగైరా. ఉదయం షూటింగ్. షూటింగ్ కి కావలసిన సరంజామా ఏడో గంటకి ఆ యింటి దగ్గర జేరవేయాలన్నారు. అందుకని, ఆర్ట్ డిపార్ట్ మెంట్ వాళ్ళు వెదుళ్ళతో కట్టిన పాడే, పాడె ముందు తీసుకెళ్ళి "నిప్పు ఉట్టి " సిద్ధం చేసి ఆ ఇంటి దగ్గరికి నాన్ లోకి తీసుకొచ్చారు.

అది పెద్ద ఇల్లు. కాంపౌండ్. పెద్దగేటు వున్నాయి. లోపల ఇంటి వాళ్ళున్నారు. గెట్ దగ్గర వాచ్ మెన్ కూడా వుంటాడు. ఇక ఆర్ట్ డిపార్ట్ మెంట్ వాళ్ళు వచ్చి గేటు కొట్టి పిలిచి అలసిపోయారు. ఇంట్లో వాళ్ళు ఇంకా లేవలేదు. వాచ్ మెన్ ఎక్కడికో పోయినట్టున్నాడు. ఇక లాభం లేదని, ఆ పాడెనీ, నిప్పుకుండనీ గేటు దగ్గర పెట్టేసి, ఇంకేవో సామాన్లు తీసుకురావడానికి ఆ సెట్టు అసిస్టెంట్స్, వచ్చిన వాళ్ళతో వెళ్ళిపోయారు.

ఏడున్నర ప్రాంతాలలో ఆ ఇంటికి ఎదురుగా వున్నవాళ్ళు ఒక్కొక్కరే నిద్ర లేస్తున్నారు. ఒక భర్త నెమ్మదిగా తన భార్యని గుమ్మంలోకి తీసుకువచ్చి ఎదురు గేటు చూపించాడు. ఆమె దిగ్గుమంది. ఆ భర్త కూడా ప్రశ్నార్థకంగా ఆమె వైపు చూశాడు. అలాగే ఇంకో ఇంటి వాళ్ళు గుమ్మంలోకి వచ్చి కంగారు పడ్డారు. వీళ్ళందరికీ గేటు పక్కనే ఉన్న పాడె, కుండ కనిపించాయి. అదంతా సినిమా షూటింగ్ సరంజామా అని వాళ్లకి తెలీదు.

" పాపం! నిన్నటిదాకా ఆయన నిక్షేపంగానే వున్నాడు. రాత్రికి రాత్రి ఏమైందో పాపం !"

" అది కాదే...ఆ ముసలావిడ, ఇంటి ఆవిడ తల్లి కాబోలు, ఆవిడకు చాలాకాలంగా సుస్తీటగా. ఆవిడ పోయిందేమో "

" ఆవిడ పోవడం ఏమిటండీ. నిన్న సాయంకాలం కూడా నాతో మాట్లాడితేనూ "

పొద్దున్నే వాళ్ళయింటికి పాలు తీసుకొచ్చిన పాలవాడు కూడా కంగుతిన్నాడు. ఇలాంటి సమయంలో పాలు ఇవ్వడమా మానడమా అని ఆలోచించి వెళ్ళిపోయాడు. పక్కఇల్లవాళ్ళు ఇక ఆగలేకపోయారు. ఎదురింటి వారి చుట్టాల్లో తమకు స్నేహితులైన వాళ్ళింటికి ఫోన్ చేసి అడిగారు. ఈ విషయం చెప్పారు.

మరి కాసేపటికి పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు పరామర్షకి బయలుదేరారు. వాచ్ మెన్ గేటు తీశాడు.

" ఏమైంది " అని అడిగారు నెమ్మదిగా. అతను ఇంకా నెమ్మదిగా " ఏంలేదే ?" అన్నాడు.

అందరూ దిగాలు పడుతూ లోపలికి వెళ్లారు.

" రండి రండి..ఏమిటి పొద్దున్నే వచ్చారు. ఎంత అదృష్టం! రండి కూర్చోండి. " అని అంది ఆ ఇంటి ఇల్లాలు.

వీళ్ళు మొఖాలు చూసుకున్నారు. ఎక్కడా విచారాలు లేవు. శవం వున్న సాక్ష్యం లేదు. మరి ఆ పాడె నిప్పుకుండ..? ఉండబట్టలేక అడిగారు ఆ పాడె అవి ఏమిటని.

" అదా సినిమా షూటింగ్ మా ఇంట చేస్తామన్నారు. అయితే అలాంటి సీను వుందని మాకు చెప్పలేదే " అన్నాడు ఇంటాయన. మొత్తానికి టీ కప్పులో తుఫాను చల్లారిపోయింది.ఎదురింటి పక్కింటి వాళ్ళు "అమ్మయ్య "అనుకున్నారు.

గేటు గలవాళ్ళు గేటు దగ్గరకు రాగా, సినిమాకు సంబంధించిన వాళ్ళు ఒక్కొక్కరూ కార్లు దిగుతున్నారు.అపార్థాలు కలిపించినందుకు, ఆ చర్యకూ ప్రొడక్షన్ వాళ్ళ మీద మండిపడ్డారు.

" పొరపాటు అయింది. ఇప్పటికిప్పుడు ఇంకో ఇంటికి వెళ్ళలేం.క్షమించండి. ఎక్సూజ్, మన్నించండి " లాంటి మాటలన్నీ వాడి షూటింగ్ అవుననిపించుకున్నారు.