.gif)
This story is a courtesy of Padma Bhushan Varaprasad Reddy.
హాస్యనట చక్రవర్తి మన రేలంగి -1
రెండున్నర దశాబ్దాల పాటు తెలుగు సినిమాలో హాస్యనట చక్రవర్తిగా పేరుగాంచిన ఏకైక హాస్యనటుడు మన రేలంగి.
చిన్నతనంలో తాడేపల్లిగూడెంలో చిల్లర వేషాలు అవీ వేస్తూ నేర్చుకున్న పద్యాలు, వాటి రాగాలూ ఆ తరువాత కాకినాడలో మహాగురువు శ్రీ గండికోట జోగినాథం గారి శిష్యరికంలో నటనతోపాటు సాధించుకున్న సంగీతజ్ఞానం, యంగ్ మెన్స్ హాపీక్లబ్ లో వేసిన నాటకాల ద్వారా వంట బట్టిన హాస్య నటన శ్రీ రేలంగి వెంకట్రామయ్య గారిని 'హాసం'గా తీర్చి దిద్దాయి. పౌరాణిక, జానపద, సాంఘిక పాత్రలకు అచ్చు గుద్దినట్లు సరిపోయిన మహానటుడు, గాయకుడు కూడా.
పామరుల నుంచి పండుతుల వరకు 'రేలంగోడు' లేని సినిమా రుచించని శకం ఇప్పటికీ కొనసాగుతున్నదంటే అతిశయోక్తి కాదు. నటుల్లో రేలంగి, రచయితల్లో పింగళి, ముళ్ళపూడి, జంధ్యాల సమగ్ర సంపూర్ణ హాస్యరసం కురిపించి దాని స్వరూపాన్ని ప్రేక్షకులకు చూపిన వారంటే అత్యుక్తి కాదు. రేలంగి, రమణారెడ్డి ద్వయం ఆనాటి హాస్యరస దేవతకు రెండు కళ్లు.
ఆ తరువాత వచ్చిన హాస్య నటుల్లో చాలామందిని ప్రభావితం చేసింది రేలంగి ఫక్కీ హాస్యంతో పాటు కరుణ, రౌద్ర రసాలను కూడా సమర్ధవంతంగా పలికించిన ప్రతిభశాలి. నేను ఆంధ్ర సచిత్ర వార పత్రికకు సినిమా ఎడిటర్ గా వున్న రోజుల్లో (1959-63) తరచుగా ఆయన్ని కలిసే అవకాశం కలిగేది ఆయనలేని సినిమా ఉండకపోవడమే దానికి కారణం.
నిర్ణీత సమయానికి వచ్చి రంగు పూసుకుని సెట్ బైట ఎన్ని గంటలైనా వేచి వుండిన ఆనాటి నటులు సి.ఎస్.ఆర్. రేలంగి, ముక్కాముల వంటి వారిలోని క్రమశిక్షణ, సహనరూపంలో వారు చూపిన సంస్కారం, తమ వృత్తి పట్ల వారికి గల అంకిత భావం ప్రత్యక్షంగా చూసే అవకాశం పత్రికా విలేఖరిగా నాకు కలిగింది. ఆయన కోపం, దుఃఖం, రౌద్రం, అన్నీ హాస్యమే కురిపించేవి!

నవరసాల్లో హాస్యేతరమైన ఏ రసం ప్రదర్శించినా నవ్వు తెప్పించిన నటుడు రేలంగి. మద్రాసులో మహానాటక ప్రయోక్త తన గురువు శ్రీ గండికోట జోగినాథం గారి నాటక సప్తాహం జరిగినప్పుడు ఎంతో బిజీగా వుండి కూడా ప్రతి ప్రదర్శనకు హాజరై చివరి రోజున అయన కాళ్లకు నమస్కరించి, కౌగిలించుకుని బావురుమన్న రేలంగి ఆర్థ్ర హృదయం ప్రత్యక్షంగా చూసి పులకించిన వారిలో నేనొకడను.
ఆనాడు ప్రసంగించలేని గాద్గదికంతో ఆయన ఎంతో ఆవేశానికి గురి అయినాడు. గతాన్ని విస్మరించని వాడు నిత్య యవ్వనుడు. అటువంటి కొద్దిమంది కళాకారులలో రేలంగి ఒకరు మకుటం లేని మహారాజుగా కపటంలేని కళాకారుడుగా ఆయన జీవితం కొనసాగింది.
అటు తరువాత వచ్చిన హాస్యనటులు ఎందరికో ఆయన ముద్ర పడింది ఘంటసాల లాగా పాడాలని, రేలంగిలాగా కామెడీ చెయ్యాలని అనుకొని ఔత్సాహికులు అరుదుగా వుండేవారు. రేలంగినట జీవిత విజయానికి మహా రచయితల సంభాషణలు దర్శకుల విన్నాణాలు ఆహార్యంతో అమరిన స్వరూప దర్శనాలతో పాటు నటనాకౌశలం, 'టైమింగ్' ప్రధాన కారణాలు ముఖ్యంగా టైమింగ్ విషయంలో మహానటుడు ఎస్వీ రంగారావు, రేలంగి ఇద్దరినీ ఎక్కువగా చెప్పుకునేవారు.

గుణసుందరి కథ, ప్రియురాలు, దొంగరాముడు, సువర్ణసుందరి, రహస్యం, పాతాళభైరవి, మిస్సమ్మ, అప్పుచేసి పప్పుకూడు, మాయాబజార్, అగ్గిరాముడు, పక్కింటమ్మాయి, వెలుగునీడలు, తోడికోడళ్లు, కులగోత్రాలు, చెంచులక్ష్మి, వాగ్దానం, విప్రనారాయణ, రోజులుమారాయి, చింతామణి, చెరపకురా చేడేవు, పెళ్లికానుక, ప్రేమించిచూడు, భాగ్యరేఖ, భలేరాముడు - ఇలా ఎన్ని చిత్రాలని!
పాతాళభైరవిలో 'వినవే బాలా నా ప్రేమగోల,' ఓయమ్మలారా అనే తాళలేనే', మిస్సమ్మలో 'సీతారామ్ సీతారామ్, ' 'దర్మం సెయ్ బాబు', విప్రనారాయణలో ;ఆడది అంటే లయం లయం - ఆ నీడంటేనే భయం భయం' సారధి వారి ఎత్తుకు పై ఎత్తు చిత్రంలో కాబోలు 'ఎవడనుకున్నావ్ ఎవడనుకున్నావు ఇట్టావుండే బిచ్చాలన్నా ఇంతట్లోనే ఇంతవుతాడని' వగైరా ఎన్ని పాటలో తన పాత్రకు తనే పాడుకున్ననట గాయకుడు ఆయన.
పెండ్లిపిలుపు చిత్రంలో సి.ఎస్.ఆర్ కు జూనియర్ లాయర్ గా రేలంగి చేసిన అభినయం శ్రీ పూసపాటి కృష్ణంరాజు (సుప్రసిద్ధ కధా రచయిత రెండు బంట్లు పోయాయి) రాసిన తూర్పు యాస డైలాగులు మరుపురానివి.
(హాసం సౌజన్యంతో)
వేటూరి సుందరామమూర్తి
|
|