Home » Articles » An Article on Cartoonist RK Lakshman

Rating:             Avg Rating:       195 Ratings (Avg 2.58)

Samanyudiki jarigina asamanya satkaram

సామాన్యుడికి జరిగిన అసామాన్య సత్కారం

గత పక్షం డిసెంబరు 18న పూణేలో ఒక ఆద్భుతం జరిగింది.

ప్రపంచ చరిత్రలో ఎక్కడా జరగని విధంగా ఒక కార్టూన్ క్యారెక్టరుకు అక్షరాలా శిల్పాభిషేకం జరిగింది.

అదీ భారత ప్రథమ పౌరుడి చేతుల మీదుగా!

ఆర్కే లక్ష్మణ్ కార్టూన్లలో కనిపించే కామన్ మాన్ ను 8 అడుగుల కంచు విగ్రహంగా మలిచి సింబయోసిస్ ఇంటర్నేషనల్ కల్చర్ అండ్ ఎడ్యుకేషన్ సెంటర్ ఆవరణలో స్థాపించడం జరిగింది. కామన్ మాన్ సృష్టికర్త ఆర్.కే.లక్ష్మణ్ (రాశిపురం కృష్ణస్వామి లక్ష్మణ్), ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ కార్టూనిస్టుగా జగద్విఖ్యాతి పొందారు.

ప్రముఖ రచయిత ఆర్.కే.నారాయణ్ (స్వామి అండ్ ప్రెండ్స్, గైడ్ ఇత్యాది నవలల రచయిత) తమ్ముడిగా, ఆయన నవలలకు, కథలకు తన బొమ్మలద్వారా ప్రాణ ప్రతిష్ట చేసిన ఘనుడు.

నారాయణ్ మాల్గుడి అనే ఒక ఊహా నగరాన్ని, దానిలోని రకరకాల జనాలను కలంద్వారా సృష్టిస్తే, వారెలా ఉంటారో, ఆ పరికరాలు ఎలా ఉంటాయో తన కుంచెద్వారా వెలువరించి ఆ అన్నకు దీటుగా వచ్చే తమ్ముడని నిరూపించుకున్నారు.

బొమ్మలు వేయడమే కాక లక్ష్మణ్ స్వయంగా రచయిత కూడా. ‘ఏక్సిడెంట్’ వంటి క్రైమ్ కథలు, తన శైలిలో రాసినా ‘సారీ, నోర్ముయ్’ వంటి వ్యంగ్య నవలలో అన్నగారి పోకడలు పోవడం జరిగింది. చక్కటి చిత్రకారుడు, క్యారికేచరిస్టు అయిన లక్ష్మణ్ తన కార్టూన్లలో వాతావరణాన్ని నాలుగు గీతలతో సరిపెట్టకుండా విపులంగా చిత్రీకరిస్తారు.

1947లో ‘ది టైమ్స్ ఆఫ్ ఇండియా’లో కెరియర్ ఆరంభించిన లక్ష్మణ్ అర్ధశతాబ్ది దాటినా ఆ సంస్థనే అంటి పెట్టుకుని ఉన్నారు. ఆ పత్రిక మొదటి పేజీలో కనబడే పాకెట్ కార్టూన్ శీర్షిక పేరు ‘'You Said it’. ఆ పాకెట్ కార్టూన్ ద్వారా సంఘాన్ని, రాజకీయాల్ని విమర్చించడానికి ఆయన ఎంచుకున్న పాత్ర కామన్ మాన్.

50 ఏళ్ల క్రితం నాటి గుమస్తాలు ధరించే దుస్తులు ధరించిన మధ్య వయస్కుడి పాత్రను ఆయా సంఘటనలకు సాక్షిగా నిలబెట్టారు. అతడు మాట్లాడడు. కళ్ళప్పగించి చూసి విస్తుపోవడమే అతని పని. అందుకే జన సామాన్యంలోని ప్రతీ వ్యక్తీ ఆ బొమ్మలో తనను తాను ఊహించుకోవడం జరిగింది. ఆ ఐడెంటిటీ వల్లనే కామన్ మాన్ కి అంతపేరు.

నిర్భయానికి, నిజాయితీకి పేరుబడ్డ లక్ష్మణ్ తన కార్టూన్ల ద్వారా మేధావుల ప్రేమను, ఆదరాన్ని చూరగొన్నాడు.

స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశాన్ని విడిచి వెళుతున్న లార్డ్ మౌంట్ బ్యాటెన్ ఇకపై లక్ష్మణ్ కార్టూన్లను చూడలేమని వాపోయారట.

50 ఏళ్లకు పైగా నిరంతరంగా, పాఠకులకు బోరు కొట్టకుండా ఆ శీర్షికను నిర్వహించగలిగిన ఆసామాన్య ప్రతిభాశాలి లక్ష్మణ్.

కామన్ మాన్ ను ముఖ్య పాత్ర చేసి తీసిన టీవీ సీరియల్ ‘వాగ్లే కీ దునియా’ కూడా హిట్ అయింది. దానినే తెలుగులోకి ‘అమాయక చక్రవర్తి’ పేర అనువదించారు.

తమాషా ఏమిటంటే కామన్ మాన్ పాత్ర ద్వారా లక్ష్మణ్ ఎద్దేవా చేసిన రాజకీయ నాయకులందరూ ఆనాటి ఫంక్షన్ కి హాజరయి లక్ష్మణ్ ను ఆకాశానికి ఎత్తేశారు.

సౌమ్యతకు పేరుబడ్డ రాష్ట్రపతి కే.ఆర్.నారాయణ్ తన చైనా పర్యటన సందర్భంగా లక్ష్మణ్ తనపై వేసిన కార్టూన్లను సభలో చెప్పి నవ్వించారు కూడా!

(హాసం పత్రిక సౌజన్యంతో...

ప్రచురణ: హాసం 1-15 జనవరి, 2002 సంచిక)