లెక్క తప్పిన టీచర్‌

 

లెక్క తప్పిన టీచర్‌

లెక్కల టీచరు గారు క్లాసులోకి వచ్చేసరికి అంతా భయంతో వణికిపోతున్నారు.

‘మీరు లెక్కలు ఎంత బాగా చేయగలరో ఇవాళ తేల్చిపారేస్తాను’ అంటూ టీచరుగారు వాళ్లలో భయాన్ని మరింతగా పెంచిపారేశారు.

‘ఒరేయ్‌ పార్థూ! ముందు నువ్వు లేచి నిలబడు’ అని అరిచారు టీచర్‌.

పార్థూ భయంభయంగా లేచి నిల్చొన్నాడు.

‘నీ దగ్గరకి ఓ ముగ్గురు మనుషులు వచ్చి తలా ఓ రెండు పిల్లులనీ ఇచ్చారనుకో, మొత్తం ఎన్ని పిల్లులవుతాయి’ అని అడిగారు.

‘ఏడు పిల్లులు అవుతాయి టీచర్‌’ అని చెప్పాడు పార్థూ ఉత్సాహంగా.

‘నీ మొహం! ప్రశ్నని సరిగ్గా విను. ఆ తరువాత అన్ని విషయాలూ ఆలోచించు. ఆ తరువాతే జవాబు చెప్పి ఏడు. నీ దగ్గరకి ఓ ముగ్గురు మనుషులు వచ్చి తలా ఓ రెండు పిల్లులనీ ఇస్తే... మొత్తం ఎన్ని పిల్లులవుతాయి’ అని మరోసారి అడిగారు టీచర్‌.

‘ఏడు పిల్లులే అవుతాయి టీచర్’ అని చెప్పాడు పార్థూ బిక్కమొగంతో!

‘అలాక్కాదు. ఇదే ప్రశ్నని ఇంకోలా అడుగుతాను ఉండు! నీ దగ్గరకి ఓ ముగ్గురు మనుషులు వచ్చి తలా ఓ రెండు జామకాయలనీ ఇస్తే... మొత్తం ఎన్ని జామకాయలవుతాయి’ అని తెలివిగా అడిగారు టీచర్.

‘ఆరు జామకాయలవుతాయి టీచర్‌!’ అని చెప్పాడు పార్థూ.

‘గుడ్‌! ఇప్పుడు చెప్పు ముగ్గురు మనుషులూ జామకాయల బదులు రెండేసి పిల్లులు ఇస్తే ఎన్ని పిల్లులవుతాయి’

‘ఏడు పిల్లులు!’

‘నీకేమన్నా పిచ్చా! జామకాయలు ఆరే అయినప్పుడు, పిల్లులు ఏడెలా అవుతాయి!’ కోపంతో విరుచుకుపడ్డారు టీచర్‌.

‘నిజమే కానీ! మా ఇంట్లో ఇప్పటికే ఓ పిల్లి ఉంది కదా టీచర్‌! దాంతో కలుపుకొని ఏడు పిల్లులు అవుతాయి కదా!!!’