బ్లాక్ అండ్ వైట్ సినిమాల కాలాన్ని తెలుగు సినీ స్వర్ణయుగంగా భావిస్తారు సినీ పండితులు.ఆ కాలంలో నటసామ్రాట్ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారికి మూడు సినిమాలలో నటించమని అవకాశాలొచ్చినా,ఆయన వేరు వేరు కారణాల వల్ల ఆ చిత్రాల్లో నటించనని తిరస్కరించారు.ఆ చిత్రాల్లో ఆ తర్వాత విశ్వవిఖ్యాత నటసార్వభౌమ,నటరత్న,డాక్టర్ నందమూరి తారక రామారావు నటించటం జరిగింది.వాటిలో మొదటిది "రాణీ రత్నప్రభ" చిత్రం కాగా, మిగిలిన రెండూ "చిరంజీవులు","కన్యాశుల్కం".వీటిలో మొదటి చిత్రం ఫ్లాప్ కాగా మిగిలిన రెండు చిత్రాలూ విశేష ప్రేక్షకాదణకు నోచుకున్నాయి. రాణీ రత్న ప్రభ కథ నచ్చక వదిలినా,ఆ విషయాన్ని నిర్మాత ప్రార్థన మీద,యన్ టి ఆర్ కి కాల్షీట్లు అడ్జెస్ట్ కాక నటించటం లేదని అసత్యం చెప్పాల్సి వచ్చింది నటసామ్రాట్ కి.రాణీ రత్న ప్రభ చిత్రానికి బి.ఎ.సుబ్బారావు నిర్మాత.ఊటీలో భార్య అన్నపూర్ణమ్మ గారితో ఉండగా,ఆ చిత్రం ఆడకపోతే ఆయన పరిస్థితి ఏమవుతుందోనని ఆందోళనతో ఎ యన్నార్ నిద్రలేని రాత్రులు గడిపారట.