ఉహల పల్లకీలో ఊరేగించనా.. అంటూ పాటల పల్లకీలో శ్రోతల హృదయాలను ఊయలలూగించి మంచి పాటను ఇష్టపడే రసహృదయాలను "తూనీగా తూనీగా ఎందాకా పరిగెడతావే రావే నావంక.." అంటూ తనవైపు తిప్పుకున్న చక్కటి గాయని ఉష. తియ్యనైన కంఠం, స్వచ్ఛమైన ఉచ్చారణ వెరసి పదహారణాల తెలుగింటి అమ్మాయి ఉష. ఒక గాయనిగా తన మనసులోని భావాలను "తెలుగువన్"కి తెలిపారు ఇలా....
మీ సినీ రంగ ప్రవేశం ఎలా జరిగింది?
జెమినీ, ఈటీవీలలో పాడినప్పుడు ఆ ప్రోగ్రామ్స్ ఎగ్జిక్యూటివ్ ఎన్.బి.శాస్త్రిగారితో పరిచయం అయింది. హైదరాబాద్‌లో వాయిస్ టెస్ట్‌లు చేస్తున్నారు. మీరు ఒకసారి రండి" అని చెప్పి పూర్ణచంద్రరావుగారి ద్వరా నన్ను వందేమాతరం శ్రీనివాస్ గారికి పరిచయం చేశారాయన. వాయిస్ ఓకే అయిన తర్వాత "ఇల్లాలు' సినిమాలో నా మొదటి పాట పాడాను. తర్వాత శశిప్రీతమ్ గారి సంగీతంలో "హలో.. ఐ లవ్‌యూ"లో పాడాను. ఆ తర్వాత ఆర్.పి.గారి మ్యూజిక్‌తో "చిత్రం"లోకు పాడాను.
మీరు గాయని కావటానికి ఇన్‌స్పిరేషన్ ఎవరు?
మా అమ్మ. నా చిన్నతనంలో మా అమ్మ పాడటం చూసే నేను కూడా సింగర్‌ని కావాలనుకున్నాను. అయితే సినిమాలకు పాడతానని ఎప్పుడూ అనుకోలేదు.
పాట మీద ఇంట్రెస్ట్ ఎలా కలిగింది మీకు?
మా అమ్మగారిది అమలాపురం, మా నాన్నగారిది తణుకు. ఉద్యోగరీత్యా మా నాన్నగారు నాగార్జునసాగర్ వచ్చారు. అక్కడే నేను పుట్టాను. మాది సంగీత కుటుంబమే. మా తాతగారు కాశీబొట్ల అయ్యన్న శాస్త్రిగారు వయొలిన్ విద్యాంసులు. మా అమ్మ, నాన్న కూడా సింగర్స్. వాళ్ళు పాడుతూ ఉంటే నాకు తెలియకుండానే వారితో గొంతు కలిపేదాన్ని. అలా పాటపై నాకు ఇంట్రెస్ట్ కలిగింది. మూడు సంవత్సరాల వయసు నుండి పాడుతున్నాను.
మొదటిసారి ఎక్కడ పాడారు?
ఎక్కడా.. అంటే పర్టిక్యులర్‌గా చెప్పలేను కానీ, కాంపిటీషన్స్‌లో మాత్రం రెగ్యులర్‌గా పాల్గొనేదాన్ని. జెమినీలో నవరాగం, ఈ టీవీలో పాడుతా తీయగా ప్రోగ్రాంలలో నేను పాల్గొన్నాను.
ఏ తరహా పాటలు మీరు ఎక్కువగా పాడాలనుకుంటున్నారు?
ఈ తరహా పాటలను మాత్రమే పాడాలని ఏ నియమం పెట్టుకోలేదు. అన్ని పాటలనూ పాడాలని వుంది. అయితే ఆ అవకాశం రావాలి కదా!?
మీరు ఎం.పి.ఏ. చేస్తూ సింగర్‌గా మారారు కదా. రెండు చోట్లా మీ కెరీర్‌ని ఎలా మ్యానేజ్ చేస్తున్నారు?
ఈ విషయంలో మ్మూజిక్ డైరెక్టర్స్‌కి, మా కాలేజీ వారికి థాంక్స్ చెప్పుకోవాలి. నేను షాదన్ కాలేజీలో చదివేటప్పుడు మాకు మార్నింగ్ క్లాసులు జరుగుతూ ఉండేవి. క్లాసులు అయిన తర్వాత రికార్డింగ్‌కు వెళ్ళేదాన్ని. ఒకవేళ మార్నింగ్ రికార్డింగ్ ఉంటే కాలేజీలో పర్మిషన్ తీసుకునేదాన్ని. రికార్డింగ్‌లకు వెళ్తున్నా చదువు మాత్రం అశ్రద్ధ చేయలేదు.
ఇప్పటి వరకూ మీరు పాడిన పాటలలో ఎక్కువగా కష్టపడి పాడినా గుర్తింపు రాని పాట ఏదైనా వుందా?
అన్ని పాటలను కష్టపడే పాడతాము. పాట బాగా రావటానికి రెండు మూడు టెక్స్ తీసుకోవటం కూడా జరుగుతుంది. అయితే ఈ పాట బాగా గుర్తింపు తెస్తుంది అని అనుకున్నది సరైన గుర్తింపుకు నోచుకోకపోతే కొంచెం బాధగానే ఉంటుంది. అలా "మా బాపు బొమ్మకు పెళ్లంట" చిత్రంలో నేను పాడిన "మాటలే రాని వేళ పాట ఎలా పాడను.. కంటిలో కడలినింక ఎంతసేపు ఆపను" పాట చాలా మంచి పాట. అది ప్రేక్షకాదరణ సరిగా పొందలేకపోయిందనే బాధ ఉంది.
మీరు ఎక్కువగా ఆర్.పి. సంగీతంలోనే పాడుతున్నారు. ప్రత్యేకమైన కారణం ఏమైనా ఉందా?
ప్రత్యేకమైన కారణం అంటూ ఏమీ లేదు. ఇళయరాజా గారికి పాడాను. వందేమాతరం, కీరవాణి, మణిశర్మ, కోటి, చక్రి, దేవీశ్రీప్రసాద్, అనుప్, శశిప్రీతమ్ గార్లు ఇలా అందరి దగ్గరా పాడాను. ఒక్క రెహమాన్‌గారికే నేను పాడలేదు. అయితే ఆర్.పి.గారు నాకు ఇచ్చిన పాటలన్నీ హిట్ కావటం... వాటితో ప్రజలకు బాగా చేరువ అయి, ఆర్.పి. సినిమా అంటే ఉష పాడుతుంది అని అన్పిస్తుందంతే.
ఇళయరాజా గారిలాంటి గ్రేట్ మ్యుజిషియన్‌తో పనిచేయటం ఎలా అన్నించింది?
కనీసం ఆయనను దగ్గర నుండి చూస్తానని కూడా ఊహించలేదు. అటువంటి ఆయన సంగీతంలో పాడే అవకాశం రావటం నా అదృష్టం. "శంభు" సినిమాకు రికార్డింగ్ కోంచెం అలస్యం అయింది. సాధారణంగా ఆయన ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడరంట. అటువంటిది ఆయన నాతో తన ఎక్స్‌పీరియన్స్, ఎలా పాడాలి, ఎక్కడ కట్ చేయాలి లాంటి విషయాలెన్నో చెప్పారు. నిజంగా అదో గ్రేట్ ఎక్స్‌పీరియన్స్. "శంభు" సినిమాకు పాటల పిక్చరైజేషన్ అయిపోయిన తర్వాత ట్యూన్స్ చేయటం జరిగింది. పిక్చరైజేషన్ అయిపోయిన పాటకి వాళ్ల మూమెంట్స్ చూస్తూ ట్యూన్ చేయటం నిజంగా గ్రేట్.
తొలిసారి నంది అవార్డు అందుకున్నప్పుడు మీ ఫీలింగ్...?
చాలా సంతోషం వేసింది. మరోప్రక్క నిజంగా నాకు వచ్చిందా అని అనుమానం... కన్ఫర్మయిన తర్వాత ఫ్రెండ్స్‌కి, అసోసియేట్స్‌కి, బంధువులకు ఫోన్ చేసి చెప్పాను. ఆ రోజంతా చాలా సంతోషంగా గడిపాను.
మంచి సింగర్ కావాలనుకునే వారికి మీ సలహా ఏంటి అని అడిగితే మీ రియాక్షన్ ఏంటి?
సలహాలు ఇచ్చే స్టేజ్‌లో నేను లేను, అంత వయసు కూడా నాకు లేదు. అయితే నేను చెప్పేది ఒకటే బి. కాన్ఫిడెంట్ వాట్ యూ ఆర్. ఏ దశలోనూ కాన్ఫిడెన్స్ వదలకూడదు. ఎంత చిన్న అవకాశాన్ని అయినా సద్వినియోగం చేసుకోవటానికి ప్రయత్నించండి.
ప్రవేట్ ఆల్బమ్స్ చేసే ఆలోచన ఉందా?
చేయాలనే ఉంది. కానీ అన్నీ కలిసి రావాలి కదా! దేవుడు అనుగ్రహిస్తే తప్పకుండా ఓ ప్రైవేట్ ఆల్బమ్ చేస్తా.
మీరు అభిమానించే సంగీత దర్శకుడు?
ఎవరు మంచి సంగీతం ఇస్తే వాళ్లే నా అభిమాన సంగీత దర్శకులు.