నటుడు కృష్ణ పూర్తి పేరు ఘట్టమనేని శివరామకృష్ణమూర్తి. ఈయన గుంటూరు జిల్లా తెనాలి తాలూకా బుర్రిపాలెంలో 31-05-1943లో జన్మించారు. శ్రీమతి నాగరత్నమ్మ, శ్రీ వీరరాఘవయ్య చౌదరి ఈయన తల్లిదండ్రులు. 1970లో కృష్ణ "పద్మాలయా' పతాకంపై చిత్ర నిర్మాణం ప్రారంభించారు. ఈ సంస్థ నిర్మించే చిత్రాలను ఆయన సోదరులు జి. హనుమంతరావు, జి. ఆదిశేషగిరిరావులు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. పద్మాలయా పతాకంపై ఆదిశేషగిరిరావు, హనుమంతరావు నిర్మాణ వ్యవహారాలు చూసుకుంటూ "అగ్ని పరీక్ష, మోసగాళ్లకు మోసగాడు" చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం మొత్తం రాజస్తాన్ ఎడారిలో తీయడబడింది. డూండీ నిర్మించిన "గూఢచారి 116" చిత్రంతో నటుడు కృష్ణ జేమ్స్ బాండ్ తరహా పాత్రకు గుర్తింపు రాగా, కౌబాయ్ హీరోగా గుర్తింపు తెచ్చిన చిత్రం "మోసగాళ్లకు మోసగాడు'. నటుడు ఎమ్. ప్రభాకరరెడ్డి భాగస్థడుగా "పండంటి కాపురం" 45 రోజుల్లో 60 రోల్స్ (రోల్ అంటే ఆ రోజుల్లో వెయ్యి అడుగులు) నెగిటివ్‌తో చిత్రాన్ని తీశారు. తర్వాత ఎన్.టి. రామారావుతో "దేవుడు చేసిన మనుషులు". ఈ చిత్రం అవుట్‌డోర్ షూటింగ్‌ను అశేష జనవాహిని మధ్య ప్రముఖ హీరోలతో క్లయిమాక్స్ దృశ్యాల్ని బందరులో చిత్రీకరించారు. తర్వాత తీసిన చిత్రం "అల్లూరి సీతారామరాజు". ఆనాడు పరిశ్రమలో వున్న నటీనటులందరూ ఈ చిత్రంలో నటించారు. ఈ చిత్రం షూటింగ్ జరిగింనంత కాలం మద్రాసులో కొరతతో 10-15 సినిమాలు నిర్మాణం ఆగిపోయింది. విజయావారి "మాయాబజార్" తర్వాత అంత మంది నటీనటులు పాల్గొన్న చిత్రం "అల్లూరి సీతారామరాజు". ఈ చిత్రానికి వి. రామచంద్రరావును దర్శకుడిగా నియమించి, టైటిల్స్‌లో ఆయన పేరే వేసినా, చిత్రం ప్రారంభ దశలోనే మరణించటం వల్ల చిత్రం మొదటి నుంచి చివరి వకూ నటుడు కృష్ణే దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి రచన చేసింది త్రిపురనేని మహారధి. మహాకవి శ్రీశ్రీ రాసిన "తెలుగు వీరలేవరా" పాటకు జాతీయ అవార్డు వచ్చింది. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు అంజలి పిక్చర్స్ అధినేత ఆదినారాయణరావు. అల్లూరి సీతారామరాజు సోదరుడు అల్లూరి సూర్యనారాయణరాజు చిత్రం విడుదల సమయంలో మా అనుమతి లేకుండా చిత్రం ఎలా తీస్తారని కోర్టుకు వెళ్లారు. అయితే కోర్టు ఆయనకు అనుకూలంగా తీర్పు చెప్పలేదు. కానీ ఈ చిత్రం శతదినోత్సవ సభలో కృష్ణ సోదరులు ఆయన్ని పిలిచి కొంత మొత్తాన్ని అందజేసి కృతజ్జతలు తెలుపుకున్నారు. "సీత" అనే పాత్రలేదని సినిమా కోసం పెట్టారని ఆయన వాదన, ప్రభుత్వ రికార్డుల్లో సీత గురించి సమాచారం లేకపోయినా, జనబాహుళ్య ప్రచారంలో ఉండటం వలన నిర్మాతలు ఆ పాత్రను చిత్రంలో ఉంచారు. తర్వాత "పాడిపంటలు, రామరాజ్యంలో రక్తపాతం, పండంటి సంసారం" వంటి ఎన్నో చిత్రాల్ని నిర్మించారు. 1980లో పద్మాలయా సంస్థ హిందీ చిత్ర రంగంలో కూడా ప్రవేశించింది. పద్మాలయా వారు తమ హిందీ చిత్రాలన్నీ మద్రాస్‌లోనే నిర్మించారు. కృష్ణ దర్శకత్వంలో తెలుగులో తొలి 70 ఎం.ఎ.ఎం. చిత్రం "సింహాసనం". ఇదే చిత్రాన్ని జితేంద్ర హీరోగా హిందీలో కూడా నిర్మించారు.