1962లో,జూలై 28న,తాడేపల్లి గూడెంలో జన్మించిన పసుపులేటి వెంకట బంగారు రాజు,అక్కడే బి.యస్సి చదివి,అక్కణ్ణించి ఆగ్రా యూనివర్సిటీలో అగ్రికల్చర్ ఎకనమిక్స్ పూర్తిచేసి,సినిమాల మీద ఆసక్తితో కెమెరా అసిస్టెంట్ గా కొన్నాళ్ళు పనిచేసి, అసిస్టెంట్ ఎడిటర్ గా కొన్నాళ్ళు పనిచేసి, తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసి దర్శకత్వంలో అవసరమైన అనుభవం సంపాదించి దర్శకుడిగా మారి తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు.ఇదేంట్రా బాబూ ఈ వెంకట బంగార్రాజెవరూ...తెలుగు సినీ పరిశ్రమలో ఈ డైరెక్టర్ పేరు మేమెక్కడా వినలేదే అని మీరు అనుకుంటూండవచ్చు.ఆయన మరెవరో కాదండీ రామ్ గోపాల వర్మ వద్ద దర్శకత్వం శాఖలో పనిచేసి,1995లో జె.డి.చక్రవర్తి,మహేశ్వరి జంటగా నటించిన"గులాబి"చిత్రానికి తొలిసారి దర్శకత్వం వహించిన కృష్ణవంశీ అసలు పేరే వెంకట బంగారు రాజు."మనీమనీ" చిత్రంలో తొలిసారిగా కృష్ణ వంశీ పేరు వెండితెర మీద కనపడింది. "గులాబి" చిత్రం ఆ రోజుల్లో ఎంత సంచలనం సృష్టించిందంటే,ఆ సినిమాలోని "ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో" అన్న పాట హమ్ చేయని యువతీ యువకులు ఆంధ్రదేశంలో లేరంటే అతిశయోక్తి కాదు.ఈ సినిమా చూసిన యువ సామ్రాట్ నాగార్జున1996లో
"నిన్నే పెళ్ళాడుతా"చిత్రానికి దర్శకత్వం బాధ్యతలను కృష్ణ వంశీకి అప్పగించారు.ఈ సినిమా ఈ రోజు విడుదలైనా మళ్ళీ ఘనవిజయం సాధించేలా ఉంటుంది.అంటే ఆ సినిమా అంత ఫ్రెష్ ఫీల్ తో నిండి ఉంటుంది.అలాగే 1999 లో నాగార్జున,రమ్యకృష్ణ జంటగా "చంద్రలేఖ"అనే చిత్రానికి కృష్ణ వంశీ దర్శకత్వం వహించారు.కానీ ఆ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు.2000 లో జగపతిబాబు హీరోగా "సముద్రం" చిత్రానికి ఆయన దర్శకత్వం వహించినా అది కూడా అనుకున్న స్థాయిలో ఆడలేదు.2001లో ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా,సోనాలీ బేంద్రే హీరోయిన్ గా "మురారి"చిత్రానికి ఆయన దర్శకత్వం వహించగా,ఆ చిత్రం ఒక క్లాసిక్ సుపర్ హిట్ చిత్రంగా మహేష్ బాబుకి నిజమైన తొలి హిట్ చిత్రంగా నిలిచి అతనికి ఒక స్టార్ఇమేజ్ ని సొంతం చేసింది.నిజానికి మహేష్ బాబు సినీ జీవితంలో "మురారి"తొలి హిట్ చిత్రమని చెప్పాలి.
తర్వాత సాయికుమార్,సౌందర్య,ప్రకాష్ రాజులతో పాటు జగపతి బాబు ఒక విభిన్నమైన పాత్రలో నటించిన "అంతఃపురం"చిత్రం ఆయన దర్శకత్వం ప్రతిభకు నిదర్శనంగా నిలిచింది.ఈ చిత్రాన్నే హిందీలో కరిష్మా కపూర్,నానా పటేకర్,షారూఖ్ ఖాన్,ఐశ్వర్యారాయ్ లతో "శక్తి"గా నిర్మించగా ఆ చిత్రానిక్కూడా కృష్ణ వంశీ గారే దర్శకత్వం వహించారు.ఇక 2002లో వచ్చిన "ఖడ్గం"ఒక సంచలనాన్నే సృష్టించింది.రవితేజ,ప్రకాష్ రాజ్,శ్రీకాంత్ లు నటించగా ఈ చిత్రానికి కృష్ణ వంశీ దర్శకత్వం వహించారు.హిందూ,ముస్లిం గొడవల మీద,పాకిస్తాన్ మన దేశంలో సృష్టిస్తున్న టెర్రరిజం మీద ఈ చిత్రంలో చాలా ఘాటైన చర్చ జరిగింది.2004 లో "శ్రీ ఆంజనేయం"అనే చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో నిర్మించారు కృష్ణ వంశీ.ఇక్కడ ఒక విషయం గురించి చెప్పాలి.ఆయన ఏదైనా ప్రయోగం చేయదల్చుకుంటే తన సోంత డబ్బుతోనే చేశారు గానీ వేరే ఏ నిర్మాత డబ్బుతోనూ ప్రయోగాలు చెయ్యలేదు.సినీ పరిభాషలో చెప్పాలంటే ఒట్టి అమాయకులు కృష్ణ వంశీ.లేకపోతే కృష్ణ వంశీ చెపితే మునగటానికి సిద్ధంగా బోల్డుమంది నిర్మాతలుండగా స్వయంగా తానే మునిగే పెద్దమనిషి కృష్ణ వంశీ తప్ప ఇంకెవరుంటారు చెప్పండీ ఈ సినీ మాయాలోకంలో.2005లో ప్రభాస్ హీరోగా "చక్రం"చిత్రానికి దర్శకత్వం వహించి ప్రభాస్ కి నటన నేర్పారాయన.ఈ చిత్రంలో తెలుగు సినీ పరిశ్రమ మర్చిపోయిన సీనియర్ నటులు,నిర్మాత, దర్శకులు అయిన పద్మనాభం గారికి ఒక మంచి వేషం ఇచ్చారు కృష్ణ వంశీ.అది ఆయనకు సీనియర్స్ మీద ఉన్న గౌరవం.ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది.
2005లో సహజసిద్ధమైన వెలుతురులో "డేంజర్"అనే చిత్రం తీశారాయన.సాంప్రదాయ లైట్లను వాడకుండా తీసిన తొలి తెలుగు సినిమా "డేంజర్".ఇదీ ఒక ప్రయోగమే.ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద ఢమాల్ అంది.2006 లో జూనియర్ యన్.టి.ఆర్.హీరోగా,ఇలియానా,
ఛార్మిలు హీరోయిన్ లుగా "రాఖీ"అనే చిత్రం వచ్చింది.అప్పటి వరకూ ఫ్లాప్ ల వలయంలో చిక్కుకు పోయిన యన్.టి.ఆర్.కి ఈ చిత్రం ఒక మంచి హిట్ చిత్రంగా నిలవటమే కాకుండా అతనిలోని నటనా ప్రతిభను మరింత బాగా వెలికితీసిన చిత్రంగా కూడా నిలిచింది.ఈ చిత్రంలో ముఖ్యంగా క్లైమాక్స్ సీన్ లో యన్.టి.ఆర్.నటన "బొబ్బిలి పులి"చిత్రంలో క్లైమాక్స్ లో పెద్ద యన్.టి.ఆర్.నటన గుర్తు చేసిందని పలువురు సినీ పెద్దలు వ్యాఖ్యానించారు.2007లో "చందమామ"చిత్రంలో సినీ పరిశ్రమ మొత్తం ఐరన్ లెగ్గులని ముద్రవేసిన సింధూ మీనన్,నవదీప్,శివబాలాజీ,కాజల్ అగర్వాల్ వంటి వారినే జంటలుగా నటింపజేసి సూపర్ హిట్ కొట్టటం ఒక్క కృష్ణ వంశీకే చెల్లింది. 2009లో తరుగులో ఉన్న హీరో తరుణ్ హీరోగా,జెనిలియా హీరోయిన్ గా "శశిరేఖా పరిణయం"చిత్రానికి దర్శకత్వం వహించారు.ఇది మంచి హిట్టయ్యింది.ఇవన్నీ ఒకెత్తయితే 2009లో కృష్ణ వంశీ దర్శకత్వంలో వచ్చిన శ్రీకాంత్ నూరవ చిత్రం "మహాత్మ"చిత్రం ఒకెత్తు. మన దేశానికి స్వరాజ్యం సంపాదించిన జాతిపిత మహాత్మా గాంధీ ఆశయాలపై,ఆయన సిద్ధాంతాలపై ఈ చిత్రంలో చర్చించారు.గాంధీ ఎవరు అని అడిగితే రిచర్డ్ అటెన్ బరో అనో,సోనియా గాంధీ అనో,రాహుల్ గాంధీ అనో చెప్పే నేటి తరానికి ఆ మహనీయుని గురించి తెలియజెప్పిన కృష్ణ వంశీని ఎంత అభినందించినా తక్కువే.2010 లో కృష్ణ వంశీ ఇంకా తన సినిమా గురించి ఎటువంటి ప్రకటన చేయలేదు.ఆంధ్రాటాకీస్ అనే బ్యానర్ ను స్థాపించి "సింధూరం"చిత్రం ద్వారా రవితేజను హీరోని చేసిన ఘనత కృష్ణ వంశీది.ఇక ఆయనకొచ్చిన అవార్డులు రివార్డుల గురించి చూస్తే ఆరుసార్లు నంది అవార్డులు సంపాదించారాయన."ఖడ్గం"చిత్రానికి ఫిలింఫేర్ అవార్డుని,సింధూరం,నిన్నే పెళ్ళాడుతా చిత్రాలకు ఉత్తమ ప్రాంతీయ చిత్రాలుగా,జాతీయ అవార్డులను కృష్ణవంశీ పొందారు.ఆయన ప్రముఖ సినీ నటి రమ్యకృష్ణను ప్రేమ వివాహం చేసుకోగా,వారికి రిత్విక్ అనే బాబు జన్మించాడు.అటువంటి చక్కని క్రియెటివిటీ ఉన్న దర్శకుడు కృష్ణ వంశీ మరిన్ని మంచి చిత్రాలకు దర్శకత్వం వహించాలని కోరుతూ ఆయనకు తెలుగువన్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తోంది.