కళలకు చిన్నా పెద్దా తారతమ్యాలు లేవు. పుట్టిన ప్రతి మనిషిలోనూ ఏదో కళ దాగుండే వుంటుంది. తమలో దాగున్న కళలకు పదునుబెట్టి పదిమంది యెదుట వాటిని ప్రదర్శిస్తేనే కళలకు సార్థకత చేకూరుతుంది. అందుకనే కళాకారులను కారణజన్ములంటారు. కళాకారులను నాటి రాజుల కాలం నుండీ నేటివరకూ ఆదరిస్తున్నారు. కళాకారులకు ఓ ప్రత్యేకమైన గుర్తింపూ, గౌరవం లభించడం మనం గమనించే వుంటాం కదా! అలాంటి గౌరవాన్నీ, ప్రతిభాపాటవాల్నీ సొంతం చేసుకొని చలనచిత్రసీమలో రాణిస్తూ, కళామతల్లి ముద్దుబిడ్డలుగా చరిత్ర సృష్టిస్తోన్న బాల కళాకారుల గురించి మీ కోసం....
దర్శీల్ సఫారీ:- నేడు దేశవ్యాప్తంగా దర్శీల్ పేరు తెలియని వారు లేరంటే అతిశయోక్తి కాదు. బాలీవుడ్ నటుడు అమీర్‌ఖాన్ నటించిన "తారే జమీన్ పర్" చిత్రంలో అద్భుతంగా నటించి అందరి హృదయాలనూ దోచుకున్న బాల కళాకారుడు దర్శీల్ సఫారీ. ఈ ఒక్క చిత్రంతోనే ఈ బాలనటుడు ఎంతో పాపులర్ అయ్యాడు. అద్భుతమైన పాత్ర రావడం, వచ్చిన చక్కని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంతో దర్శీల్ నేడు సెలబ్రిటీగా మారిపోయి మంచి పేరు ప్రఖ్యాతుల్ని సొంతం చేసుకున్నాడు. షైమక ధావర్స్ డాన్స్ అకాడమీలో నృత్యాన్ని నేర్చుకుంటుండగా చూసిన బాలీవుడ్ నటుడు అమీర్‌ఖాన్, ఆ బాలుని లో దాగున్న ప్రతిభకు ముగ్ధుడై తన చిత్రంలో నటించేందుకు ఆ బాలునికి అవకాశాన్నిచ్చి ప్రోత్సా హించాడు. ఈ సినిమాతో ఆ బాలుని దశ తిరిగి నటుడిగా మంచి గుర్తింపును పొందాడు. ఎన్నో ఇంటర్వ్యూలనివ్వడమేకాక, ఒక అవార్డును కూడా సొంతం చేసుకున్నాడు. ఎన్నో కమ్మర్షియల్ యాడ్స్ లోనూ కనిపించాడు. ప్రస్తుతం దర్శిల్ మరో మంచి ప్రాజెక్టు కోసం ఎదురు చూస్తున్నాడు.
శ్వేతా బసు ప్రసాద్:-
శ్వేతా ప్రసాద్ మంచి నటిగా పేరుప్రఖ్యాతుల్ని సొంతం చేసుకుంది. ఆమె నటించిన "మకడీ, ఇక్బాల్"' చిత్రాలు ఆమెలో దాగున్న అద్భుత ప్రతిభ ను, నటనా కౌశలాన్నీ వెలికితీసాయి. "మకడీ" చిత్రంలో ద్విపాత్రాభినయం చేసి శభాష్ అనిపించుకుందీ బాలతార. "ఇక్బాల్"' చిత్రంలో శ్రేయాస్ తల్పదే సోదరిగా నటించి మెప్పించిందీ తార. ఈ రెండు చిత్రాల్లోనూ ఎమోషన్స్‌ను అద్భు తంగా ప్రదర్శించింది శ్వేత. "ఇక్బాల్" చిత్రంలో నటించినందుకుగాను ఆమెకు జాతీయ అవార్డు లభించింది. ఇటీవల "కొత్తబంగారులోకం, కళవర్ కింగ్, కాస్కో" అనే తెలుగు చిత్రాల్లోనూ నటించి, మంచి నటిగా గుర్తింపు పొందుతోంది.
హన్సికా మోత్వానీ:-
హన్సికా మోత్వానీ బాలీవుడ్‌లోనే కాక టాలీవుడ్ ప్రేక్షకులకూ సుపరిచితురాలే. ఈ తార "షకలక బూం బూం, క్యూన్‌కి సాస్ భీ కభీ బహు థీ, హమ్ దో హై నా" లాంటి టెలివిజన్ సీరియల్స్‌లో నటించి మంచి మార్కులే కొట్టేసింది. టీవీ సీరియల్సే కాక "కోయిమిల్ గయా" అనే చిత్రంలోనూ నటించి మెప్పిం చిందీ అమ్మాయి. మంచి శరీరసౌష్టవంతో, అంద చందాలతో, అభినయకౌశలంతో ప్రేక్షకుల్ని మంత్ర ముగ్ధుల్ని చేసే ఈ తార బాలతారగా ప్రవేశించి, "దేశముదురు" లాంటి అనేక తెలుగు చిత్రాలలో కూడా నటించింది.
"సాంత్రో" యాడ్‌లో షారూఖ్ ఖాన్‌తో కలిసి నటించింది. హిమేష్ రేషమియాతో కలిసి "ఆప్ కా సురూర్" అనే చిత్రంలో నటించిన హన్సిక, ప్రస్తుతం తన దృష్టంతా రాబోవు చిత్రాలపైనే వుందని పేర్కొంటుంది. ఆ చిత్రాలు ఈ సంవత్సరాంతంలో విడుదల కాబోతున్నాయి. అవి కూడా ఆమెకు మంచి పేరు ప్రఖ్యాతులను ఆర్జించి పెట్టా లని కోరుకుందాం.