"రా... జనంలోనే తేల్చుకుందాం": మోహన్ బాబు (Oct 14 09)
ఇటీవల మన రాష్ట్రంలో నాలుగు జిల్లాల్లో సంభవించిన జలప్రళయం, ఆ వరదల్లో అనేకమంది ప్రజానీకం సమస్తం కోల్పోయి బాధల్లో ఉన్నందువల్ల, వారిని ఆదుకునే నిమిత్తం "మా"(మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) ఒక స్టార్ నైట్ కార్యక్రమాన్ని ఏర్పాటుచేసింది. నవంబర్ ఏడవ తేదీన, హైదరాబాద్ లోని గచ్చిబౌలి స్టేడియంలో, "మా"ఆధ్వర్యంలో, యువ రత్న నందమూరి బాలకృష్ణ నాయకత్వంలో, తెలుగు చలన చిత్ర కళాకారులందరూ కలసి కామెడీ స్కిడ్స్, డ్యాన్సులు ఇలా రకరకాల ఎంటర్‌టైన్ మెంట్ కార్యక్రమాలు చేసేందుకు నిర్ణయించారు. దీనికి నిర్మాతల మండలి, ఎ.పి.ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, డైరెక్టర్స్ అసోసియేషన్, ఇంకా సినీ పరిశ్రమలోని మిగిలిన 24 క్రాఫ్టులూ కూడా ఈ కార్యక్ర్తమంలో పాలుపంచుకోటానికి తమ సంసిద్ధతను వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమానికి "స్పందన"అన్న పేరు నిర్ణయించారు. ఈ బృహత్కార్యానికి ఒక్క సినీ పరిశ్రమ వర్గాలే కాకుండా ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించటానికి ముందుకురావాలని వీరు పిలుపునిచ్చారు. అక్టోబర్ 13 వ తేదీన, హైటెక్స్ లోని జయభేరి క్లబ్‍లో జరిగిన విలేఖరుల సమావేశంలోపై వివరాలను తెలియజేశారు. ఈ సమావేశానికి రాకుండా ఉన్న వారిని క్షమించకూడదని డాక్టర్ మోహన్ బాబు చేసిన వ్యాఖ్యకు స్పందిస్తూ మెగాస్టార్ చిరంజీవి టి.వి.సమావేశంలో కొన్ని వ్యాఖ్యలు చేశారు. దానికి ప్రతి స్పందిస్తూ తిరుపతిలో మోహన్ బాబు విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ "నిన్న నేను "మా" ఇచ్చిన పిలుపుకు స్పందిస్తూ ఈ సమావేశానికి రాని వారిని క్షమించరాదన్నానే కానీ వ్యక్తిగతంగా నేను ఏ ఒక్కరినీ పేరుపెట్టి ఆ కామెంట్‍ని చేయలేదు. ఇప్పుడు రాని వారు నవంబర్ 7 వ తేదీన జరుగబోయే కార్యక్రమంలో పాల్గొని ఈ తప్పుని సరిదిద్దుకుంటారని ఆశిస్తున్నానన్నాను. దానికి ప్రజలు క్షమించరనీ, నేను డైలాగులు బాగా చెపుతాననీ ఇంకా ఏదో అన్నాడు చిరంజీవి. నేను చేతల మనిషినే కానీ మాటల మనిషిని కాను. అన్నగారున్నప్పుడు నేనేం చేశానో ఎంతిచ్చానో, కార్గిల్ వార్ సమయంలో నేనెంతిచ్చానో, ఏం చేశానో ఆ విషయాల తాలూకు ఆధారాలూ, వివరాలూ నా దగ్గర భద్రమగా ఉన్నాయి. నేను ఏ సమయంలో ఎలా స్పందించాలో ఒకరు చెపితే తెలుసుకునే స్థితిలో లేను. నేను, నా బిడ్డలు, నా విద్యాలయం విద్యార్థినీ, విద్యార్థులు, అధ్యాపకులు ఏం చేస్తామో ఓ రెండు రోజులు ఓపికపడితే తెలుస్తుంది. ఎవరు ముందిచ్చారు...? ఎవరు ఎక్కువ ఇచ్చారు అన్నది కాదు ముఖ్యం. ఇచ్చారా లేదా అన్నదే ముఖ్యం. ఇవన్నీ చిరంజీవి టి.వి.లో చెప్పాడు కాబట్టి నేను కూడా ఆ మీడియా ద్వారానే చెపుతున్నాను.లేకపోతే ఫోన్ చేసి మాట్లాడగలను. నాదంతా ముక్కు సూటి వ్యవహారం. డొంక తిరుగుడుగా మాట్లాడ్డం నాకు రాదు. ఏమి లేని స్థితి నుండి ఈ రోజున నేనున్న ఈ స్థితికి రావటానికి ప్రజలు, ప్రేక్షకులే కారణం. వారి యెడల నాకెప్పుడూ కృతజ్ఞతా భావం ఉంది... ఉంటుంది.. నన్ను జనం క్షమించరన్నావ్... అలాగయితే రా... జనంలోనే తేల్చుకుందాం.. నువ్వు మా తిరుపతి యమ్.యల్.ఎ.వే కదా. నీకు ఆ పదానికి అర్థం తెలియాలంటే నా "అసెంబ్లీ రౌడీ"సినిమా చూడు."అని అన్నారు.