అనకాపల్లిలో తన తండ్రి అల్లు అరవింద్ పి.ఆర్.పి. తరపున యమ్.పి.గా పోటీ చేస్తూండటంతో, ఆయన తరపున ప్రచారం చేయటానికి యువ హీరో అల్లు అర్జున్ అనకాపల్లికి ఈ రోజు (ఏప్రెల్ 8 వ తేదీ)న బయలుదేరారు. ఆయన జన్మదినం కూడా ఏప్రెల్ 8వ తేదీ కావటంతో తన పుట్టినరోజు వేడుకలు అనకాపల్లిలో జనం మధ్యే జరుపుకోటానికి అల్లు అర్జున్ నిర్ణయించుకొన్నారు. 1983 ఏప్రెల్ 8 వ తేదీన, చెన్నైలో జన్మించిన అల్లు అర్జున్ కి అల్లు వెంకట్ అనే అన్నయ్య, అల్లు శిరీష్ అనే తమ్ముడు ఉన్నారు. అల్లు అర్జున్‌ని పరిచయస్తులంతా బన్నీ అని పిలుస్తుంటారు. ఆయన 2002లో తన మేనమామ మెగాస్టార్, పద్మభూణ్, డాక్టర్ చిరంజీవి హీరోగా నటించిన "డాడీ" చిత్రంలో తొలిసారి నటించారు. నటనలో ఒక రకమైన ఈజ్. డ్యాన్సుల్లో, ఫైట్స్ లో తనకంటూ ఒక స్టైల్ ఏర్పరుచుకుని, అలాగే తనకంటూ ఒక విభిన్నమైన తరహాలో డైలాగ్ మాడ్యూలేషన్‌ని అలవాటు చేసుకుని, అల్లు అర్జున్ నటిస్తే ఆ పాత్ర ఇలా ఉంటుందన్న భావన ప్రేక్షకుల్లో కలిగించాడు కనుకే అల్లు అర్జున్‌కి యువతలో విపరీతమైన ఫాలోయింగ్. తన మేనమామ చిరంజీవే తనకు నటనలో ఇనిస్పిరేషన్ అనీ, ఆయనే తన అభిమాన నటుడనీ అల్లు అర్జున్ చెపుతాడు. అందుకే కఠిన వ్యాయామాలతో సిక్స్ ప్యాక్ బాడీని సాధించారు అల్లు అర్జున్. "మీకెవరు పోటీ అంటే ".. "మా ఇంట్లోనే నాతో కలిపి అయిదుగురు హీరోలున్నారు. ముందు వాళ్ళని గెలిస్తే ఆ తర్వాత బయట హీరోలతో పోటీ పడొచ్చు. మామయ్య తమ లక్ష్యాలకు ఆకాశమే హద్దుగా పెట్టి, ఎప్పటికప్పుడు కొత్త రికార్డులు ఏర్పాటుచేసుకుంటూ వచ్చారు. వాటిని దాటటం అంటే తెలుగు సినీ పరిశ్రమలో నంబర్ వన్ స్థానం సాధించినట్టే. కానీ అది అంత తేలిక కాదు. అది ఒక్క మెగాస్టార్ కే సాధ్యం. "అంటారాయన. అందుకే తన మేనమామ హీరోగా నటించిన "శంకర్ దాదా జిందాబాద్'' చిత్రంలో బన్నీ స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చారు.తర్వాత బన్నీకి నటన మీద ఉన్న శ్రద్ధ చూసిన అతని తండ్రి అల్లు అరవింద్ అతన్ని హీరోగా సినీ పరిశ్రమకు పరిచయం చేసేందుకు ఒక మంచి చిత్రం నిర్మించాలని నిర్ణయించుకుని, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో, అల్లు అర్జున్ హీరోగా "గంగోత్రి" అనే చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం తర్వాత సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన "ఆర్య" చిత్రం సూపర్ హిట్టయి, ఆంధ్రప్రదేశ్‌లోని యువతని ఒక ఊపు ఊపింది. నేటి యువతకు అల్లు అర్జున్ ఒక రోల్ మోడల్‍గా తయారయ్యారంటే ఆశ్చర్యపోనవసరం లేదు. తర్వాత వి.వి.వినాయక్ దర్శకత్వంలో వచ్చిన "బన్నీ" చిత్రం, "తొలిప్రేమ" ఫేం కరుణాకరన్ దర్శకత్వంలో వచ్చిన "హ్యాపీ" చిత్రాలు గొప్ప విజయం సాధించకపోయినా, ప్రేక్షకులను అల్లు అర్జున్ అభిమానులనూ నిరాశపరచలేదనే చెప్పాలి. ట్రెండ్ సెట్టింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో, అల్లు అర్జున్ హీరోగా, హన్సిక మోత్వానీ హీరోయిన్‌గా నటించిన "దేశముదురు" చిత్రం సూపర్ డ్యూపర్ హిట్టయ్యింది. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద, ఒక యువ హీరోగా అల్లు అర్జున్ క్యాలిబర్ ఎంతన్నది నిరూపించింది. ఆ తర్వాత అల్లు అర్జున్ హీరోగా "బొమ్మరిల్లు" భాస్కర్ దర్శకత్వంలో, దిల్‍రాజు నిర్మించిన "పరుగు" చిత్రం కూడా సూపర్ హిట్టయ్యింది. ఒక విధంగా తను నటించిన అన్ని చిత్రాలూ హిట్టయ్యేలా ప్లాన్ చేసుకుంటున్న ఈ యువ హీరో అల్లు అర్జున్ ప్రస్తుతం "ఆర్య-2" చిత్రంలో నటిస్తున్నారు. తన హీరోగా నటించే ప్రతి చిత్రంలోనూ ఏదో ఒక పప్రత్యేకత ఉండేలా చూసుకునే అల్లు అర్జున్, తన ప్రతి చిత్రంలోని పాటలు కూడా సూపర్ హిట్టయ్యేలా జాగ్రత్త పడతాడు. ఏ చిత్రానికైనా ఆడియో హిట్టయ్యిందంటే ఆ చిత్రం సగం విజయం సాధించినట్లే. బన్నీ నటిస్తున్న "ఆర్య-2" చిత్రం కూడా సూపర్ హిట్టవ్వాలని కోరుతూ, అతనికి "తెలుగువన్ డాట్ కామ్'' జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూంది.