ఇతనికి తగిన విధంగానే భార్య కూడా ఉండేది. ఆమె పేరు సోమిదమ్మ. కలలోనైనా భర్త మాటకు ఎదురు చెప్పి ఎరుగని మహా ఉత్తమ ఇల్లాలీమే.
ఇలా ఆనందకరమైన, ఆధ్యాత్మిక జీవనాన్ని గడిపే ఈ దంపతులకు ఒక పుత్రుడు ఉదయిస్తాడు. తమ వంశాన్నినిలబెట్టే పుత్రుడు పుట్టాడని, అలాగే తమకు పున్నామ నరకం నుండి తొలగింప చేసే కుమారుడు కలిగాడని మురిసిపోయే ఆ దంపతుల ఆనందానికి అవధులు ఉండవు . ఆ పుత్రునికి వారు ‘గుణనిధి ‘ అని పేరు పెట్టుకుని ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటు ఉంటారు.
కుమారునికి ఏ వయసు ముచ్చట ఆ వయస్సులో తీర్చుకుంటు పొంగిపోతుంటారా దంపతులు. అలా అక్షరాభ్యాసం, ఉపనయనం తదితర కార్యక్రమాల్ని పూర్తి చేస్తారు. ఈ సందర్భంగా గాయత్రీ మంత్రాన్ని ఉపదేశిస్తూ తన వంశగౌరవాన్ని నిలబెట్టే వాడి గుణనిధి అంటూ ఎంతగానో పరవశుడవుతాడు.
తానొకటి తలిస్తే దైవం మరొకటి తలచాడన్న చందంగా మారుతాడు గుణనిధి. తల్లితండ్రులు ఎంతగానో గారాబంగా, అల్లారుముద్దుగా పెంచడంతో దాన్ని ఉపయోగించుకుని అది అలుసుగా తీసుకుని చెడ్డవారి స్నేహాలు మరిగి ఇష్టం వచ్చినట్లు తిరగడం మొదలుపెట్టాడు. చదువుసంధ్యలు నేర్చుకోకుండా సోమరిపోతై అటు కన్నవారికీ, ఇటు బంధువర్గానికి చెడ్డపేరు తీసుకువచ్చేలా తయారవుతాడు.
|